రెంటికీ చెడ్డ రేవడి అని పెద్దలు అంటారు! ఉన్న పదవీ పోయింది… వస్తుందనుకున్న జారిపోయింది! దీంతో తెగిన గాలిపటంగా మారిపోయింది పన్నీర్ సెల్వమ్ రాజకీయ భవిష్యత్తు. అమ్మకు విధేయుడిగా ఉండటం అనే ప్రాథమిక అర్హతతోనే ఆమె మరణించాక సీఎం అయ్యారు. చిన్నమ్మ శశికళ విషయంలోనూ అదే విధేయత ప్రదర్శించినట్టే ప్రదర్శించినా, ఢిల్లీ ప్రోద్బలంతో తోక జాడించారు. ఇప్పుడా తోక కట్ అయిపోయింది! అదే, శశికళకు కూడా వీర విధేయుడిగా ఉండి ఉంటే… ఆమె జైలుకు వెళ్లిన వెంటనే మళ్లీ సీఎం సీట్లోకి పన్నీరే వచ్చేవారు కదా! పళనిస్వామి తెరమీదికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు.
నిజానికి, కేంద్రంలోని భాజపా ఈ మొత్తం ఎపిసోడ్లో పన్నీర్‌ను ఒక పావుగా మాత్రమే వాడుకుంది. తమిళనాడు రాష్ట్రంపై పట్టు సాధించడం కోసం పన్నీరును తమవైపు తిప్పుకోవడం వరకూ సక్సెస్ అయింది. కానీ, ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు సమకూర్చడంలో మాత్రం సామ దాన భేద దండోపాయాలేవీ పనిచెయ్యలేకపోయాయి! శశికళను జైలుకు పంపినంత మాత్రాన తమిళనాడు పీఠం దక్కలేదు కదా. జైల్లో ఉన్న చిన్నమ్మకు విధేయుడిగా ఉంటే చాలు… కొత్త సీఎం పళని స్వామి పదవికి ఎలాంటి ఢోకా ఉండదు! చిన్నమ్మ ఆశిస్తున్నదీ ఇదే. ఇప్పుడు జరగబోతున్నది ఇదే.
ఈ తరుణంలో పన్నీర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడాయన భారతీయ జనతా పార్టీలో చేరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అది వినా వేరే మార్గం లేదు! ఎలాగూ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి… ఢిల్లీ పెద్దలకు వీర విధేయత ప్రదర్శించారు కాబట్టి, దయతలచి ఏదో ఒక పదవిని కేంద్రం ఇచ్చే అవకాశాలున్నాయి. అంతకుమించి, ఈ పదిహేను రోజుల్లో ఏవో అద్భుతాలు జరిగిపోయి… పన్నీరుకు అమాంతంగా మద్దతు పెరిగిపోయే పరిస్థితి అయితే ఉండదనేది విశ్లేషకుల అంచనా.
పన్నీరును పావుగా వాడుకున్న క్రమంలో కేంద్రంలోని అధికార భాజపా పరువు గంగలో కలిసిందనే చెప్పాలి. ప్రాంతీయ పార్టీలపై భాజపా అణచివేత ధోరణి ఈ స్థాయిలో ఉంటుందా అనేది తమిళనాడు విషయంలో మరోసారి నిరూపణ అయింది. రాష్ట్రాలను హస్తగతం చేసుకోవడం కోసం ఎలాంటి రాజకీయాలకైనా భాజపా తెగబడుతుందీ అనే ఇమేజ్ను రానురానూ బాగానే స్ట్రాంగ్ చేసుకుంటోంది. మోడీలోని సంస్కరణవాది మూగబోయి… ఫక్తు రాజకీయ నాయకుడు అనే అపరిచితుడు బయటకి వచ్చిన సందర్భాల్లో ఇదీ ఒకటిగానే మిగిలిపోతుంది…అంతే!