రాష్ట్రంలో ఏ భారీ కార్యక్రమం జరిగినా దాన్ని సెంటిమెంట్‌లో ముడిపెట్టెయ్యడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బాగా అలవాటైపోయింది! ముఖ్యంగా వాస్తు గురించి పదేపదే మాట్లాడుతూ ఉంటారు. రాజధాని అమరావతి వాస్తు బాగా కుదిరిందని మళ్లీ చెప్పారు. మహిళా పార్లమెంటేరియన్ల ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమరావతి వాస్తు అద్భుతంగా కుదిరిందనీ, అందుకే చేపట్టిన ప్రతీ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో తెలుగుదేశం ఏకగీవ్రంగా అంగీకారం తెలుపుతోందని ఆయన అన్నారు. ఈ ఘనతకు కూడా కారణం అమరావతి వాస్తు అన్నట్టుగా చెప్పుకొచ్చారు!
సరే.. ఆయన సెంటిమెంటే నిజమని కాసేపు అనుకుందాం. అమరావతి వాస్తు ప్రభావంతోనే రాష్ట్రంలో అన్నీ భారీగా జరుగుతున్నాయని అనుకుందాం. నిజానికి.. భారీ జరుగుతున్నవి సమావేశాలూ శంకుస్థాపన కార్యక్రమాలు మాత్రమే! రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఒకటికి రెండుసార్లు భారీ ఎత్తున నిర్వహించారు! తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా చేశారు. ఈ మధ్యనే వైజాగ్‌లో భారీ ఎత్తున భాగస్వామ్య సదస్సు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులైతే… వారానికో ప్రారంభోత్సవం! మట్టి తవ్వినా ఫంక్షనే, సిమెంట్ కలిపినా ఫంక్షనే!
చంద్రబాబు చెబుతున్న వాస్తు ప్రభావం కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితం అవుతున్నట్టుగా ఉందనిపిస్తోంది! అమరావతి నిర్మాణం ఎప్పటికి మొదలయ్యేనో ఎవ్వరికీ తెలీదు. ఇంకా డిజైన్ల దగ్గరే పని ఆగిపోయింది. మరి, ఈ విషయంలో చంద్రబాబు నమ్మిన వాస్తు పనిచేయడం లేదా..? తాత్కాలిక సచివాలయంలో ఇంకా అరకొర సౌకర్యాలున్నాయని అంటున్నారు. వాస్తు పేరుతో కొట్టివేతలూ కట్టివేతలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకుంటున్నారు! మరి, ఈ విషయంలో కూడా వాస్తు ఫలించలేదా..?
ఆ వాస్తు ప్రభావమే కరెక్ట్ అయితే… ప్రత్యేక హోదా ఎందుకు రానట్టు! పోనీ, ప్యాకేజీకి రావాల్సిన చట్టబద్ధత ఏది..? లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని చెప్తున్నారు.. సదరు కంపెనీల ప్రారంభోత్సవాలు ఎప్పుడు..? చంద్రబాబు చెబుతున్న సెంటిమెంటే కరెక్ట్ అయితే… ఇవన్నీ జరగాలి కదా! కేవలం జరుగుతున్నవాటికే వాస్తు ప్రభావాన్ని ఆపాదించి… మిగతా అంశాల జోలికి పోకుండా ఉంటే ఏమనుకోవాలి! అయినా, సాధారణ పరిపాలన అందించడానికి కూడా కుక్కు ఎదురైందీ… పిల్లి నడిచొచ్చిందీ… ఆగ్నేయం పెరిగిందీ.. ఉత్తరం ఉబ్బిందీ… ఇదేం సెంటిమెంట్ల గోలండీ…!