కథ అంతా సేం టు సేం. ముగింపు కూడా అదే. బిహార్‌లో నితీష్ కుమార్‌తో ఆడిన పొలిటికల్ ఆటనే ఇప్పుడు తమిళనాడులో కూడా ఆడాడు మోడీ. ఎమ్మెల్యేల బలం లేకపోయినప్పటికీ ఎగిరెగిరి పడ్డ మాంజీలాగే, పన్నీరు సెల్వం కూడా చేశాడు. దాసాను దాసులను మాత్రమే ప్రోత్సహించే జయలిలత చేత ముఖ్యమంత్రి పదవికి నామినేట్ చేయబడ్డాడు అంటేనే పన్నీరు సెల్వం ఏ స్థాయి భక్తుడో చెప్పొచ్చు. అలాగే ఆయనకు ఉండే ధైర్య సాహసాలపైన కూడా ఓ అంచనాకు రావొచ్చు. బిహార్‌లో మాంజీ కూడా సేం టు సేం పన్నీరు సెల్వం లాంటివాడే. కానీ మోడీ సపోర్ట్ చూసుకుని రెచ్చిపోయాడు. మోడీ అండ్ కో కూడా మాంజీని ఓ స్థాయిలో రెచ్చగొట్టారు. కానీ మాంజీని అడ్డుపెట్టుకుని ఆడిన ఆటలో మోడీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నితీష్ కుమార్ హీరో అయ్యాడు. అన్నింటికీ మించి లాలూ ప్రసాద్ యాదవ్‌లాంటి ఒక పేరెన్నికగన్న అవినీతి నాయకుడి రాజకీయ జీవితానికి ప్రాణం పోశాడు మోడీ. అలాగే 2014 ఎన్నికల తర్వాత కూడా కామెడీ పొలిటీషియన్‌గానే మిగిలిపోయిన రాహుల్‌గాంధీకి కూడా ఓ చిన్న సైజు సక్సెస్‌ని ఇచ్చాడు. మోడీ అండ్ కో మాత్రం బొక్కా బోర్లా పడ్డారు. వాళ్ళను నమ్ముకుని మాంజీ రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది.
ఇప్పుడు తమిళనాడు కథ కూడా అలానే సాగుతోంది. జయలలిత ఉన్నంత కాలం అయితే ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రి పదవి అనుకుంటూ రాజకీయ జీవితాన్ని సాగించిన పన్నీరు సెల్వం కథ ఇంచుమించుగా ముగిసిపోయిందనే అనుకోవచ్చు. అన్నింటికీ మించి జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించే స్థాయి ఇప్పుడిక శశికళకు వచ్చేసినట్టే. కొన్ని గంటల్లో ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాల్సిన తన జీవితం ఇప్పుడు ఊచలు లెక్కపెట్టుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి రావడానికి కారణమైన పన్నీరుసెల్వాన్ని శశికళ వదిలిపెడుతుందా? తమిళ రాజకీయాల శైలిని, ప్రత్యర్థులను జయలలిత, శశికళలు హింసించిన చరిత్రను పరిశీలిస్తే మాత్రం పన్నీరు సెల్వానికి గడ్డుకాలం మొదలైనట్టే. తమిళనాడులో పార్టీని విస్తరించాలన్న ఆకాంక్షతో గొప్ప పొలిటికల్ థ్రిల్లర్ గేంని నడిపించిన మోడీ పార్టీని భవిష్యత్తులో తమిళ ఓటర్లు ఏ మేరకు స్వాగతిస్తారో చూడాలి. అలా కాకుండా తమిళనాడులో కూడా మోడీ నియంతృత్వం కంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే బాగున్నాయన్న ఫీలింగ్ వస్తే మాత్రం మోడీ రాజకీయ గేం తమిళనాట కూడా డిజాస్టర్‌గా మిగిలిపోతుంది. అవినీతిపరులను జైలుకు పంపిస్తే కచ్చితంగా ప్రజలు హర్షిస్తారు. కానీ రాజకీయ స్వార్థం కోసం, నియంతృత్వ ధోరణితో తమకు తోచినట్టుగా రాజకీయాలు చేస్తే సహించమని స్వాతంత్ర్యానంతర కాలం నుంచి భారతీయ ఓటర్లు చెప్తూనే ఉన్నారు. కానీ ఇందిరాగాంధీ నుంచి మోడీ వరకూ ఎవ్వరూ కూడా గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. భారతదేశం మొత్తం కూడా బిజెపి పార్టీనే ఉండాలి అనుకుంటే మోడీ అనుసరించాల్సిన మార్గం అయితే ఇది కాదేమో. ఆరెస్సెస్ మేధావులు ఆలోచించాలి. బీహార్ నాయకుడు మాంజీ, తమిళ పన్నీరు సెల్వంల అనుభవం తర్వాత బిజెపిని వేరే ఏ నాయకుడైనా నమ్ముతాడా? బిజెపి సపోర్ట్‌తో రాజకీయం చేయడానికి ముందుకు వస్తాడా?