చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు కలసి నటిస్తారనన్నీ… దానికి పవన్ కల్యాణ్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారనన్నీ… టి.సుబ్బిరామిరెడ్డి వారు ఓ ప్రకటన చేశారు. ఆ క్షణమే.. టాలీవుడ్ అంతా ఒక్క కుదుపుకు లోనైంది. ఎట్టెట్టా..?? అని హాశ్చర్యపోయింది. అది నిజమే అని కొందరు, కాదు అంబక్ అని ఇంకొందరు డిబేట్ లా వాదించుకొన్నారు. చిరుని అడిగితే చిద్విలాసం చిందించాడు తప్ప.. అవుననో కాదనో చెప్పలేదు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ మాత్రం కుండ బద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పవన్‌ని అక్కడి అభిమానులు మెగా మల్టీస్టారర్ గురించి అడిగితే.. ‘అలాంటిదేం లేద’ని తేల్చేశాడు. అసలు తన దగ్గరకు అలాంటి ప్రతిపాదనేదీ రాలేదని సుబ్బిరామిరెడ్డి పుట్టించిన గాలివార్తని పుటుక్కున పేల్చేశాడు. దాంతో మెగా మల్టీస్టారర్ ఓ కల్ల అని తేలిపోయింది.
అసలు చిరు, పవన్‌లు వెండి తెరపై కలసి ఓ సినిమా చేయడం సాధ్యమే కాదు అని గట్టిగా చెప్పిన సినీ మేధావులు కూడా – టి.సుబ్బిరామిరెడ్డి అఫీషియల్ ఎనౌన్స్మెంట్తో ఖంగుతిన్నారు. సుబ్బిరామిరెడ్డి తలచుకొంటే కానిదేముంది? అనే టైపులో కాస్త మెత్తపడ్డారు. సుబ్బిరామిరెడ్డి కూడా తన స్థాయిలో వీర ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. పవన్‌ని కలవడం, త్రివిక్రమ్ చుట్టూ తిరగడం ఇవన్నీ జరిగిన మాటలే. కానీ అటు చిరులోగానీ, ఇటు పవన్‌లో గానీ మల్టీస్టారర్ చేయాలన్న ఆశ, ఆకాంక్ష అయితే రగల్చలేకపోయారు సుబ్బిరామిరెడ్డి. పెద్దాయన కదా, పైగా బాగా కావల్సినవాడు – అంటూ చిరు లైట్ తీసుకొంటే, పవన్ `చూద్దాం చేద్దాం..` అనే మాట కూడా అనలేదు. సుబ్బిరామిరెడ్డి సంప్రదించినప్పుడు పవన్ ఏమీ అనలేకపోయాడు గానీ, అమెరికా పర్యటనలో మాత్రం ఛాన్స్ తీసుకొన్నాడు. మల్టీస్టారర్లాంటి ప్రయత్నాలేం లేదని చెప్పేసి.. సుబ్బిరామిరెడ్డికి షాక్ ఇచ్చాడు. అయితే పవన్ ప్రకటనతో సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు ఆగిపోతాయని చెప్పలేం. ఇప్పుడే ఆయన ఇంకాస్త గట్టిగా ట్రై చేయొచ్చు. లేదంటే… ఏకంగా చిరు ద్వారానే ఓ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేలా ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు. అప్పుడు పవన్ ఎలాగూ ఇరుకున పడిపోతాడు. మరి రెడ్డిగారు ఈసారి ఎలాంటి స్టెప్ తీసుకొంటారో చూడాలి.