యుద్ధం, సబ్ మెరైన్, అండర్ వాటర్ వార్.. ఇవన్నీ తెలుగు చిత్రసీమకుకొత్త పదాలు. వందల కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్‌లో ఓ వార్ సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమా మన తెలుగులో ఎందుకు రావు…? అంటూ మనసు చివుక్కుమనేది. యుద్ధ సన్నివేశాలతో తెలుగు సినిమా అనే లోటు మొన్న బాహుబలితోనూ, నిన్న గౌతమిపుత్ర శాతకర్ణి తీర్చేశాయి. ఇప్పుడు నీటి యుద్ధం అనే కలను నిజం చేయడానికి ఘాజీ వచ్చింది. భారత్ – పాక్ యుద్ధ ఘట్టంలో అపూర్వమైన ఓ చారిత్రక సంఘటనని తెరపై తీసుకొచ్చిన చిత్రమిది. మరి ఆ ప్రయత్నం ఎంత వరకూ నెరవేరింది? యుద్ధ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఘాజీ మార్క్ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
ఇండియన్ నావీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం విక్రాంత్. దీనిపై ఎటాక్ చేసి, ఇండియాని దెబ్బకొట్టాలని అదే సమయంలో తన నుంచి విడిపోతున్న బంగ్లాదేశ్‌కి బుద్ది చెప్పాలన్నది పాక్ ఆర్మీ వ్యూహం. అందుకే.. ఘాజీ అనే సబ్‌మెరైన్‌ని రంగంలోకి దింపుతుంది. ఈ విషయం భారత్ నేవీకి తెలిసిపోతుంది. పాక్ వ్యూహాల్ని తిప్పికొట్టాలని ఎస్ 21 అనే సబ్ మెరైన్ తో ఓ ఆపరేషన్ చేపడుతుంది. దానికి కెప్టెన్ రణ్ విజయ్ సింగ్ (కేకే మీనన్). లెఫ్ట్‌నెంట్ కమాండర్ అర్జున్ (రానా) ఈ టీమ్ లో కీలకసభ్యుడు. రణ్ విజయ్ సింగ్ పాక్‌పై ఎప్పుడెప్పుడు దాడి చేయాలా.. అని చూస్తుంటే, అతన్ని పూర్తిగా కంట్రోల్‌లో పెడుతుంటాడు అర్జున్. ఓ దశలో… ఎస్ 21ని మట్టుపెట్టడానికి శుత్రసైన్యం పక్కా వ్యూహంతో వల పన్నుతుంది. ఈ వలలో భారత సైన్యం చిక్కుకొందా? సబ్ మెరైన్‌తో పాటు దేశం పరువుని అర్జున్ ఎలా కాపాడాడు? ఘాజీని సముద్రంలో ఎలా కలిపేశాడు? ఇవన్నీ తెలియాలంటే ఘాజీ చూడాల్సిందే.
* విశ్లేషణ
ఇది కథ కాదు. చరిత్ర. ప్రతి భారతీయుడూ గర్వంగా చెప్పుకొనే చారిత్రక ఘట్టం. అసలు ఇలాంటి సంఘటన జరిగిందా?? అనే ఆశ్చర్యం కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు. అతను అల్లుకొన్న కథ.. సన్నివేశాలు, సంఘటనలు, యుద్ధం ఇవన్నీ కథలో ఉత్కంఠత కలిగించేందుకు దోహదం చేశాయి. సినిమా చూస్తున్నంత సేపూ.. ఆ సబ్ మెరైన్‌లో మనమూ ఉన్నామా? మన కళ్ల ముందే యుద్ధం జరుగుతుందా?? అనే ఫీల్ క్రియేట్ చేశారు. తొలి సన్నివేశాలు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే అక్కడంతా నావీ భాష వాడారు. ఆ అంకెలు, గణాంకాలు, పదాలు.. మనమెప్పుడూ విననివి. అందుకే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది తప్ప.. అదేంటో స్పష్టంగా తెలీదు. కానీ ఆ తరవాత మెల్లమెల్లగా కథలోకి వెళ్లిపోతాం. ప్రధమార్థం వరకూ కెప్టెన్ రణ్ విజయ్ సింగ్ దే హవా. హీరో పాత్ర ఏమైపోయిందా అనిపిస్తుంది. ద్వితీయార్థాన్ని పూర్తిగా తన గ్రిప్‌లోకి తీసుకొన్నాడు రానా. ఆ సన్నివేశాల్లో సిసలైన హీరోయిజం కనిపిస్తుంది.
రెండు గంటల పాటు.. ఒకే సెట్లో కథ నడపడం, అక్కడున్న సన్నివేశాల్ని రక్తి కట్టించడం, లాజిక్‌లు గుర్తుకు రాకుండా చేయడం నిజంగానే గొప్ప విషయం. సెకండాఫ్‌లో స్ర్కీన్ ప్లే గ్రిప్పింగ్ గా రాసుకోవడంతోనే ఈ మ్యాజిక్ సాధ్యమైంది. ఇండియన్ నావీ గెలుస్తుందన్న సంగతి సినిమా ప్రారంభంలోనే ఊహిస్తాడు ప్రేక్షకుడు. అయితే ఆ సంగతి మర్చిపోయి, ఇప్పుడు ఏం జరుగుతుందా అంటూ సీట్ల అంచున ఊపిరి బిగబెట్టుకొని చూసేలా చేయడంలో దర్శకుడు విజయం సాధించాడు. ప్రధమార్థంలో అక్కడక్కడ కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి గానీ, సెకండాఫ్‌లో ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఏ సన్నివేశం విసిగించదు. అర్థం అవ్వలేదేంటి? అనే కాన్సెప్టే ఉండదు. అంతలా కథలోకి తీసుకెళ్లిపోయాడు. చిత్రాన్ని ముగించడంలో దర్శకుడు తొందరపడిపోయాడేమో అనిపిస్తుంది. క్లైమాక్స్‌ని ఇంకాస్త పకడ్బందీగా, ఇంకాస్త ఉత్కంఠత రేపేలా రాసుకొంటే బాగుండేది. తొలి సన్నివేశాల్లో కన్‌ఫ్యూజన్ దూరం చేసేలా… అక్కడ జరుగుతున్న సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా జాగ్రత్త పడాల్సింది. కొన్ని లాజిక్కులూ సమాన్య ప్రేక్షకుడి బుర్రకెక్కవు. నీటిలో… అందులోనూ సబ్ మెరైన్‌లో ఉంటూ.. జాతీయ గీతం ఆలపించినప్పుడు.. అది మరో సబ్ మెరైన్‌లో ఉన్న శత్రువుకి ఎలా వినిపించింది? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉంటే… దాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సింది.
* నటీనటుల ప్రతిభ
బాహుబలి తరవాత రానా ఈ సినిమా ఎందుకు చేశాడు?? అనే ప్రశ్నకు ఈ చిత్రంలోని అర్జున్ పాత్ర ఓ సమాధానం. రానా కోరుకొంటే కమర్షియల్ కథలు చాలా దొరికేవి. కానీ.. కథని, పాత్రని నమ్మి ఓ సినిమా ఒప్పుకోవడం, తన పాత్రలో రాణించడం గొప్ప విషయం. రానా సినిమా అంతా సీరియస్‌గానే కనిపిస్తాడు. ఒక్కటంటే ఒక్క చోట కూడా.. చిన్న చిరునవ్వు కనిపించదు. తెరపై ఎంత సీరియస్‌గా కనిపించాడో.. అంతే సిన్సియర్‌గా నటించాడు. తాప్సిని ఎందుకు తీసుకొన్నారు? అసలు ఆ పాత్ర ఎందుకు?? అనిపిస్తుంది. తాప్సి క్యారెక్టర్ వల్ల ఒరిగిందేం లేదు. తన పరిధి కూడా చాలా తక్కువ. అతుల్ కులకర్ణి తన పరిధి మేర నటించాడు. ఇక సెంట్రాఫ్ అట్రాక్షన్… కేకే మీనన్. డబ్బింగ్ కాస్త వీక్ అయ్యింది గానీ.. లేదంటే తన కెరీర్‌లో ఇది మరో బెస్ట్ క్యారెక్టర్‌గా మిగిలిపోయేది. అయినా ఫర్వాలేదు.. తాను తెరపై ఉన్నంత సేపూ ఆడియన్స్‌తో సెల్యూట్ చేయించేలా నటించాడు.
* సాంకేతిక వర్గం
ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. నీటిలో జరిగిన ఓ యుద్దాన్ని సినిమాగా మలచొచ్చు అన్న ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. దాన్ని తెలుగు సినిమా భాషలో అనువదించడం, గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేలో నడపడం అతని ప్రతిభకు అద్దం పట్టింది. సంకల్ప్‌కి మిగిలిన సాంకేతిక బృందం నుంచి చక్కటి తోడ్పాటు అందింది. ముఖ్యంగా ఆ సబ్ మెరైన్ సెట్. తుక్కు పద్దార్థాలతో తయారు చేసిన ఆ సెట్.. ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. ఆ ఇరుకిరుకు సెట్‌లో పరుగులుపెట్టిన మది కెమెరాకూ మంచి మార్కులు పడతాయి. మనం నీటి అడుగున ఉన్నాం.. అనే ఫీలింగ్ ఆర్.ఆర్‌తో తెప్పించిన కె.. ఈ సినిమాకి మరో ప్రధాన మూల స్థంభం. గుణ్ణం గంగరాజు మాటలు సింపుల్‌గా ఉన్నాయి. రెండు చోట్ల మాత్రం హిలేరియస్ గా నవ్వొస్తుంది.
* ఘాజీ : తీసిన వాళ్లకు సెల్యూట్… దేశానికి జైహింద్!
తెలుగు 360 రేటింగ్: 3.25/5