మణిరత్నం సినిమా అంటే ఓ పెయింటింగ్. వెండితెర అనే కాన్వాస్ పై అద్భుతమైన చిత్రాలు గీస్తాడాయన. ఇక ప్రేమ కధలు గురించి చెప్పక్కర్లేదు. హృదయాలను పిండేసే భావాలను వుంటాయి ఆయన కధల్లో. ప్రేమ కధను తీయాలనుకునే దర్శకులకు మణిరత్నం సినిమాలే రిఫరెన్స్ అని చెప్పడంలో ఎలాంటి అతిశాయోక్తి లేదు. ఇక ఆయన చిత్రాల్లో పాటలైతే ఆణిముత్యాలే. మణిరత్నం ద్రుష్టిలో పాటంటే సినిమాలో ఐదు నిమిషాల పాటు టైం పాస్ చేసే వ్యవహారం కాదు. ఆయన పాటలు లోతైన భావాలు చెబుతాయి. మాటతో చెప్పలేని కొన్ని భావాలను మ్యూజిక్ జోడించి స్క్రీన్ పై ఆవిష్కారిస్తారు మణిరత్నం. చిత్రీకరణ కూడా మనసును హత్తుకుటుంది. కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆహ్లదాన్ని ఇస్తాయి.
ఇప్పుడు ఆయన నుండి మరో ప్రేమ కధ వస్తోంది. అదే ‘కాట్రు వెలియిదాయ్’. కార్తి, అదితి రావు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం నుండి నిమిషం నిడివి గల ఓ పాటను విడుదల చేశారు. ”మైమరుపా”అనే లిరిక్ తో సాగిన ఈ పాట ఆద్యంతం కట్టిపడేసింది. ప్రేమికుల రోజుకు సరైన బహుమతి ఇది. కాశ్మీర్ అందాలను చూపించడంలో మణిరత్నం దిట్ట. రోజాలో ”పరువం వాన” పాట ఇప్పటికీ కళ్ళముందే కదులుతుంటుంది . ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో కాశ్మీర్ అందాలను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు మణిరత్నం. ఈ పాటలో ఆ అందాలే హైలెట్. ఇక టీజర్ చివర్లో మణిరత్నం ఇచ్చిన టచ్ అదిరిపోయింది. మంచుతో కప్పుకుపోయిన కారు, అందులో హీరో హీరోయిన్స్.. భలే రొమాంటిక్ టచ్ అది. ఆ సీన్ చూస్తే దటీజ్ మణిరత్నం అనాల్సిందే. ‘చెలియా’ అనే టైటిల్ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు.