తమన్ రాక ముందు… అంతాదేవిశ్రీ ప్రసాద్ మాయాజాలమే కనిపించేది. స్టార్ హీరోలంతా దేవీ.. దేవీ అంటూ డీఎస్పీ నామ జపం చేసేవారు. కుర్రకారుకి కావల్సిన హుషారైన గీతాలు, మెలోడీలూ, ఐటమ్ సాంగులూ మేళవించి కంప్లీట్ ప్యాకేజీ అందించేవాడు దేవి. కొత్త కొత్త గొంతుల్ని పరిచయం చేసేవాడు. హీరోలు, హీరోయిన్లతో పాటలు పాడించేసేవాడు. అలా… డీఎస్పీ ముద్ర ప్రత్యేకంగా పడిపోయింది. మణిశర్మ కూడా డల్ అయిపోవడంతో దేవిదే రాజ్యం. ఆ తరవాత ఒక్కసారి తమన్ తుఫానులా వచ్చాడు. వచ్చీ రావడంతోనే `కిక్` లాంటి హిట్ ఇచ్చాడు. ఎన్టీఆర్, చరణ్, రవితేజ, మహేష్‌బాబు, అల్లు అర్జున్ ఇలా హీరోలాంద దేవిని వదిలేసి తమన్ వెంట పడ్డారు. అలా చూస్తుండగానే.. 50 సినిమాల్ని దాటేశాడు తమన్. ఈ సమయంలోనే దేవి కాస్త డల్ అయ్యాడు. అయితే తమన్ పాటలన్నీ ఒకేలా ఉండడం, పాటల్లో శ్రావ్యత దూరం అవ్వడం, పాటల్లో ఇది వరకటి కిక్ లేకపోవడంతో తమన్ బాగా డ్రాపయిపోయాడు. ఈ సమయంలోనే దేవి మరోసారి జోరుమీదకు వచ్చేశాడు.
దేవి లేటెస్ట్ ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్టే. నాన్నకు ప్రేమతో, కుమారి 21, జనతా గ్యారేజ్, ఖైదీ నెం 150, నేను లోకల్.. ఇలా వరుసగా హిట్లమీద హిట్లు కొట్టేస్తున్నాడు. ఇప్పుడైతే పెద్ద హీరోలు తమన్‌ని దాదాపుగా మర్చిపోయారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, బన్నీ… ఇలా తమన్‌ని ప్రోత్సహించినవాళ్లంతా మరోసారి డీఎస్పీ నే ఏరి కోరి తీసుకోవడంతో తమన్ కెరీర్ భారీగా డ్రాప్ అయిపోయింది. అలాగని తమన్ చేతిలో సినిమాలు లేవని కాదు. తనకు రావల్సిన సినిమాలు వస్తున్నాయి. కానీ.. తమన్ ఇప్పుడు మొదటి ఆప్షన్ కాదు. తమన్ ని తీసుకొందామనుకొంటున్నవాళ్లు కూడా ‘ఓసారి జీబ్రాన్ని ట్రై చేద్దామా’ అంటూ పక్క చూపులు చూస్తున్నారు. కొత్త కొత్త దర్శకులు అడపా దడపా మెరుస్తున్నా…ప్రస్తుతానికి దేవినే కింగ్. పెద్ద సినిమాలకు తానే దిక్కయిపోయాడు. చరణ్ – సుకుమార్ సినిమా దేవి చేతికి వెళ్లింది. ఎన్టీఆర్ – బాబి సినిమాకీ తానే సంగీత దర్శకుడు. చిరంజీవి 151 వ చిత్రం కూడా దాదాపుగా దేవి చేతికి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. తమన్ మళ్లీ పెద్ద హీరోల దృష్టి లో పడాలంటే ఏదో మెరాకిల్ చేయాల్సిందే. ప్రస్తుతానికి సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ లాంటి యంగ్ హీరోలు తమన్‌తో ఎడ్జస్ట్ అవుతున్నారు. అక్కడైనా నిరూపించుకోకపోతే.. వాళ్లూ తమన్ ని సైడ్ చేసేసే ప్రమాదం ఉంది.