ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇంటిపోరు మొదలైందని చెప్పాలి! ఆయన కనుసన్నలకు అతీతంగా క్యాబినెట్‌లో ఏదీ జరగదు, మంత్రులు ఏమీ చేయలేరు అని చాలామంది అంటుంటారు. కానీ, ఆయన కళ్లకు గంతలు కట్టీ, ఆయన్నే ఇబ్బందుల్లోకి నెట్టే దిశగా పరిస్థితులు ఒక్కోటీ మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తాజాగా టీడీపీలో మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం కొత్త తలనొప్పిగా మారిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. కారణం… ప్రతిపక్ష పార్టీ వైకాపాకి ఆయన దగ్గరౌతూ ఉండటమే అని చర్చించుకుంటున్నారు.
మంత్రి రావెల తీరుపై చంద్రబాబు కస్సుబుస్సు లాడినట్టు ఈ మధ్యనే వార్తలు వచ్చాయి. వైకాపాకి చెందిన నాయకులతో స్నేహం ఎందుకని పరోక్షంగా ఆయన్ని చంద్రబాబు హెచ్చరించాట! అసలు విషయం ఏంటంటే.. తన గన్‌మెన్‌కు కూడా తెలియకుండా కొంతమంది నేతలతో రావెల సమావేశమౌతున్నారట! ఈ మధ్యనే జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో రావెల భేటీ అయినట్టు వార్తలొచ్చాయి! ఆ భేటీలో ఎందుకు జరిగిందీ…? ఎవరి వ్యూహం ప్రకారం జరిగిందీ..? తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతాయో అనే అంశంపై చంద్రబాబు వర్గం కాస్త టెన్షన్ పడుతున్నట్టు సమాచారం.
అయితే, అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న రావొచ్చు! ఈ భేటీ జరిగింది కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే కాదనీ, పార్టీకి చెందిన కొన్ని రహస్యాలను రావెల అక్కడికి మోసుకెళ్లారనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజధాని చుట్టపక్కల ప్రాంతంలో కొంతమంది పెద్దలు బినామీ పేర్లతో భూముల్ని ఎలా సంపాదించుకున్నారో అనే అంశంతోపాటు, చంద్రబాబు అక్రమాలకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను కూడా రావెల అక్కడికి చేరవేశారు అని చెప్పుకుంటున్నారు!
త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరిగితే… రావెల కిషోర్ బాబు అవుట్ అనేది ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయిన విషయం. ఎప్పుడైతే, తెలుగుదేశం పార్టీ తనపై వివక్ష చూపుతోందన్న భావన రావెలలో కలిగిందో, అప్పటి నుంచే సొంత పార్టీ నేతల అక్రమార్జనలపై ఓ కన్నేసి ఉంచారనీ, ఆధారాలన్నీ చేతిలో పెట్టుకోవడం మొదలుపెట్టారనీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు! మొత్తానికి… రావెల బయటకి వస్తే చాలా విషయాలు బయపడే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రావెల విషయంలో తెలుగుదేశం కౌంటర్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి!