మార్చి 28.. ఉగాది సందర్భంగా కాటమరాయుడు చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించేసింది. అయితే… ఇప్పుడు కాటమరాయుడు రిలీజ్ డేట్ మారే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల టాక్. ఇప్పటికి దాదాపు 20 రోజుల టాకీ బాకీ ఉందట. దాంతో పాటు విదేశాల్లో పాటలూ తెరకెక్కించాల్సివుంది. అంటే.. ఎలాకాదన్నా నెల రోజులు షూటింగ్ కే కేటాయించాలి. దాంతో కాటమరాయుడు అనుకొన్న సమయానికి వస్తుందా, రాదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావల్సింది. కొన్ని సన్నివేశాల్ని రచయిత బుర్రా సాయి మాధవ్‌తో తిరగరాయించుకొన్నార్ట. ఆయా సీన్లను రీషూట్ చేయడం వల్ల.. షూటింగ్ ఆలస్యమైందని, లేదంటే మార్చి 28 ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ అయ్యేది కాదని తెలుస్తోంది.
కానీ చిత్రబృందం మాత్రం ఈ డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని భావిస్తోంది. 20 రోజుల్లో తీయాల్సిన సీన్లని కాస్త కుదిరించి, రాత్రీ పగలూ పనిచేసి 10 రోజుల్లో ఫినిష్ చేయాలని, పాటల కోసం ఫారెన్ వెళ్లకుండా, ఇక్కడే స్టూడియోల్లోనే తీసేయాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. మార్చి నెలాఖరున కాటమరాయుడికి పర్ఫెక్ట్ డేట్. ఎందుకంటే ఈ డేట్ దాటితే ఏప్రిల్‌లో బాహుబలి వచ్చేస్తుంది. పెద్ద సినిమాలన్నీ వరుస కట్టడం మొదలవుతుంది. అందుకే.. మార్చి 28న ఎట్టిపరిస్థితుల్లోనూ కాటరాయుడ్ని తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. పవన్ గైర్హాజరీలో ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రబృందం తలమునకలై ఉందట. ఓ వైపు ఎడిటింగ్ కూడా మొదలెట్టేశారని తెలుస్తోంది. అనుకొన్న సమయానికి కాటమరాయుడుని విడుదల చేయడం చిత్రబృందానికి సవాలే.