తెలంగాణలో రాజకీయ విమర్శలూ ప్రతివిమర్శలు ఈ మధ్య కాలంలో కాస్త తగ్గాయనే చెప్పాలి. కారణం.. రాష్ట్రంలో తెరాస తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చి దిద్దుతున్నారు కదా! రాజకీయ ఏకీకరణ పేరుతో విపక్ష సభ్యుల్ని ఫిరాయింపుల ద్వారా బాగానే ఆకర్షించారు! విపక్షం వీక్ అయితే.. విమర్శల్లో సత్తా కూడా సహజంగానే తగ్గుతుంది. అయితే, తాజాగా మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతోంది. దిగడమే కాదు… ఆ విమర్శల్లో వాస్తవాలు ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతోంది.
మంత్రి కేటీఆర్ సొంత శాఖ చేనేత. చేనేతల్ని ప్రోత్సహించడం కోసం కొన్ని చర్యలు చేపడుతున్నారు. దీన్లో భాగంగా తెలంగాణ నేతలకు బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ సమంతను నియమించారు. రాష్ట్రంలో ఇంకెవ్వరూ లేనట్టు సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం వెనక మతలబు ఏదో ఉంటుందన్న అభిప్రాయం సహజంగానే వ్యక్తమౌతోంది. ఇదే విషయంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేటీఆర్ మీద సీనియర్ నాయకుడు, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించగల అర్హత కేటీఆర్‌కు లేదని అన్నారు. రాజకీయాల్లో కేటీఆర్ ఒక బచ్చా మాత్రమే అనీ.. కాంగ్రెస్ నేతల వీపులు పగులకొడతా అనే స్థాయి విమర్శలు చేసేంత ఎదుగుదల ఆయనకి లేదని షబ్బీర్ విమర్శించారు. కాంగ్రెస్ చరిత్ర ఏంటో తెలియాలంటే తండ్రి కేసీఆర్‌ను అడగాలని సూచించారు.
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతను నియమించడం వెనక ఆంతర్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. నాగార్జునతో ఉన్న స్నేహాన్ని మరింత బలపరచుకునేందుకే, అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలు సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలు చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎందుకు పనికిరాలేదో చెప్పాలన్నారు.
నిజానికి, నాగార్జునకు కేటీఆర్‌కు మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయని బయట అనుకుంటారు. ఇద్దరి ఫ్రెండ్‌షిప్ తెలిసిందే. షబ్బీర్ అలీ విమర్శిస్తున్నట్టుగానే ఆ స్నేహబంధంతోనే సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి ఉండొచ్చు. తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో సమంత నియామకాన్ని కేటీఆర్ ఏవిధంగా సమర్థించుకుంటారో వేచి చూడాలి.