తెలంగాణ కాంగ్రెస్లో కొంతమంది ఉద్వాసనకు పునాది పడ్డట్టు తెలుస్తోంది! వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలంటే… యువతరానికి అవకాశం ఇవ్వాలన్నది అధిష్టానం నిర్ణయంగా తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు పీసీసీ కూడా వ్యూహరచనలో పడ్డట్టు సమాచారం. పార్టీలో ఎప్పటినుంచో ఉంటూ వస్తున్న సీనియర్లపైనే అధిష్టానం కన్నుపడిందని అంటున్నారు. అయితే, అనుకున్నంత ఈజీగా ఉద్వాసన సాధ్యమయ్యే పనేనా.? అందుకే, అధిష్టానం ఓ మాస్టర్ ప్లాన్ మొదలుపెట్టిందని తెలిసింది.
గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల చిట్టాను వెలికి తీస్తున్నారు. ఎవరెవరు ఎంతెంత ఓట్ల తేడాతో ఓడిపోయారో… రెండో స్థానం కంటే కిందికి ఎంతమంది నేతలు నిలిచారో అనేది రికార్డులు తీస్తున్నట్టు సమాచారం! అంతేకాదు.. కటాఫ్ మార్కులు కూడా పెట్టారు! అంటే, పాతిక వేల ఓట్లు కంటే తక్కువ తేడాతో ఓడిపోయినవారు, అంతకంటే కాస్త ఎక్కువ తేడాతో ఓడినవారి జాబితా తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ జాబితా ఆధారంగా సీనియర్లను సాగనంపొచ్చు అనేది వ్యూహంగా కనిపిస్తోంది.
ఇలాంటి జాబితాలు తయారౌతున్నాయని తెలిసీ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే పీసీసీ ముందు వాపోతున్నారట! వచ్చే ఎన్నికల్లో మరోసారి ఛాన్స్ ఇస్తే తమ సత్తా చాటుకుంటామని అంటున్నారట! అయితే, అధిష్టానం వ్యూహం మరోలా ఉంది. సీనియర్లలో అసంతృప్తి పెరగకుండా ఉండేందుకు వారికి కొన్ని హామీలు ఇచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెరాస గెలిస్తే.. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సీట్లు ఇస్తామంటూ సీనియర్లకు హామీ ఇవ్వాలనుకుంటోంది. పార్టీ కోసం శ్రమించేవారిని అధిష్టానం అన్ని విధాలుగా గుర్తిస్తుందన్న భరోసా నింపే ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నారు.
ఈ విషయంగా సీనియర్లను కన్వెన్స్ చేసి… వచ్చే ఎన్నికల నాటికి దాదాపు 75 శాతం స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచన. మరి, ఈ ఆలోచన ఆచరణ క్రమంలో సీనియర్ల రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. సీనియర్లకు గుర్తింపు ఉంటుందని చెబుతున్నా కూడా… సాంకేతికంగా చూసుకుంటే వారిని పక్కన పెట్టేయాలన్న ఆలోచనలో పార్టీ ఉందని స్పష్టంగా అర్థమౌతోంది. తాజా నిర్ణయంతో పార్టీ సీనియర్లు చెమటలు పడుతున్న విషయమైతేనే వాస్తవం!