బాహుబలి ప్రభావం చిత్రసీమపై మరీ ముఖ్యంగా దర్శకులపై చాలా పడింది. విజువల్‌గా తమ సినిమాని ఊహించుకొంటున్నప్పుడు బాహుబలిని ఓసారి రిఫరెన్స్తీసుకోవడం మామూలైపోయింది. ఓం నమో వేంకటేశాయలో కూడా అలాంటి రిఫరెన్స్‌లు కొన్ని కనిపించాయి. ముఖ్యంగా జలపాతం చూడగానే… అది బాహుబలికి స్ఫూర్తేమో అన్న అనుమానం కలుగుతుంటుంది. ఇదే విషయం రాఘవేంద్రరావుని అడిగితే… ”బాహుబలిలో జలపాతం సన్నివేశాలు నాకు నచ్చాయి. కానీ ఆ సినిమాని నేనేం స్ఫూర్తి గా తీసుకోలేదు. కాపీ కొట్టలేదు. తిరుమల కొండని ఇంకా అందంగా, ఆహ్లాదకరంగా చూపించాలనుకొన్నా. అయితే ఈ సినిమా చూడగానే తిరుమలలో జలపాతాలు ఎక్కడని అందరూ ప్రశ్నిస్తారని నాకు తెలుసు. అందుకే చిన్న ధారగా వస్తున్న జలపాతం వంక స్వామి వారు ఓ చూపు చూస్తే.. ఆ ఉధృతి వేయింతలు అయ్యిందన్నట్టుగా చూపించాం. కాబట్టి కన్వెన్స్ అయిపోవొచ్చు” అన్నారాయన.
అయితే బాహుబలిలో జలపాత దృశ్యం మాత్రం రాజమౌళి మనోహరంగా చూపించాడని కితాబు ఇచ్చారు. ఆ జలపాతాన్ని చిన్నప్పటి నుంచీ హీరో చూస్తూ ఎదగడం, ఆ జలపాదం దాటాలని కలలు కంటున్నట్టు చూపించడం ఇదంతా డ్రామా పండించడం కోసం రాజమౌళి చేసిన టెక్నిక్ అని, హీరో ఒక్కసారిగా జలపాదం దాటేసి వెళ్లిపోతే అందులో కిక్ వచ్చేది కాదని శిష్యుడి సినిమాపై గురువు తనదైన శైలిలో విశ్లేషించారు.