పులి ఊరుమీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు… కానీ ఒక్కడు మాత్రం ఎదురొస్తాడు పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు… కానీ పెట్టుకొన్నారంటే పాతిక మందికి పైగా పోతారు…- ‘విన్నర్’ సినిమాలో హీరోయిజం ఏ రేంజులో ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క ఇంట్రడక్షన్ చాలదూ! సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న విన్నర్ థియేటరికల్ ట్రైలర్ ఈరోజే విడుదలైంది. దర్శకుడు గోపీచంద్ మలినేని కమర్షియల్ సూత్రాలన్నీ పాటిస్తూ ఈ సినిమా తీశాడన్న సంగతి ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. సాయిధరమ్ తేజ్ పంచ్ ల మీద పంచ్ వేసేసి వన్ అండ్ ఓన్లీ ఎట్రాక్షన్‌గా కనిపించాడు. అటు రకుల్‌కి గానీ, ఇటు జగపతిబాబుకి గానీ అంత సీన్ లేకుండా పోయింది. ‘గెలుపనేది మన బ్లడ్‌లోనే ఉంది…’ అంటూ జగపతికో రోటీన్ డైలాగ్ అప్పగించారు.
ఇక 30 ఇయర్స్ ఫృథ్వీ ఎప్పట్లా స్నూఫ్లతో దిగిపోయాడు. బాలయ్యతో పెట్టుకొంటే అభిమానులు ఎక్కడ రఫ్ఫాడించేస్తారో అన్న భయం వేసిందేమో. ఈసారి సింగం సిరీస్‌లో పోలీస్‌లా గెటప్ మార్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. యాండే.. ఏదైనా మాట్లాడండే, ఓ పాట పాడండే అంటూ బుజ్జిగాడులో ప్రభాస్‌ని ఇమిటేట్ చేయడం ఒక్కటే సాయిధరమ్ తేజ్‌కి కుదర్లేదు. తమ్ముడు సినిమాలోలా ఆవారాగా తిరిగే ఓ అబ్బాయి.. గుర్రపు సవారీ నేర్చుకొని అందులో ఎలా విన్నర్ అయ్యాడన్న పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి ట్రైలర్‌తో అర్థమైపోతోంది. సో.. కథలోగానీ, ఇప్పుడు చూపించిన ట్రైలర్లోగానీ కొత్తదనాలేం కనిపించకపోయినా, సాయి తన టైమింగ్‌తో, రకుల్ తన గ్లామర్‌తో ఈ సినిమాకి లైఫ్ పోస్తారేమో చూడాలి.