తమిళనాడులో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వమ్ రాజీనామా చేసి, చిన్నమ్మ శశికళకు లైన్ క్లియర్ చేశారని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయన అడ్డం తిరిగారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారనీ, సీఎంగా తాను చాలా సాధించానని రివర్స్ అయ్యారు పన్నీర్ సెల్వమ్. అంతేకాదు, అమ్మ జయలలిత సమాధి ముందు కాసేపు మౌనదీక్ష చేశారు. అమ్మ ఆత్మ తనతో చాలా చెప్పిందని ఆయన అంటున్నారు. ఒక్కసారిగా దేశమంతా తనవైపు అటెన్షన్‌తో చూసేలా చేశారు. అయితే, ఉన్నట్టుండి పన్నీర్‌కు ముఖ్యమంత్రి పదవి మీద మమకారం పెరిగిందా..? వేరే రాజకీయ శక్తులు ఆడిస్తున్నట్టుగా పన్నీర్ ఆడుతున్నారా..? ఆయన్ని నడిపిస్తున్న అంతర్గత శక్తులేవి అనే చర్చకు తెరలేచింది.
నిజానికి, పన్నీర్ సెల్వమ్ స్వతహా చాలా మెతక మనిషి అనే ఇమేజ్ ఉంది. అమ్మకు అనుంగు శిష్యుడిగా ఉంటూ వచ్చారు. శశికళ కోసం ఆయన రాజీనామా చేశారని కూడా అన్నారు! అంతా సాఫీగా జరిగితే ఈపాటికే శశికళ ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ, ఆమెను ప్రభుత్వం ఏర్పాటు చేయమంటూ గవర్నర్ విద్యాసాగరరావు ఆహ్వానించలేదు. జయ అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో శశికళ ఎక్యూజ్డ్ 2గా ఉన్నారు. కేసు విషయమై సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వ్ చేసి ఉందనీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ సలహా తీసుకునేందుకు గవర్నర్ ప్రయత్నించడంతో మొత్తం వ్యవహారం మారిపోయింది.
అనూహ్యంగా పన్నీర్ యూ టర్న్ తీసుకున్నారు. అయితే, పన్నీర్‌ను నడిపిస్తున్నది ఎవరు అనేదానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో ఎం.జి.ఆర్.తో కలసి పార్టీలో కీలకంగా ఉన్న కొంతమంది సీనియర్లు ఇప్పుడు యాక్టివేట్ అయ్యారనీ, శశికళ నుంచి పార్టీనీ రాష్ట్రాన్నీ రక్షించాలన్న ఉద్దేశంతో ఓ వ్యూహం రచించారనీ, ఆ సీనియర్ల సలహా మేరకే పన్నీర్ ఇదంతా చేస్తున్నారన్నది ఓ వాదన.
ఇక, తమిళనాట పరిస్థితుల వెనక భాజపా వ్యూహం ఉండొచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. శశికళ సీఎం కావడం చాలామంది తమిళులకు నచ్చని వ్యవహారంగా అర్థమౌతోన్న వేల.. ఇప్పటికే నిరసనలు పెరిగాయి. ఇంకోపక్క కేసులూ తీర్పులూ కూడా కొంత తలనొప్పిగానే పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పన్నీర్ ను కొనసాగించడమే మంచిదనే అభిప్రాయం కేంద్రానికి కూడా కలిగి ఉండొచ్చు. అయితే, అన్నాడీఎంకేలో అత్యధిక ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉన్నారన్నది వాస్తవం. గత ఎన్నికల్లో తన అనుచరులకు సీట్లు తెప్పించుకోవడంలో శశికళ కీలక పాత్ర పోషించారన్న సంగతి మరచిపోకూడదు. మొత్తానికి, తమిళ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయాయి.