శశికళకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? లేదా? అనే విషయాలను పక్కనపెడితే పన్నీరు సెల్వం ఆడుతున్న డ్రామా మాత్రం పక్కా రొటీన్ పొలిటికల్ స్టంట్‌లాగే ఉంది. భయంకరమైన, బీభత్సమైన నిజాలు చెప్తున్నానంటూ ఇన్ని రోజులుగా జయలిలత మరణంపైన అందరికీ ఉన్న అనుమానాలను మరోసారి తన నోట వినిపిస్తున్నాడు. మాలాగే ఆలోచిస్తున్నాడే, మాలాగే మాట్లాడుతున్నాడే అనే ఫీలింగ్‌తో నెటిజెనుందరూ కూడా పన్నీరు సెల్వంని ఓన్ చేసుకుంటున్నట్టున్నారు కానీ ‘ముఖ్యమంత్రి’ స్థాయిలో ఉన్న పన్నీరు సెల్వం …ఆ స్థాయికి తగ్గట్టుగా జయలలితకు ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలో ఎందుకు స్పందించలేదు? ముఖ్యమంత్రి పదవి ఉన్నంతవరకూ ఏమీ మాట్లాడని పన్నీరు ….పదవికి రాజీనామా చేసిన వెంటనే ఎందుకు రాజకీయ డ్రామాలు మొదలెట్టాడు? పదవి నుంచి దిగిపోయేవరకూ అమ్మ ఆత్మ ఆయనకు టచ్‌లోకి రాలేదా?
రాజకీయ రణరంగంలో రెండు వర్గాలు తలపడుతూ ఉన్నప్పుడు జనాలందరూ కూడా ఏదో ఒక వర్గంవైపు టర్న్ అయ్యేలా చేయడంలో మన మీడియావాళ్ళు సిద్ధహస్తులు. అలా కాకుండా రెండు వర్గాల వారు కూడా చేస్తున్న తప్పులను ప్రజలకు చూపిస్తే వాళ్ళ ఆలోచనా స్థాయి పెంచినవాళ్ళమవుతామనే స్పృహ మిస్సవుతూ ఉంటారు. ఎన్టీఆర్-చంద్రబాబు ఇష్యూ అప్పుడు కూడా చంద్రబాబుని హీరోని చేసి ఎన్టీఆర్‌ని జీరోని చేసేశారు. ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి డ్రామానే నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి పోయిన మరుక్షణం నుంచి అన్నాడిఎంకె పార్టీకి నష్టం చేయడానికి కూడా రెడీ అయిపోతున్నాడు పన్నీరు సెల్వం. తన పదవిని ఊడగొట్టిన శశికళపైన ఆయనకు ఉన్న కోపాన్ని తమిళ ప్రజలందరూ కూడా ఓన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఎమ్మెల్యేల బలం ఉన్న శశికళను సెంటిమెంట్ రాజకీయ డ్రామాతో దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. అన్నా డిఎంకె పార్టీలో తనకు మళ్ళీ సిఎం అయ్యే ఛాన్సే లేదన్న పూర్తి స్పష్టత అయితే పన్నీరు సెల్వంకి ఉన్నట్టుంది. అందుకే పార్టీకి నష్టం జరిగినా ఫర్వాలేదు …..నా లీడర్షిప్ హీరోయిజం ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలి, నా ఇమేజ్ పెంచుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాడు సెల్వం. శశికళ లాంటి స్ట్రాంగ్‌గా వ్యవహరించే నాయకుల కంటే కూడా పన్నీరు లాంటి భక్తజనులకే జాతీయ పార్టీల సపోర్ట్ ఉంటుంది. పన్నీరు ముఖ్యమంత్రిగా ఉంటే స్టాలిన్‌కి కానీ, మోడీకి కానీ…వాళ్ళ పార్టీలను రాజకీయంగా స్ట్రాంగ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయా నాయకుల ఆలోచన. అందుకే పన్నీరుతో గేం ఆడిస్తున్నారు.
అమ్మ ఆత్మ తనతో మాట్లాడింది, అమ్మ మరణం గురించి సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపిస్తా అని సాధ్యం కాని మాటలు మాట్లాడుతున్న పన్నీరు వారు పదవిలో ఉండగా ఎందుకు మౌనంగా ఉన్నారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? అలాగే మిగతా అందరినీ కాదని పార్టీని ఎలా కాపాడాలి? తమిళనాడు ప్రజలకు ఎలా సేవ చేయాలి? లాంటి విషయాలను పన్నీరుతోనే చెప్పుకున్న(?) జయలిలతకు ఏం ఆరోగ్య సమస్య వచ్చింది? ఎలాంటి ట్రీట్‌మెంట్ జరుగుతుంది? అనే విషయాలను జయలలిత బ్రతికున్నప్పుడు పన్నీరు ఎందుకు పట్టించుకోలేదు? తనను కూడా హాస్పిటల్‌లో ఉన్న అమ్మను చూడకుండా అడ్డకున్నారని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బేలగా మాట్లాడటమేంటి? అంతటి బీరువును ఇప్పుడు హీరోను చేసే ప్రయత్నాల వెనుక ఎవరూ లేరంటే నమ్మశక్యమేనా? అన్నింటికీ మించి పదవిలో ఉన్నప్పుడు ఈ హీరోయిజం ఏమైంది పన్నీరు అని వస్తున్న ప్రశ్నలకు సెల్వం దగ్గర సమాధానం ఉందా?