ఇది వరకు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ తమిళం నుంచి అనువాదాల రూపంలో వచ్చేవి. విజయ్ కాంత్, శరత్‌కుమార్, అర్జున్ లాంటి హీరోలు ఇలాంటి సినిమాలతోనే పాపులర్ అయ్యారు. ఆయా సినిమాల్లో యాక్షన్ తప్ప ఇంకేం ఉండదు. ఫైట్లూ, ఫైట్లూ, ఫైట్లూ. అంతే. డబ్బింగ్ సినిమా కాబట్టి అరవ అతిశయాలు తప్పని సరి. డబ్బింగ్ అంటే అది కేవలం యాక్షన్ చిత్రమే అనుకొనే స్థాయిలోకి తీసుకెళ్లి వదిలేశారు. అయితే ఆ తరవాత తమిళ సినిమా పంథా మారింది. యాక్షన్ మూసలోంచి బయటపడ్డారు. కొత్త కథలు పుట్టుకొచ్చాయి. సృజనాత్మకంగా ఆలోచించడం మొదలెట్టారు. తమిళ డబ్బింగ్ సినిమాని తెలుగు ప్రేక్షకులు చూసే దృష్టి కోణం కూడా మారింది. అయితే అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు ఆపాత ‘డబ్బింగ్’ సినిమాల్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటాయి. ఎస్ 3 (యముడు 3) అలాంటి సినిమానే.
* కథ
నరసింహం (సూర్య) నిజాయతీపరుడైన పోలీస్ ఆఫీసర్. మంగళూరుకి చెందిన ఓ పోలీస్ కమీషనర్ హత్యకు గురవుతాడు. ఆ కేసుని కర్నాటక పోలీసులు ఛేదించలేకపోతే… దాన్ని సింగంకి అప్పగిస్తారు. ఈ హత్య చేయించింది రెడ్డి (శరత్ సక్సేనా) అనే విషయం సింగం ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అందుకే రెడ్డి మనిషిగా మంగళూరులో అడుగుపెట్టిన సింగం… మెల్లిమెల్లిగా తీగంతా లాగుతాడు. రెడ్డికి ఆస్ట్రేలియాలో ఉంటున్న విఠల్ (అనూప్ సింగ్) అనే వ్యాపార వేత్తతో సంబంధాలున్నాయనే విషయం తెలుస్తుంది. అంతేకాదు. 36మంది స్కూలు పిల్లలు చనిపోయిన కేసులో విఠల్ ప్రమేయం ఉందని తేలుతుంది. ఆస్ట్రేలియాలో ఉంటూ… ఇండియాలో వ్యాపారాల్ని, ఇక్కడ మాఫియానీ తన గుప్పెట్టో ఉంచుకొన్న విఠల్ కొమ్ములు ఎలా విరిచాడు? అసలు పోలీస్ కమీషనర్ ని ఎందుకు చంపారు? విఠల్ చేస్తున్న అరాచకాలేంటి? అనేది తెరపై చూడాల్సిందే.
* విశ్లేషణ
సింగం సిరీస్‌లో వచ్చిన గత రెండు చిత్రాల్లోనూ ఇంతకు మించిన కథేం ఉండదు. నిజాయతీ పరుడైన ఓ పోలీస్ అధికారి.. తన వృత్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లని ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఒక్కో సినిమాలో ఒక్కో కేసు.. ఒక్కో కొత్త విలన్. ఈసారి విలన్ ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాడ్ని ఇండియా ఎలా రప్పించాడు? ఎలా శిక్షించాడు? అనేదే కథ. ఇలాంటి సినిమాల్లో కొత్త కథల్ని ఆశించడం కూడా తప్పే. ఛేజింగులూ, ఫైట్లూ, సవాళ్లు, ప్రతి సవాళ్లూ ఎలా ఉంటాయన్నదే ప్రధానం. ఆ విషయంలో దర్శకుడు ఏ లోటూ చేయలేదు. కమీషనర్ హత్య కేసుని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు హీరో. అప్పటి వరకూ నత్తనడక నడిచిన ఇన్వెస్టిగేషన్ హీరోగారు రావడంతోనే… పరుగులు పెట్టాలి కాబట్టి పెట్టేస్తుంటుంది. మధ్యమధ్యలో సూరి నవ్విద్దామని చాలా చాలా ప్రయత్నిస్తుంటాడు. కానీ.. అవన్నీ వృథా ప్రయాసలే అయ్యాయి. గ్లామర్ మిస్సవ్వకూడదు అంటూ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా శ్రుతిని దింపారు. తాను హీరోనే కాదు, కథనీ అప్పుడప్పుడూ డిస్ట్రబ్ చేస్తుంటుంది. ఫోన్లో పలకరింపుల ద్వారా `ఈ సినిమాలో అనుష్క కూడా ఉంది` అనే విషయం గుర్తొస్తుంటుంది. కమీషనర్ని చంపిందెవరో తెలుసుకొని.. అరెస్ట్ చేయడం చిటికెలో పని. కానీ.. అది కాస్త చేసేస్తే సినిమా అయిపోతుంది. అందుకే ఇంట్రవెల్ వరకూ ఎదురుచూసేలా చేస్తాడు దర్శకుడు. ఈ తతంగం వెనుక ఎవరో ఉన్నారని, వాడ్ని పట్టుకొంటే గానీ ఈ కేసు క్లోజ్ అవ్వదని హీరో డిసైడ్ అయ్యేసరికి ఊహకు అనుగుణంగానే ఇంట్రవెల్ కార్డు పడిపోతుంది. అయితే ఈమధ్యలో సాగే యాక్షన్ ఎపిసోడ్లు దర్శకుడు హరి తాలూకూ రేసింగ్ స్ర్కీన్ ప్లేని మరోసారి గుర్తుకు తెస్తాయి. కార్ల వెంట కెమెరా పరుగులు పెడుతూనే ఉంది. హారీష్ జైరాజ్ ఆర్ ఆర్తో అరిపించేస్తుంటాడు. దాంతో తెరపై ఏదో జరిగిపోతోంది అన్న ఫీలింగ్ వస్తుంది.
అంతా అనుకొన్నట్టే ద్వితీయార్థం ఆస్ట్రేలియాకు షిప్ట్ అవుతుంది. హీరో అక్కడకు వెళ్లి విలన్‌కి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఆయా సన్నివేశాల్లో హీరోయిజం బాగానే ఎలివేట్ అయ్యింది. హీరోని వెదుక్కొంటూ విలన్ ఇండియాలో అడుగుపెడతాడు. ఇక్కడ విలన్ ఆట కట్టించేస్తాడు. శ్రుతిహాసన్ ని అడ్డు పెట్టుకొని విలన్ ఆడే గేమ్.. దాన్ని తన తెలివితేటలతో హీరో సాల్వ్ చేయడం ఇదొక్కటే సెకండాఫ్‌ని రక్షించింది. సరిగ్గా ఇలాంటి ఎపిసోడ్ సింగం 2లోనీ చూసినవాళ్లు, ఆ సినిమా ఇంకా గుర్తున్నవాళ్లు ఈ సన్నివేశాలకూ కనెక్ట్ కాకపోవొచ్చు. లాజిక్‌కి అందని చాలా సీన్లు తెరపై కనిపిస్తాయి. ఇలాంటి సినిమాలు లాజిక్‌కి దూరంగా ఉంటాయి అని సర్దిచెప్పుకోవడం మినహా ఇంకేం చేయలేం.
తొలి రెండు భాగాల్లో యాక్షన్ పార్ట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కీ ముఖ్యంగా ఫాదర్ సెంటిమెంట్‌కి చోటిచ్చాడు దర్శకుడు. అయితే.. సింగం 3లో అదేం కనిపించదు. కామెడీ చేద్దామని చేసిన ప్రయత్నాలన్నీ బెడసి కొట్టాయి. పాటలు ఆకట్టుకోలేదు. కేవలం యాక్షన్ సీన్ల కోసమే అయితే.. సింగం 3 నిరభ్యంతరంగా చూడొచ్చు.
* నటీనటుల ప్రతిభ
సూర్య వన్ మేన్ షో.. ఈ సినిమా. తన ఎనర్జీ అంతా ఈ సినిమాలో చూపించేశాడు. నిజంగానే సింహంలా కనిపించాడు. సూర్యలో ఆ యాంగ్రీ యంగ్‌మెన్ ఎమోషన్ తప్ప ఇంకేం కనిపించవు కూడా. డాన్సులు కూడా ఫైట్ చేసినట్టే చేశాడు.. విడ్డూరంగా. అనుష్క కోసం రెండు కెమెరాలు వాడారేమో. అంత లావుగా కనిపించింది. తాను సన్నబడకపోతే.. కమర్షియల్ కథలకు దూరం అవ్వడం ఖాయం. శ్రుతి పాత్రకూ అంత ప్రాధాన్యం లేదు. క్లైమాక్స్‌లో విలన్ చేతికి చిక్కుకోకపోతే.. ఆ పాత్ర కూడా శుద్ద వేస్ట్‌గానే మిగిలిపోయేది. రాధిక లాంటి నటిని చేతిలో ఉంచుకొని.. అన్ని తక్కువ సన్నివేశాలే ఇవ్వడం బాలేదు. విలన్ అనూప్ సింగ్ మరీ కుర్రాడిలా ఉన్నాడు. సూర్యకి మాత్రం ధీటుగా కనిపించలేకపోయాడు. సూరి ఓవరాక్షన్ ఈ సినిమాలోనూ కొనసాగింది.
* సాంకేతిక వర్గం
పాటల మాటేమో గానీ, ఆర్ ఆర్ అంతా అరుపులూ కేకలే. ఇలాంటి ఆర్.ఆర్.. హారీశ్ జైరాజ్ ఇది వరకు కొట్టుండడు. పాటల్లో వైఫై పాట ఒక్కటే.. ఆకట్టుకొనేలా ఉంది. కెమెరా మెన్ చాలా కష్టపడ్డాడు. ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలిందే. ఎన్ని ఫ్లై కేమెరాలు వాడారో గానీ. కెమెరా నేల మీద ఉన్నది తక్కువ. గాల్లో లేచింది ఎక్కువ. అన్నీ ఫ్లై షాట్సే. సినిమా రిచ్‌గా ఉంది. కథ, కథనాల్ని నిర్లక్ష్యం చేసిన హరి… యాక్షన్ ఎపిసోడ్లు, రేసింగ్ స్ర్కీన్ ప్లే విషయంలో మాత్రం తన ప్రతిభ చూపించాడు.
* ఫైనల్ టచ్ : సింగం.. పరుగే.. పరుగు!
తెలుగు 360 రేటింగ్: 2.75/5