టైటిల్లోనే హీరోయిజం చూపించేయాలి అనుకొనే ట్రెండ్ నుంచి మెల్లమెల్లగా మన చిత్రసీమ బయటపడుతోంది. అందుకే ‘జనతా గ్యారేజ్’ లాంటి టైటిళ్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అలాంటి టైటిలే మరోటి వినిపిస్తోంది. అదే.. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ఈ టైటిల్ పెడితే ఎలా ఉంటుందా?? అని చిత్రబృందం ఆలోచిస్తోందట. ప్రస్తుతం డీజే (దువ్వాడ జగన్నాథమ్) చిత్రంతో బిజీగా ఉన్నాడు బన్నీ. ఆ తరవాత లగడపాటి శ్రీధర్ నిర్మాతగా ఓ చిత్రంలో నటించనున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టైటిల్ బయటకు వచ్చింది.
టైటిల్‌ని బట్టి కథని చూచాయిగా ఊహించేయొచ్చు. జగమంత కుటుంబం అనే కాన్సెప్ట్‌లో సాగే కథలా అనిపిస్తుంది. ఈ తరహా పాత్రలు బన్నీకి భలే సూటవుతాయి. కాబట్టి.. టైటిల్, ఈ కాన్సెప్ట్ బన్నీకి యాప్ట్ అవ్వడం ఖాయం. అయితే చిత్ర బృందం మాత్రం టైటిల్ విషయంలో ఇంకా బయటపడడం లేదు. ”కథా చర్చలు జరుగుతున్నాయి. అప్పుడే టైటిల్ చెప్పడం కరెక్ట్ కాదు. అన్నీ ఫైనలైజ్ అయిన తరవాత పూర్తి వివరాలు మేమే ప్రకటిస్తాం” అని అల్లు అర్జున్ కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. డీజే పూర్తయిన వెంటనే సెట్స్‌పైకి వెళ్లే బన్నీ సినిమా ఇదే. సో.. అతి త్వరలోనే మిగిలిన వివరాలు బయటకు రావొచ్చు.