‘ఘాజీ’.. దగ్గుబాటి రానా లేటెస్ట్ చిత్రమిది. 1971 ఇండో-పాక్ యుద్ధం, ఘాజీ అనే సబ్ మేరైయన్ పై దాడి.. నేపధ్యం తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఉన్నత ప్రమాణాలతో కనిపించింది ఈ సినిమా ట్రైలర్. సంకల్ప్ రెడ్డి అనే హైదారబాది కుర్రాడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయనికి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైయిందో తెలిస్తే ఆసక్తికరంగా అనిపించకమానదు. అసలు ‘ఘాజీ’ని ఈ స్థాయిలో తీస్తామని అనుకోలేదట సంకల్ప్.
ఈ సినిమాకి సంబధించిన జర్నీ ఎలా మొదలైయిందో సంకల్ప్ మాటల్లోనే.. ”’ఆస్ట్రేలియాలో ఫిల్మ్ కోర్స్ చదివా. అది ఇక్కడ ఉపయోగపడుతుందని అనుకున్నా. అదేం జరగలేదు. ఆ ఫిల్మ్ కోర్స్ ఇక్కడ పనికిరాదని అర్ధమైపోయింది. ఓ రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసా. మొబైల్ లోనే. యూట్యూబ్ లో పెట్టి మళ్ళీ తీసేశా. క్వాలటీ నచ్చక. ఈలోగా కొన్ని కధలు అనుకున్నా. ఒకసారి విశాఖ వెళ్ళినప్పుడు అక్కడ ‘ఘాజీ’ సబ్ మేరైయన్ ను చూశా. దాని నేపధ్యం నన్ను ఎంతగానో ఎక్సయిట్ చేసింది. స్క్రిప్ట్ రాసేశా. నేనే సొంతగా సినిమా తీసేయాలని నిర్ణయించుకున్నా. నాకు సీజీ వర్క్ తెలుసు. సినిమా మొత్తం ఆల్రెడీ సిజీలో వర్క్ చేసి చుసేశా. ఇక షూట్ చేయాలని ప్లాన్ చేశా. ఇరవై అయిదు లక్షల బడ్జెట్ అనుకున్నా. సెట్ అయ్యింది. కొంతమంది రంగస్థల నటులను ఎంపిక చేసుకున్నా. హిందీలో సినిమా తీయాలనేది నా మొదటి ప్లాను. ఇంగ్లీష్ లో రాసుకున్న స్క్రిప్ట్ హిందీలో మార్చుకున్నా. నా వర్క్ నచ్చి ఎవరైనా నిర్మాతలు ముందుకు వస్తారనే నమ్మకంతోనే షూటింగ్ మొదలుపెట్టా. నా నమ్మకం నిజమైయింది. రామోహన్ గారి పరిచయంతో ఈ సినిమా స్క్రిప్ట్ రానా దగ్గరకు వెళ్ళింది. రానా ఓకే చెప్పారు. మాట్నీ మూవీస్ ముందుకు వచ్చింది. తర్వాత పీవీపీ గారు మా స్క్రిప్ట్ విని ఎంతో ఎక్సయిట్ అయ్యారు. తర్వాత రానా సహకారంతో ఈ సినిమా కరణ్ జోహార్ వద్దకు వెళ్ళింది. తర్వాత సినిమా స్కేల్ పెరిగిపోయింది. ఇంకా గ్రాండ్ గా స్క్రిప్ట్ రాసుకున్నా. ఒక ఇండిపెండేట్ సినిమా ఇప్పుడు ఇంటర్నేషన్ మూవీగా మారింది. ”ఘాజీ” తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చారు దర్శకుడు సంకల్ప్.