మూల విరాట్టులను వదిలిపెట్టి సామంతులను ప్రశ్నించడం అనేది ఎవరికైనా పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు పవన్ కూడా అదే చేస్తున్నాడు. మోడీ, చంద్రబాబులకంటే కూడా వెంకయ్య, సుజనాచౌదరి, రాయపాటి వాళ్ళను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తానంటూ కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడూ రాజకీయ తెరపై దర్శనమిస్తున్నాడు. ఇలాంటి రాజకీయం వళ్ళ జనాలకు ఒరిగేది ఏమీ ఉండదు కానీ పవన్ కళ్యాణ్‌కి మాత్రం ఓ బ్రహ్మాండమైన ప్రయోజనం ఉంది. తాను చేసిన తప్పులన్నీ మరుగునపడిపోయేలా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ చేస్తున్నది కూడా అదే.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పూర్తయిన మరుక్షణం నుంచి తెలంగాణా ఉద్యమం గురించి తెగ మాట్లాడేస్తున్నాడు పవన్. సాగదీసి…సాగదీసి భావోద్వేగాలు రెచ్చగొట్టారని, కొంతమంది ఆత్మహత్యలకు కూడా కారణమయ్యారని నిందిస్తున్నాడు. పవన్ మాటలు అక్షర సత్యం. కాకపోతే ఆ పాపంలో పవన్‌కి కూడా భాగముంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అంటూ రాజకీయ క్షేత్రంలోకి అడుగెట్టారు చిరు, పవన్‌లు. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తర్వాత స్థానం పవన్ కళ్యాణ్‌దే అన్న విషయం నిజం. 2009 తర్వాత…మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నుంచే తెలంగాణా ఉద్యమం ఉధృతమైంది. కాంగ్రెస్, టిడిపి, బిజెపిల రాజకీయ వాడకం కూడా అప్పుడే పతాకస్థాయికి చేరుకుంది. అప్పటికి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల ప్రజారాజ్యం పార్టీ యాక్టివ్గానే ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ ఏం చేసినట్టు? ఆ తర్వాత కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఇష్టం లేకపోయినంత మాత్రాన పూర్తిగా సైలెంట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడతానని 2009 ఎన్నికల ప్రచారంలో అందరు నాయకుల్లాగే పవన్ కూడా చెప్పాడుగా. ప్రజారాజ్యం పార్టీ లేకపోయినంత మాత్రాన పవన్ నాయకుడు కాకుండా పోతాడా? ప్రజలకు ఇచ్చిన మాటను మార్చిపోతాడా? మరి 2009లో రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ 2014 వరకూ ఏం చేసినట్టు? చిరంజీవితో సహా మిగతా నాయకులందరూ కూడా ఎన్ని ఇబ్బందులున్నా ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఏం మాట్లాడినా ఏదో ఒక ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలకు శతృవు అయ్యే సున్నిత పరిస్థితులు ఉన్నప్పటికీ….మరీ పవన్ ఇప్పుడు ఆశిస్తున్నంత హీరోయిజం చూపించకపోయినా ఎంతో కొంత ధైర్యం అయితే చేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? తెలంగాణా ఏర్పాటు పూర్తయ్యేవరకూ ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రాలేదు? ఎక్కడ దాక్కున్నాడు? తెలుగు ప్రజల మధ్య కొట్లాటలు జరిగే పరిస్థితుల నేపథ్యంలో …..తాను చాలా ధైర్యవంతుడిని, ప్రాణాలైనా ఇచ్చేస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రజల ముందుకు రాలేకపోయాడు? చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసిపోయినంత మాత్రాన పవన్ మౌనంగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? 2014లో అదే అన్నయ్య ఉన్న పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం చేసిన పవన్….అంతకుముందు వరకూ ఎందుకు ఆ పని చెయ్యలేదు. 2009-2014 వరకూ తెలుగు నాయకులందరూ చేసిన రాజకీయం గురించి నిజాయితీగా మాట్లాడుకుంటే….అందరికంటే పవన్ కళ్యాణే జీరోగా మిగులుతాడు. చాలా మంది చేత పొలిటికల్ కమెడియన్ అని కామెంట్స్ చేయించుకున్న చిరంజీవి కూడా ధైర్యంగానే ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు. ఒక్క పవన్ కళ్యాణే పూర్తిగా దాక్కున్నాడు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఆంధ్రులకు నాయకత్వం వహించమని తనను అడిగారని, కానీ తెలంగాణా ప్రజలకు వ్యతిరేకంగా నేను పనిచేయగలనా అని ఒక సమర్థింపు మాట కూడా చెప్తూ ఉంటాడు పవన్. అయ్యా పవన్‌జీ…..కాంగ్రెస్, టిడిపి, ప్రజారాజ్యం, వైకాపా, బిజెపి….పార్టీల నాయకులందరూ కూడా తెలంగాణా విషయంలో ఏం చేయాలో తెలియక తలలు బద్ధలు కొట్టుకుంది అందుకే స్వామీ. ఇరు ప్రాంతాల ప్రజలూ కూడా సంతోషంగా స్వీకరించే నిర్ణయం ఏదైనా ఉండి ఉంటే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నాయకులకు ఎందుకు పరీక్ష పెట్టి ఉండేది? మిగతా అందరూ నాయకులు కనీసం పరీక్షను ఫేస్ చేశారు. పవన్ అది కూడా చేయలేకపోయాడు.
ఇక 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల వర్షం గురించి కూడా పవన్ కళ్యాణ్ చాలానే మాట్లాడేస్తున్నాడు. మరి తనకు ఏ నాలెడ్జ్ ఉందని చెప్పి మోడీ, బాబు ఇచ్చిన హామీలన్నీ నెరవెరుస్తారని ఆరోజు ప్రజలకు హామీ ఇచ్చాడు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీలు అసాధ్యం అన్న విషయం ఆర్థిక, రాజకీయ ఓనమాలు తెలిసున్నవాళ్ళకు కూడా ఎన్నికలకు ముందే తెలుసు. పవన్‌కి తెలియదా? తెలియని విషయాల గురించి మేధావులతో కూర్చుని రోజుల తరబడి డిస్కస్ చేస్తున్నానని ఇప్పుడు చెప్తున్న పవన్…..రుణమాఫీలు సాధ్యమా? కాదా? అన్న విషయం గురించి 2014 ఎన్నికలకు ముందు ఎందుకు అధ్యయనం చేయలేదు. ఓటుకు నోటు కేసుతో సహా చాలా విషయాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు….ఆ విషయంపైన నాకు అవగాహన లేదని, అధ్యయనం చేయకుండా మాట్లాడలేనని చెప్తూ ఉంటాడు పవన్. మరి అంత జాగ్రత్తపరుడు అయిన పవన్.. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యమా? కాదా? అన్న విషయం గురించి ఎందుకు అధ్యయనం చేయలేదు. అలాగే 2014 ఎన్నికల సమయంలోనే బాబు, మోడీలను గెలిపించండి. ఒకవేళ వాళ్ళు కాని సరిగా పనిచేయకపోతే సినిమాలు మానేసి మరీ మీకోసం పోరాడతానన్నాడు పవన్. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని ఇప్పుడు పవనే చెప్తున్నాడు. మరి ఇంకా ఎందుకు వరుసగా సిినిమాలు చేసుకుంటూ ఖాళీ టైంని ప్రజల కోసం కేటాయిస్తున్నాడు. ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచాడని డైరెక్ట్‌గా చెప్పడానికి ధైర్యంలేని పవన్, తెలంగాణా ఉద్యమ సమయంలో ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడలేకపోయిన పవన్….ఇప్పుడు నీతులు చెప్తూ కాలం గడిపేస్తూ ఉన్నాడు. 2009 నుంచీ పవన్ కూడా అభిమాన బలం ఉన్న ఒక రాజకీయ నాయకుడేనని…..కానీ ప్రజల కోసం చేసింది మాత్రం ఏమీ లేదన్న విషయం తెలుగు ఓటర్లకు తెలియకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల్లో బాబు, మోడీలను గెలిపించమని చెప్పి తాను చేసిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 2009లో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రజలందరూ ఎదుర్కున్న ఒక సమస్య విషయంలో పవన్ చేసింది ఏమీ లేదు. 2014లో రీ ఎంట్రీ ఇచ్చాడు. బాబు, మోడీలను గెలిపించమని చెప్పాడు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంటే 2019 వరకూ మరోసారి సైలెంట్ అయిపోయేవాడే. 2014 నుంచి రెండేళ్ళ పాటు పవన్ చేసింది కూడా అదే. కానీ విమర్శలు మరీ ఎక్కువ స్థాయిలో రావడం, అభిమానుల్లో కూడా వ్యతిరేకత రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్షేత్రంలో అడుగెట్టాడు. ఇప్పుడిక 2019 వరకూ ఎలా టైం పాస్ రాజకీయాలు చేయాలా అని ఆలోచిస్తున్నాడు. మరి అంతటి సమర్థ(?) నాయకుడైన పవన్‌కి…..తాను చేసిన తప్పుల గురించి ప్రజలకు వివరణ ఇవ్వకుండా…….ఇతర నాయకులను ప్రశ్నించే అర్హత ఉందా?