”మంచి సినిమా తీయండి. ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధం”. కామన్ వినిపించే డైలాగ్ ఇది. కాని ఒకొక్కసారి ఈ మాట తారుమారౌతుంటుంది. ”మంచి సినిమా” అనే ముద్ర పడీ కూడా బాక్సాఫీసు దగ్గర దారుణంగా పల్టీకొడుతుంటాయి కొన్ని సినిమాలు. ఎలాంటి ఆదరణ లేకుండా కనుమరుగైపొతుంటాయి. దీనికి తాజా ఉదాహరణ… నాగార్జున ‘నమో వెంకటేశాయ’. ఈ సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతం అన్నారు. ప్రతీ ఛానల్ ఆహో వోహో .. అంటూ భుజానికి ఎత్తుకుంది. కానీ బాక్సాఫీసు రిజల్ట్ మాత్రం దారుణంగా వుంది. కనీస వసూళ్ళు లేవు సినిమాకి. సినిమా బావులేదా? అంటే కాదు. పబ్లిసిటీ తగ్గిందా?బ్రహ్మండంగా చేశారు. మౌత్ టాక్ బాలేదా? అంటే అదీ సూపరు. కానీ కలక్షన్సే లేవు. సినిమాకి పదిరుపాయిలు పెడితే రెండు రూపాయిలు కూడా వెన్నక్కి రాని పరిస్థితి. ఇంత గొప్ప రివ్యూలు వచ్చాయి,సినిమా చూసిన అందరూ బావుందని చెప్పినా, మీడియా కూడా మోటివ్ చేసినప్పటికీ ఆదరణ ఇంత వీక్ గా వుందంటే ఏమని అర్ధం చేసుకోవాలి??
కొంచెం వెనక్కి వెళితే… ఈ మధ్యనే ‘అప్పట్లో ఒకడుండే వాడు”అనే సినిమా వచ్చింది. ఇది కూడా మంచి సినిమా, కొత్త సినిమా అనే ప్రశంసలు అందుకుంది. రివ్యూలు కూడా యునానిమస్ గా”బావుంది” అని ఇచ్చారు. ఓ కొత్త సినిమా అనే కితాబు అందుకుంది’అప్పట్లో ఒకడుండే వాడు’. ఈ సినిమాతో ‘సుడో రియలిజం’ అనే జోనర్ ను పరిచయం చేశాడు దర్శకుడు. నిజంగా తెలుగు తెరకు ఇది చాలా డిఫరెంట్ కైండ్ అఫ్ ఫిల్మ్. అయితే ఈ సినిమా కూడా ఆదరణ లభించలేదు. ఇంకా కాస్త వెనక్కి వెళితే.. నాగార్జున ఊపిరి సినిమా పరిస్థితి కూడా ఇదే. ఈ సినిమా కూడా మంచి సినిమా, కొత్త సినిమా,సరికొత్త అనుభూతులు పంచిన సినిమా అనే కితాబులు దక్కాయి. తీరా బాక్సాఫీసు రిజల్ట్ మాత్రం చాలా నిరాశజనకంగా వచ్చింది. సోగ్గాడే చిన్నినాయన లో సగం కూడా ఈ సినిమా కలెక్ట్ చేయలేకపోయింది. కంచె, ఎవడే సుబ్రహ్మణ్యం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.. ఇలా చెప్పుకుంటూ పొతే గడిచిన ఐదేళ్లలో మంచి సినిమా అని పేరుతెచ్చుకొని బాక్సాఫీసు దగ్గర పల్టీకొట్టేసిన లిస్టు పెద్దదే.
ఎలాంటి విషయం లేని పక్తు ఊరమాస్ సినిమాలు బాగానే ఆడుతున్నాయి. నాలుగు కామెడి బిట్లతో బండిలాగించేసే సినిమాలు జబర్దస్ట్ వసూళ్ళు అందుకుంటున్నాయి. కొత్త సీసాలో పాత నీరు పోసి తయారు చేసిన ఫార్ముల సినిమాలు ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయి. కానీ ఎదో కొత్తదనం చూపించాలి… ఒక మంచి కధ చెప్పాలి…. కొంచెం డెప్త్ వున్న సినిమా చూపించాలి.. అనే ఇంటెన్సన్ తో తీసి, మంచి టాక్ వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడుతున్నాయి. సినిమా బావుందని తెలిసినా, మీడియాలో పాజిటవ్ వైబ్రేషన్స్ వున్నా , మౌత్ టాక్ సూపర్ అని వచ్చినా.. కొన్ని సినిమా మాత్రం ప్రేక్షకులకు పట్టడం లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థతి. మరి ఈ పరిస్థితికి కారణం ఏమిటి ? ప్రేక్షకులు మారిపోయారా ? ప్రేక్షకులను మార్చేశారా? ఒక మంచి సినిమా అని తెలిసినా కూడా ప్రేక్షకులకు ఎందుకు పట్టడం లేదు?
దానికి కారణం తెలుగు సినిమా రూపకర్తలే అని చెప్పకతప్పదు. సినిమా అంటే ఇలా ఉటుందనే ఒక రింగ్ లో ప్రేక్షకులను వుంచేశారు దర్శక రచయితలు. ఇది హీరో ఇంట్రడక్షన్, ఫస్ట్ ఫైటు , హీరోయిన్ ఎంట్రీ , పాట, మరో ఫైటు, ఇంటర్ వెల్ ట్విస్ట్, కామెడి బిట్లు, మళ్ళీ పాట, క్లైమాక్స్ ఫైటు.. ఇలా ఓ ఫార్ములాను ప్రేక్షకుల నరనరాల్లోకి ఎక్కించేశారు. బుర్రల్లో బలవంతంగా రుద్దేశారు. దీంతో సినిమా అంటే ఇలానే వుండాలి అనే పరిస్థితికి వచ్చేశారు మెజార్టీ ప్రేక్షకులు. ఊపిరి సినిమానే తీసుకుందాం. దీని పక్కన సోగ్గాడే సినిమాని పెడదాం. రెండిటికి హిట్ టాక్ వచ్చింది. అటు నిర్మాణంలోను, కొత్తదనంలోనూ ఊపిరి సినిమాది నెక్స్ట్ లెవల్. కాని ప్రేక్షకులకు ఊపిరి సినిమా ఆనలేదు. ఇది ఒక్కటి చాలు. మన సినీ రూపకర్తలు ఫార్ముల సినిమాని ప్రేక్షకులకు ఎంతలా ఎక్కించేశారో చెప్పడానికి. ఇది ఎక్కువ తెలుగులోనే కనిపిస్తుంది. పక్క భాషల్లో వైవిధ్యమైన సినిమాలు ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ”ధూమ్3 ”సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించి అమీర్ ఖాన్ .. ఎలాంటి హీరోయిజం లేని ”దంగల్” లో బాణా పొట్టతో కనిపించి శభాష్ అనిపించాడు. రెండిటికి ఆదరణ ఒక్కటే. కాని ఇక్కడ పూలరంగడిగా నాగార్జునను చూసి మురిసిపోయినా ప్రేక్షకులు, అదే వీల్ చైర్ లో వున్న నాగార్జునను రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇదంతా ఫార్ముల రుద్దుడు మహిమే.
మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇదీ సినిమా రూపకర్తల చేతిలోనే వుంది. ప్రేక్షకుల అభిరుచి ఖచ్చితంగా మారుతుంది. అయితే అదంతా వేగంగా జగరకపోవచ్చు. ఇప్పుడు ఆ ఫార్మలను మార్చే భాద్యత సినీ రూపకర్తలలదే. మంచి సినిమాలు అని పేరుతెచ్చుకొనే చిత్రాలు తరచూరావు. వచ్చినప్పుడు సరైనా ఆదరణ దొరకడం లేదు. అయితే అలా అని అటు వైపు ప్రయాణం ఆపేయకూడదు. అలాంటి సినిమాలు తీస్తూనే వుండాలి. ఫార్ముల సినిమాని ప్రేక్షకులపై రుద్దిన సినీ రూపకర్తలు మంచి సినిమాలను కూడా రుద్దే ప్రయత్నం చేయాలి. ఒకటి కాదు రెండు కాదు. మంచి సినిమా ప్రేక్షకులకు అలవాటైనంత వరకూ రుద్దుతూనే వుండాలి. అలా చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకుల దృక్కోణంలో మార్పు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మార్పు సాధిస్తే గనుక ఇండస్ట్రీ కొత్త పుంతలు కొత్తే అవకాశం వుంది.
అన్నటు.. తాజగా ”ఘాజీ” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదీ సరికొత్త ప్రయత్నమే. అసలు ఫార్ముల సినిమా కాదు. ఇప్పటికే సినిమా చూసిన జనాలు అద్భుతమని అంటున్నారు. మరి ఈ సినిమాని ప్రేక్షకులు బాక్సాఫీసు దగ్గర నిలబెడతారా? ఆ మార్పు ఘాజీతో వస్తుందా? లెట్స్ సీ.