నోట్ల రద్దు నిర్ణయంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రశ్నలు ఎదురవ్వగానే మోడీ సహనం కోల్పోయాడు. సమాధానం చెప్పే పరిస్థితులు ఎలాగూ లేవు కాబట్టి….‘నేను సన్యాసిని…..తట్టా బుట్టా సర్దుకునిపోతా……’ అని ఒక సినిమాటిక్ డైలాగ్ పేల్చాడు. మోడీకి తెలుసో..తెలియదో కానీ సన్యాసి అంటే సంసార బంధాలు లేనివాడు అని కాదు. కోరికలు, ఆశలు లేకుండా స్థిత ప్రజ్ఙత ఉన్నవాడు. మోడీలో ఆ లక్షణాలు ఒక్కటి కూడాలేవు. నియంత లక్షణాలు, సామ్రాజ్యకాంక్ష మాత్రం చాలా బలంగా ఉంది.
ఢిల్లీలో బిజెపిని ఓడించిన కేజ్రీవాల్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం కోసం మోడీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. అలాగే ఎన్నికల ప్రచార సభలలో తనకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీని చంద్రబాబుకు ఆఫర్ చేసి బోలెడంత పబ్లిసిటీ కొట్టేసిన మోడీ….ఇప్పుడు అదే చంద్రబాబుని సామంతుడిగా చేసుకున్నాడు. మోడీలో వచ్చిన మార్పు చూస్తూ ఉంటే చంద్రబాబుకే మతిపోతోంది. కేంద్రప్రభుత్వంతో పెట్టకుంటే కేసుల మెడకు చుట్టుకుంటాయన్న భయం చంద్రబాబుకు లేకపోతే మోడీలో వచ్చిన మార్పుని చంద్రబాబు అస్సలు సహించి ఉండేవాడు కాదు. అలాగే ఎన్నికల సమయంలో తనకు సాయం చేసిన పవన్ కళ్యాణ్‌ని కనీసం పట్టించుకోని కృతఘ్నుడు మోడీ. తన రాజకీయ ప్రత్యర్థులను అణచటం కోసం ఇందిరాగాంధీ స్టైల్‌ని ఫాలో అవుతున్నాడు మోడీ. అలాగే బిజెపి మినహా దేశంలో వేరే ఏ ఒక్క పార్టీని కూడా సహించలేని స్థాయికి వెళుతున్నాడు.
ఇప్పుడు తమిళనాడులో కూడా అదే జరుగుతోంది. శశికళ అర్హత ఏంటి అనే విషయం పక్కన పెడితే అన్నాడిఎంకె ఎమ్మెల్యేలందరూ కూడా శశికళను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్న నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి అవకుండా ఆపే అర్హత కేంద్రప్రభుత్వానికి గానీ, కేంద్రం నియమించిన గవర్నర్‌కి కానీ అస్సలు లేదు. కానీ జయలలిత హాస్సిటల్లో ఉన్ననాటి నుంచే తమిళనాడులో బిజెపి విస్తరణ కోసం పావులు కదుపుతున్న నరేంద్రమోడీ అండ్ కోకి శశికళ ముఖ్యమంత్రి అవడం ఇష్టం లేదు. పన్నీరు సెల్వంలా కాకుండా శశికళ స్వతంత్రంగా వ్యవహరించే ఛాన్స్ ఉండడమే అందుకు కారణం. అందుకే ప్రజాస్వామ్య గొప్పదనం గురించి, మన రాజ్యాంగ విశిష్టత గురించి గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు కాస్తా రాజకీయ కుట్రలకు తెరలేపారు. తమిళనాడులో బిజెపి విస్తరణే ప్రాతిపదికగా ప్రజల చేత ఎన్నుకోబడిన అన్నాడిఎంకె పార్టీని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతటి రాజ్యకాంక్ష ఉన్న మోడీ సన్యాసి ఎలా అవుతాడో ఆయనే చెప్పాలి మరి. ఎప్పుడూ గాంధి కుటుంబం రాజకీయాలు అంటూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను విమర్శిస్తూ ఉంటారు కానీ ఆచరణలో మాత్రం తమిళనాడులో ఇప్పుడు బిజెపి చేస్తున్న రాజకీయాలకు, కాంగ్రెస్ చేసిన రాజకీయాలకు తేడా ఏంటో మోడీ, అమిత్ షా, వెంకయ్యనాయుడులాంటి వాళ్ళు చెప్పగలరా?