లగడపాటి రాజగోపాల్… ఈయన పేరు వినగానే సమైక్యాంధ్ర ఉద్యమ రోజులు చాలామంది గుర్తుకొస్తాయి. రాష్ట్రం విడిపోయే రాజకీయ సన్యాసం అన్నారు. అన్నట్టుగా సన్యసించారు! అయితే, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆయన తన సన్యాసాన్ని ఉపసంహరించుకోబోతున్నారేమో అనిపిస్తోంది. అంటే.. లగడపాటి రిటర్న్స్ అన్నమాట! రాజకీయాల్లో ఆయన చేయించుకునే సర్వేలకు చాలా ప్రచారమే లభిస్తూ ఉంటుంది. లగడపాటి సర్వే ఏం చెప్పిందనే ఆసక్తి చాలామందిలో ఉంది. మరి, తన రాజకీయ భవిష్యత్తు గురించి సొంతంగా ఏదైనా సర్వే చేయించుకున్నారో ఏమో తెలీదుగానీ… పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమౌతున్నట్టుగా కనిపిస్తోంది!
లగడపాటి రీ ఎంట్రీ అనగానే… ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అమాంతంగా నెత్తినేసేసుకుని రాబోతున్నారా అని మాత్రం అనుకోవద్దు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు. కాబట్టి, ఆయన చూపు వైకాపావైపు ఉన్నట్టుగా కనిపిస్తోంది. కనిపించడమేంటీ… వైకాపాకు దగ్గరయ్యే ప్రయత్నంలోనే ఆయన ఉన్నట్టు సమాచారం. దీన్లో భాగంగానే ఆయన తాజాగా వైకాపా అధినేత జగన్తో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు ఇద్దరు నేతలూ మాట్లాడుకున్నారు. దీంతో లగడపాటి ఫ్యాన్ కిందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వచ్చి చేరకపోయినా, సమీప భవిష్యత్తులో జరిగేది అదే అనిపిస్తోంది.
ఇక, లగడపాటిని పార్టీలోకి ఆహ్వానించడం వైకాపాకి కూడా ప్లస్ అవుతుంది. ఎందుకంటే, ఆయన మంచి మాటకారి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక, వైకాపా నుంచి రోజా, చెవిరెడ్డి, అంబటి వంటివాళ్లు ఉన్నా, వాళ్ల మాటకారితనం జనాలకు బోరు కొట్టేస్తోందన్నది వాస్తవం! సామాజిక వర్గాల సమీకరణ దృష్ట్యా ఆలోచించినా లగడపాటి రాక ఖరారు అయితే వైకాపాకి అదీ ప్లస్ అవుతుంది. వైకాపా అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గం పార్టీ, కొంతమంది మైనారిటీలు, క్రిస్టియన్లకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందనే ఒక ఇమేజ్ ఉంది! ఈ ఇమేజ్ను రూపుమాపుకోవడం కోసం నయా నేతల చేరిక మంచిదౌతుంది. నిజానికి, విజయవాడ ప్రాంతంలో వైకాపాకి కరిజ్మా ఉన్న నేతల అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా లగడపాటి వంటి ప్రముఖ నేతల్ని ఎట్రాక్ట్ చేయడం అవసరమే అనిపిస్తోంది..!