చిరంజీవి.. వెండితెర రారాజు. తెలుగు చిత్ర చరిత్రలో ఓ ప్రభంజనం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తర్వాత అంతటి స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన మెగా హీరో. అల్టీమేట ఎంటర్ ట్రైనర్. బాక్సాఫీసు కింగ్. అలాంటి చిరంజీవి ఇప్పుడు బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు.”మీలో ఎవరు కోటీశ్వరుడు”కి వ్యాఖ్యాతగా సైన్ చేశారు. నిజంగా ఇది ఎవరూ ఊహించలేదు. చిరంజీవిని హోస్ట్ గా ఊహించడం ఖచ్చితంగా ఎదో తెలియని కొత్త ఫీలింగ్. ఈ విషయంలో మెగాస్టార్ సర్ ప్రైజ్ ఇచ్చారే అనుకోవాలి. నాగార్జున హోస్టింగ్ చేసిన ఆ స్థానంలోకి చిరంజీవి రావడం.. ప్రోమోలతో ఆసక్తి పెంచడం… తొలి ఎపిసోడ్ ప్రసారం కావడం కూడా జరిగిపోయింది. నిన్న (సోమవారం) రాత్రి చిరంజీవి వ్యాఖ్యాతగా ”మీలో ఎవరు కోటీశ్వరుడు’ తొలి ఎపిసోడ్ ప్రసారమైయింది.
ముందే చెప్పుకున్నట్లు ఒక టీవీ షోను హోస్ట్ చేయడం మెగాస్టార్ కి చాలా కొత్త. ఫస్ట్ ఎపిసోడ్ లో మెగా స్టార్ ని చూసిన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్. మెగాస్టార్ ను హోస్ట్ గా చూసి ఒక్కింత సర్ప్రైజ్ కి లోనయ్యారు ఆడియన్స్. అయితే మెగాస్టార్ మాత్రం తనదైన ఈజ్ తో గేమ్ ను స్టార్ చేశారు. పెద్ద పెద్ద పరిచయాలు లేకుండా చాలా సింపుల్ గా మొదలుపెట్టారు. ”ఇదే ఉత్సాహం. ఇదే ఉద్వేగం. ఈ చప్పట్లు, ఈ కేరింతలు ఈ అరుపులు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఈ చప్పట్ల చప్పుడే నాకు ఆక్సిజన్. నన్ను ముందుకు నడిపించే శక్తి. ఇలాంటి ప్రోత్సాహం ఇలాంటి వేదిక మీద ఇదే నాకు మొదటిసారి. అందుకే చాలా ఎక్సయిన్టింగ్ గా వున్నాను. ఎన్నో కలలతో, ఎన్నో కారణాలతో ఎంతో మంది ఇక్కడ పోటి పడబోతున్నారు. ఆ కలలన్నీ నిజం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి విజయం కోరుకునే ఆశా జీవి మీ చిరంజీవి. లెట్స్ బెగైన్ ది గేమ్” అంటూ గేమ్ లోకి వెళ్ళిపోయారు చిరంజీవి.
తెలుగులో ”మీలో ఎవరు కోటీశ్వరుడు” అంటే నాగార్జునకు అలవాటైపోయారు ఆడియన్స్. ఇప్పుడీ స్థానం చిరంజీవిని చూడడం ఖచ్చితంగా కొత్త అనుభూతి. మెగాస్టార్ కూడా ఇప్పుడు తనదైన ఎనర్జీతో గేమ్ ను స్టార్ చేశారు. ఫార్మేట్ పాతదే అయినా షోను పూర్తిగా వోన్ చేసుకున్నట్లు కనిపించారు చిరు. అడుగడుగునా తన మార్కే చూపించారు. అయితే మెగాస్టార్ స్టేజ్ పై మాట్లాడితే కాస్త నాటకీయంగా ఉంటుంది. అలాగే నాగార్జున తో పోల్చుకుంటే ఇంటరాక్షన్ కూడా తక్కువ. అయితే ఈ షోకి వచ్చేసరికి మాటల్లో కాస్త నాటకీయత కనిపించినా ఆడియన్స్ తో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారనిపించింది. తొలి ఎపిసోడే కాబట్టి కాస్త డ్రమెటిక్ గా అనిపించినా రానున్నా ఎపిసోడ్స్ లో పూర్తిగా సహజత్వంలోకి వచ్చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
నాగార్జున- చిరుల మధ్య తేడాలి గమనిస్తే.. కామన్ లైన్స్ అని మారిపోయాయి. నాగార్జున ”కంప్యూటర్ గారు” అని పిలిచేది. కాని చిరంజీవి ‘మాస్టర్ జీ’ అని మార్చేశారు. అలాగే విరామానికి ముందు”చిటికెలో వచ్చేస్తా” లైన్ ను ”చిరు విరామం’ అని మార్చుకున్నారు మెగాస్టార్. ఆడియన్స్ ను టెన్షన్ పెట్టడంలో కూడా చిరు తన మార్కును చూపిస్తున్నారు. అన్నిటికి మించి ఇలాంటి షోలు చేయలంటే వాయిస్ లో ధమ్ వుండాలి. మెగాస్టార్ వాయిస్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా వాయిస్ ఈ షోకి మరో అదనపు ఆకర్షణ. అయితే బేసిగ్గా చిరు వాయిస్ కొంచెం లౌడ్ గా ఉంటుంది. ఇలాంటి షోలకి వచ్చేటప్పటికే దాన్ని కాస్త సమన్వయం చేసుకునేలా చుసుకోవాలి. చిరులో వున్న మరో ప్రత్యేకత తెలుగు భాషపై ఆయనకున్న పట్టు. భాషను చాలా స్పష్టంగా పలుకుతరాయన. ఇంగ్లీష్ వెర్షన్ ప్రశ్నను చదవడం తప్పితే.. షో మొత్తం అచ్చమైన తెలుగులోనే కొనసాగిస్తున్నారు. ఇది అభినందనీయం.
‘కౌన్ బనేగా కరోడ్ పతి’.. బుల్లితెరపై మెగా హిట్ షో. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ షోకు వెన్నుముక. ఈ షో గ్లామర్ ను వందరెట్లు పెంచారు అమితాబ్ బచ్చన్. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ చాలా ప్రాంతీయ భాషలకు వెళ్ళింది. ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది. అయితే తెలుగులో నాగార్జున మాత్రం ఈ షోకు ఆదరణ తెచ్చిపెట్టడంలో సక్సెస్ అయ్యారు. హిందీ తర్వాత ఈ షో హిట్ అయ్యింది తెలుగులోనే. ఇప్పుడు నాగార్జున స్థానంలోకి చిరంజీవి వచ్చారు. చిరంజీవి స్టార్ డమ్, చరిష్మా ఈ షోకి ప్లస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి, మెగాస్టార్ చేస్తున్న ఈ మెగా షోకు ఈ స్థాయిలో ఆదరణ వుందో తెలుసుకోవాలంటే ..టీఆర్ పీ రేటింగ్స్ బయటికిరావాల్సిందే.