ఫేక్ న్యూస్ ఛానెల్ టీవి 999లో వార్తలొస్తున్నాయి.
యాంకర్ నాగ్: ఎప్పటికప్పుడు ఫేకింగ్ న్యూస్ తో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరిచేసే టివీ త్రిబుల్ నైన్ వార్తలకు స్వాగతం. ఇవ్వాళ ప్రత్యేకంగా వండివార్చిన న్యూస్ ని అందించడానికి ప్రేమ్ సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ్ చెప్పండి, ఇవ్వాళ ఏంటీ ఫేకింగ్ న్యూస్.
రిపోర్టర్ ప్రేమ్ : నాగ్, చాలా ఆసక్తికరమైన వార్త నాచేతుల్లో ఉంది. ఇవ్వాళ ఎన్నిగంటలైనా ఈ ఒక్కవార్తతోనే సాగదీయొచ్చునాగ్.
నాగ్ : భేష్, అందుకే నువ్వు సీనియర్ రిపోర్టర్ అయ్యావ్ ప్రేమ్. చెప్పు, ఏంటా వార్త ?
ప్రేమ్ : సెప్టెంబర్ 9న ప్రళయం వచ్చేస్తుందట నాగ్.
నాగ్ : (మహా ఆనందపడిపోతూ) ఓఁ.. సూపర్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత చల్లటిమాట చెప్పావ్. టీఆర్పీ రేటింగ్స్ పెరిగే వార్త ఇది. మన ఎండీగారు కూడా తెగసంతోషపడిపోతారు. సెప్టెంబర్ 9న ప్రళయం వస్తుందనడానికి నీదగ్గరున్న ఆధారాలేమిటీ ప్రేమ్ ?
ప్రేమ్ : ఇలాంటివి నువ్వు అడుగుతావనే ఇక్కడో న్యూమరాలజిస్ట్ ను నించోబెట్టాను. నాచేతిలో గొట్టం అతని నోట్లో దూరుస్తాను. మనకెంతసేపుకావాలంటే అంతసేపు మాట్లాడతాడు నాగ్.
నాగ్ : (చాలా సిన్సియర్ గా ఫోజిస్తూ) టివి 999 చూస్తున్న ప్రేక్షకులకు విజ్ఞప్తి. (తనకు అంతా తెలిసినట్టు మరోవిధంగా ఫోజిస్తూ) సెప్టెంబర్ 9న ప్రళయం ఖచ్చితంగా రాబోతున్నది. ఆరోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
(గ్రాఫిక్స్ పడుతుంటాయి)
1. ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాలి. రైళ్లు, బస్సులు ఎక్కవద్దు.
2. విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలు మాడిమసైపోతాయి.
ఆ నగరవాసులు ముందుగానే ఖాళీచేసివెళ్లాలి.
3. ప్రతిఒక్కరూ టైర్లు, ట్యూబ్ లు నడుంకు బిగించుకోవాలి.
వరదవస్తే తప్పించుకోవడం సులువుగా ఉంటుంది
4. నాలుగు జతల బట్టలు, కాసిని తినుబండారాలు మూటగట్టుకుని
నడుంకి బిగించుకుని సిద్ధంగా ఉండండి.
5. మీ సెల్ పోన్ ని ముందుగానే పూర్తి ఛార్జింగ్ లో ఉంచుకోండి.
కమ్యూనికేషన్ ఇబ్బందిలేకుండా చూసుకోండి.
ప్రేమ్ : ఓర్నాయనో… ఆపు నాగ్, ఆపు… ప్రళయం ఎలా వస్తుందో ఇంకా చెప్పనేలేదు, అప్పుడే విజయవాడ, హైదరాబాద్ మాడిమసైపోతాయా…? అలా చెబితే జనం నిన్ను మాడ్చేస్తారు నాగ్.
నాగ్ : (అమాయకంగా) మరి అప్పుడోసారి కృష్ణకు వరదలొచ్చినప్పుడు, విజయవాడ మునిగిపోతుందనీ, కర్నూలు, మంత్రాలయం మ్యాప్ లో లేకుండా పోతాయనీ, సెల్ ఫోన్లు పనిచేయవని చెబితే రేటింగ్ బాగా పెరిగిందికదా… నీకూ నాకు జీతం కూడా పెరిగిందీ..(అదోలా నవ్వేస్తూ) హ్హీహ్హీహ్హీ… అది గుర్తుకువచ్చి…
ప్రేమ్ : నీ మెమరీ తగలయ్యా, రెండు తెలుగురాష్ట్రాల రాజధానులను బూడదపాలు చేద్దామనే. సరే, నాగ్ ఇప్పుడు నాదగ్గర న్యూమరాలజిస్ట్ లెక్కల్రావ్ ఉన్నారు. ఆయన బాగా లెక్కలుగట్టి మరీ చెబుతున్నారు ఈ సెప్టెంబర్ 9వ తేదీన భూప్రళయం వస్తుందని అంటున్నారు. చెప్పండి లెక్కల్రావ్ గారు, అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
న్యూమరాలజిస్ట్ లెక్కల్రావ్ : సంఖ్యాశాస్త్రాన్ని మదించి చూస్తుంటే సెప్టెంబర్ 9 బుధవారం తర్వాత గురువారం మనం చూస్తామోలేదో చెప్పలేం. ఎందుకంటే…
ప్రేమ్ : ఇక చెప్పక్కర్లేదు, నాకంతా తెలిసిపోయింది.చిటికెడు ఉప్పందిస్తే చాలు ఈ ప్రేమ్ చాంతాడంత అల్లుకుపోతాడు. దటీజ్ ప్రేమ్. విన్నావ్ కదా నాగ్. 9వ తారీఖు ప్రళయం తప్పదు. ఆరోజు సంఖ్యాపరంగా చూస్తే, 9-9-2015. శని, కుజుడు వక్రదృష్టితో చూస్తున్నారు నాగ్. దీంతో ప్రళయం తప్పదు.
నాగ్ : గుడ్, ప్రేమ్ చెప్పండి, కచ్చితంగా ప్రళయం ఎన్నిగంటలకు స్టార్ట్ అవుతుంది ? ఎప్పుడు ముగుస్తుంది? మధ్యలో బ్రేక్ ఏమైనా తీసుకోవచ్చా?? ఆ వివరాలు కనుక్కుని చెప్పండి. (ప్రేక్షకులవైపు తిరిగి) ప్రళయం వచ్చేస్తోంది. ఇక మానవాళి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ ప్రళయంపై టీవి త్రిబుల్ నైన్ ప్రత్యక్ష్యప్రసారం చేస్తూనే ఉంటుంది. ఎక్కడ భూకంపం వచ్చినా, వరదలొచ్చినా, ఆకాశంనుంచి గ్రహశకలాలు దూసుకువచ్చినా ప్రతిక్షణం లైవ్ ఇస్తూ, నిపుణులతో చర్చాకార్యక్రమాలు నిర్వహిస్తూ మిమ్మల్ని ఎలెర్ట్ చేస్తుంటాం. చూస్తూనే ఉండండి టివీ త్రిబుల్ నైన్.
అప్పటిదాకా న్యూస్ చూస్తున్నవారికి పిచ్చెక్కి నేలమీదపడి దొర్లుతూ విచిత్ర ధ్వనులు చేస్తున్నారు. అంతే, దీనిపై కూడా స్పెషల్ స్టోరీ చేయడానికి మరోపక్కన ప్రేమ్ రెడీ అవుతున్నాడు.
– కణ్వస