తెలుగు మీడియాకు తమిళనాడు భవిష్యత్‌పై మరీ శ్రధ్ధ ఎక్కువైపోయింది. అఫ్కోర్స్ చుట్టూ తిప్పి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ ప్రత్యర్థులకు మకిలి అంటించడమే ఆ మీడియా అసలు టార్గెట్ అనుకోండి. అలాగే పనిలో పనిగా గవర్నర్‌ని అడ్డుపెట్టుకుని నరేంద్రమోడీ ఆడుతున్న గేం గురించి తెలుగు ప్రజలకు తెలియకుండా చేయడం కూడా ప్రధాన లక్ష్యమే. తెలుగు ప్రజల కోసమే మేం పనిచేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్న నిజాన్ని మాత్రం చాలా లౌక్యంగా ‘జర్నలిజం’ తెలివేటలతో మేనేజ్ చేస్తూ ఉంటారు. అదేంటంటే తప్పిపోయిన పసిపాపను ఆ పాప తల్లిదండ్రులకు అప్పగించాం, వ్యాధితో బాధపడుతున్న పసివాడికోసం నిధులు కలెక్ట్ చేశాం…..ఇక మాకంటే తెలుగు ప్రజల శ్రేయోభిలాషి ఎవరున్నారు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం, రైల్వే జోన్‌లాంటి విషయాల్లో మాత్రం అధికారంలో ఉన్నవాళ్ళకు అనుకూలంగా నడుచుకుంటూ ఉంటారు. ఇక్కడ చంద్రబాబుకు భజన చేయడంతో పాటు 2014 నుంచి మోడీని దైవ సంభూతుడిగా చూపించడం కోసం ఒక వర్గం తెలుగు మీడియా ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు కూడా శశికళను దెయ్యంగా ప్రజెంట్ చేయడంపైనే వాళ్ళ మీడియా తెలివితేటలన్నీ వాడుతున్నారు. శశికళ అవినీతిపరురాలు. ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు….అలాగే శశికళ జైలుకు వెళ్ళడం కూడా న్యాయమే. కానీ అధికారంలో ఉన్నవాళ్ళ చుట్టూ చట్టం చుట్టంలా తిరుగుతోందన్న అసలు నిజాలు మాత్రం భయంగొలిపేలా ఉన్నాయి. ఆ ప్రాతిపదికన చూసుకుంటే 2019వరకూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తే శూన్యహస్తమే మిగిలేలా పరిస్థితులు ఉన్నాయి.
శశికళ ఇష్యూతో ప్రజలకు ఏం ఒరిగింది? తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి తమిళ ప్రజల అభివృద్ధికి ఏ స్థాయిలో పాటుపడతాడు అన్న విషయాలను పక్కనపెడితే దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా మోడీ అండ్ కో నుంచి ఒక సీరియస్ వార్నింగ్ అయితే వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేతలు మాత్రం ఇక నుంచి మోడీని ఇంప్రెస్ చేసే మార్గాలు వెతుక్కోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసుతోనే మోడీకి సరెండర్ అయిపోయారు. అందుకే ప్రత్యేక ప్యాకేజ్‌లో ఏం ఉంది అనే విషయం తెలుసుకోకుండానే ప్యాకేజ్ కేక….హోదా వేస్ట్ అని చెప్పేశాడు. అలాగే పోలవరం కోసం రెండున్నరేళ్ళకు గాను అటూ ఇటూగా రెండువేల కోట్ల రూపాయల అప్పు ఇస్తే చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వానికి చేసిన భజన అంతా ఇంతా కాదు. ఇక రీసెంట్గా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగింది ఏమీ లేకపోయినా …..మోడీకి సన్మానం పేరుతో చంద్రబాబు పార్టీ నేతలు చేసిన హడావిడి కూడా విశ్లేషకులను ఆశ్ఛర్యపరిచింది. మోడీ పవర్ ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టే మోడీ భజన విషయంలో జగన్ కంటే పదడుగులు ముందే ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంలో వైఎస్ జగన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ప్రత్యేక హోదా విషయంలో బాబుపైకి ఒంటికాలి మీద లేచే జగన్‌కి మోడీని విమర్శించడానికి మాత్రం మాటలు రావు. చంద్రబాబుకు అయినా బిజెపితో పొత్తు ఉంది. మరి జగన్ పార్టీకి మోడీతో ఏం సంబంధం ఉంది? ఎందుకు మోడీని విమర్శించడు? అనే ప్రశ్నలకు సమాధానం ఆ పార్టీ నేతలు కూడా చెప్పలేరు.
శశికళ జైలు బాటకు ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రతి పక్షనేతల తీరు ఇలా ఉందంటే ఇక ఇప్పటి నుంచి 2019వరకూ ఎలా ఉంటుంది? వైఎస్ జగన్ కూడా మోడీని పొగిడే ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడేమో తెలియదు. అలాగే చంద్రబాబుతో సహా టిడిపి నాయకులందరూ కూడా ఇక నుంచీ మోడీని పొగిడే విషయంలో వెంకయ్యనాయుడును మించిపోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న రెండు పార్టీల పరిస్థితి అలా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం మోడీని డిమాండ్ చేసేవారు ఎవరు? అఫ్కోర్స్ బిజెపి రాష్ట్ర నాయకులు ఎలాగూ అడగరనుకోండి. వాళ్ళు కూడా మోడీ, అమిత్ షా, వెంకయ్యలకు సన్మానాలు ఎలా చెయ్యాలా అన్న ఆలోచనల్లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్రమోడీ ఏమీ చెయ్యడం లేదు అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పనిచేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా లేదు. అంతా కూడా ఏదో ఒక పార్టీకి భజన చేస్తూ బ్రతికేస్తున్నవాళ్ళే. శశికళ ఇష్యూతో తమిళనాడుకు జరిగే ప్రయోజం ఎంతో తెలియదు కానీ శశికళకు నరేంద్రమోడీ ఇచ్చిన ‘ట్రీట్మెంట్’ని చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన నాయకులకు ఇక ప్రజల ప్రయోజనాల కంటే కూడా మోడీ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమవుతాయి. అంటే గత రెండేళ్ళ కంటే కూడా ఇంకా దారుణంగా 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు దక్కవన్నమాట. ఎనీ డౌట్స్?