ఆమధ్య ఎన్టీఆర్ సినిమా ‘టెంపర్’ కోసం నారాయణమూర్తిని పూరి జగన్నాథ్ సంప్రదించడం.. మూర్తి గారు ‘సున్నితం’గా తిరస్కరించడం జరిగిందని వార్తలొచ్చాయి. వాటిపై నారాయణ మూర్తి కూడా సమాధానం ఇచ్చాడు. అయితే… ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక ఆసక్తికరమైన సంఘటనలే జరిగాయని టాక్. అవి కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి.
పూరికి నారాయణమూర్తి అంటే చాలా అభిమానం. దేశముదురు టైటిల్ కార్డ్స్‌లో దర్శకత్వం.. అనే చోట నారాయణమూర్తి ఫొటో సింబాలిక్ గా వేసుకొన్నాడు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని మూర్తిగారికి అంకితం ఇచ్చాడంటే.. ఆ ప్రేమని, అభిమానాన్నీ అర్థం చేసుకోవొచ్చు. ‘టెంపర్’లో నిజాయతీ పరుడైన పోలీస్ కానిస్టేబుల్ పాత్ర రాసుకొంటున్నప్పుడు నారాయణమూర్తి తప్ప – ఆ పాత్రలో ఇంకెవ్వర్నీ ఊహించుకోలేకపోయాడు పూరి. అందుకే నారాయణమూర్తి అని పేరు పెట్టే ఆ పాత్ర రాసుకొన్నాడు. తీరా మూర్తి దగ్గరకు వెళ్లి కథ చెబితే – మూర్తి ఆవేశపడిపోయాడట. `నన్నేమన్నా… క్యారెక్టర్ ఆర్టిస్టువి అనుకొన్నావా బ్రదర్… ఐ యామ్ ఆల్సో హీరో` అన్నాడట. అంతేకాదు.. ‘ఎన్టీఆర్‌తో సమానమైన పాత్ర ఇస్తే చేస్తా… మా ఇద్దరి మధ్య పాట పెడతావా? నా కోసం హీరో రివైంజ్ తీర్చుకొన్నట్టు కథని మారుస్తావా’ అంటూ రకరకాల ప్రశ్నలు వేశాడట. ఇదన్నమాట ‘సున్నితంగా’ తిరస్కరించడం అంటే.
అయితే కథనీ, నారాయణ మూర్తి పాత్రనీ మార్చడానికి ఇష్టపడని పూరి.. ఆ పాత్ర పోసానికి ఇచ్చాడు. పాత్ర అయితే మారింది గానీ.. పోసాని పేరు కూడా అందులో నారాయణమూర్తే. ఈ పాత్రకోసం ఏకంగా కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేసినా నారాయణమూర్తి కరగలేదట. నిజంగా నారాయణమూర్తి కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తే, ఆ సినిమాకేమో గానీ, మూర్తికి మాత్రం బాగా మైలేజీ వద్దును. వస్తే గిస్తే అవార్డులు రావడానికి కూడా ఛాన్సుండేది. దాన్ని మిస్సయిపోయాడు మూర్తి. ప్చ్.. బ్యాడ్ లక్.