ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు అంటారు! ఇప్పుడు వైకాపా కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు అనిపిస్తోంది! ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి చాలామంది ఎమ్మెల్యేలు బయటకి పోయారు. పదవులూ కాంట్రాక్టులు.. ఆశలు ఏవైతేనేం, తెలుగుదేశం వేసిన రాజకీయ వలలోపడ్డారు. కొంతమంది జంప్ జిలానీలకు మంత్రి పదవులు కూడా ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపా వ్యూహం మార్చుకుంటున్నట్టు సమాచారం. పార్టీలోకి కొత్త నాయకుల్ని చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై కొంతమంది సీనియర్ నేతలతో జగన్ సమావేశాలు జరిపారని, సూచనలూ సలహాలూ తీసుకున్నారని అంటున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వైకాపా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే, గత ఎన్నికల్లో ఆ జిల్లాల్లోనే వైకాపా ఆదరణకు నోచుకోలేదు. ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమౌతున్నారు. ఇదే క్రమంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన నాయకుల్ని కూడా మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని వైకాపా వర్గాలు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే కాంట్రాక్టులు, పనులు వంటివి వస్తాయన్న ఆశతో కొంతమంది నాయకులు వెళ్లినా… ఆశించిన స్థాయిలో అక్కడ వారికి గుర్తింపు ఉండటం లేదన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది. మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావడం.. టీడీపీలో అంతర్గతంగా ఆశించిన స్థాయి దక్కకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైకాపాలోకి నాయకుల్ని ఆహ్వానించే ప్రక్రియ మొదలుపెడితే… గతంలో వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందని జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఇది నైతికంగా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే, నాయకుల్ని చేర్చుకునే ప్రక్రియ గోదావరి జిల్లాల నుంచి మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. వారు ఆశించినట్టు ఈ వ్యూహం వర్కౌట్ అయి… టీడీపీకి వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఒక్కరు తిరిగొచ్చినా తెలుగుదేశం పార్టీ అభాసుపాలు కావడం తప్పదనే చెప్పాలి. మరి, ఈ రివర్స్ ఆకర్ష్ విషయంలో టీడీపీ మార్కు వ్యూహం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది!