ఎద్దు ఎగరకముందే దాని మెడలోని గంట ఎగిరిందనీ.. వెనకటికో సామెత! తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూస్తుంటే అచ్చం ఇలానే ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమే అయినా.. ఆ మేర ప్రభావం చూపడంలో అట్టర్ ఫ్లాప్ షో చేస్తోంది! ఎన్నోయేళ్ల చరిత్ర ఉన్న పార్టీగా రాష్ట్రంలో బలమైన మూలాలు ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కప్పల తక్కెడ మేళంగా మారుతోందన్న విమర్శ ఎప్పట్నుంచో ఉంది. టి. కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలన్నఉద్దేశం హైకమాండ్‌కు కూడా ఉంది! వాస్తవ పరిస్థితి వేరేలా ఉంటే… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ పార్టీ వర్గాల్లో ఇప్పుడు జోరుగా సాగుతుండటం విడ్డూరం!
ఈ బెర్త్ కోసం ఇప్పటికే చాలామంది సీనియర్లు, చాలాకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నారు. తెరాస నుంచి ఆహ్వానాలు అందుతున్నా, ఆ సీటు మీద ఆశతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఎవరికి ఆశలు వారికి ఉన్నాయి! అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఈ విషయమై మరోసారి ఓపెన్ అయిపోయారు! తాను సీఎం కావడం పక్కా.. అని ప్రకటించుకున్నారు. అయితే, ఆయన సీఎం కాబోయేది 2019లో అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని బల్లగుద్దినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో 90 స్థానాల్లో గెలుస్తామనీ, అధినేత్రి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని కోమటిరెడ్డి అంటున్నారు. కేసీఆర్ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.
చిత్రం ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 70 సీట్లు గ్యారంటీ అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్యనే ఓ సర్వే బయటపెట్టారు! అది ఆయన సొంతంగా చేయించుకున్నరట..! దానిపై కోమటిరెడ్డి విమర్శలు చేశారు. ఉత్తమ్ సర్వేను విమర్శించిన ఈయనే ఇప్పుడేమో పార్టీకి 90 గెలుస్తుందని ఏ లెక్కప్రకారం చెబుతున్నారో అనేది ఆయనకే తెలియాలి! ఈ లెక్కలూ ఊహలూ బాగానే ఉన్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో జరగాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. వాటిపై దృష్టి పెడితే పార్టీకి మంచి రోజులు వస్తాయి. అంతేగానీ, ఇప్పట్నుంచే ‘నేను కాబోయే ముఖ్యమంత్రి’ అని ప్రకటించుకోవడం ద్వారా పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు…? క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఏ తరహా ఉత్సాహాన్ని పెంచుతున్నట్టు..?