అనుక్షణం ఉత్కంఠగా మారిపోయాయి తమిళనాడు రాజకీయాలు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రానికి గవర్నర్ విద్యాసాగరరావు వస్తే తప్ప ఈ చిక్కుముడి విడదు అనుకున్నారు. ఆయన రానే వచ్చారు. కానీ, ఎక్కడ చిక్కులు అక్కడే ఉన్నాయి. పన్నీర్ సెల్వమ్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని తరువాత పన్నీర్ చెప్పారు. శశికళ కూడా గవర్నర్‌ను కలుసుకున్నారు. కానీ, ఆమె ఏమీ చెప్పలేదు! పన్నీర్‌కు ఓ నాలుగు రోజులు సమయం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మొత్తం వ్యవహారం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
పన్నీర్‌కు కొంత సమయం ఇవ్వడం వెనక భాజపా వ్యూహాత్మకంగానే ఉందని అనిపిస్తోంది. అంటే, శశికళ వర్గం నుంచి అవసరమైన మద్దతుదారులను కూడగట్టుకునే సమయం పన్నీర్‌కు ఇచ్చారా అనే అనుమానం కలుగుతోంది. లేదంటే… ఈ నాలుగైదు రోజుల్లో సుప్రీం కోర్టు నుంచి ఏదైనా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టున్నారు! అప్పుడు పరిస్థితి శశికళకు ప్రతికూలంగా మారితే కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్టు అవుతుందని వేచి చూస్తున్నారా అనే ధోరణి కూడా కనిపిస్తోంది. మొత్తం వ్యహారాలపై మోడీ కన్నేసి ఉంచారన్న కథనాలూ వినిపిస్తున్నాయి.
నిజానికి, అమ్మ జయలలిత మరణించిన వెంటనే తమిళనాడును తమ కంట్రోల్‌కి తెచ్చుకునేందుకు భాజపా ప్రయత్నించింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హుటాహుటిన అక్కడికి వెళ్లిపోయి తిష్ఠవేశారు. వెంకయ్యకు అత్యంత సన్నిహితుడైన తంబీ దురైని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని భాజపా బాగానే పావులు కదిపింది. కానీ, ఆ తరుణంలో శశికళ అలెర్ట్ కావడంతో భాజపా ఎత్తు పారలేదు.
ఇప్పుడు భాజపాకి తమిళనాడుపై పట్టు కావాలి. అమ్మ ఉండగా అది సాధ్యపడలేదు. ఇప్పుడు చిన్నమ్మను సైడ్ చేసే అవకాశం దొరికింది. పైగా, నోట్లో నాలుకలేని పన్నీర్ సెల్వమ్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెడితే, కళ్లెం కమలం చేతికి వచ్చినట్టే కదా. ఈ దిశగానే తమిళనాట రాజకీయాల్లో ఢిల్లీ చక్రం తిరుగుతోందని భావించొచ్చు. అయితే, హస్తిన ఆధిపత్య ధోరణిని ఆత్మాభిమానం అధికంగా ఉన్న తమిళులు సహిస్తారా..? ఢిల్లీ పెంతందారీ తనానికి తలొగ్గాల్సిందేనా..? ప్రాంతీయ పార్టీలపై పట్టు కోసం జాతీయ పార్టీలు అనుసరించబోతున్న నయా రాజకీయ వ్యూహానికి ఇది ప్రారంభమా..? ఇలాంటి ప్రశ్నలకు కాలమే జవాబులు చెప్పాలి.