ఏపీ మంత్రి వర్గ విస్తరణ… ఇదో చిదంబర రహస్యంగా మారింది! గత ఏడాది కాలం నుంచీ అదిగో ఇదిగో అంటున్నారు. ఇప్పుడు కూడా ఉగాది అంటూ కొత్త ముహూర్తం చెబుతున్నారు. ఈ ఉగాదికి విస్తరణ పక్కాగా ఉంటుందని ఆశావహులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన జంప్జిలానీల ఆశలన్నీ పదవులపైనే ఉన్నాయి కదా! అయితే, విస్తరణంటూ జరిగితే ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటా అనే ప్రశ్న తెలుగుదేశం వర్గాలనూ తొలిచేస్తోందట! ఫిరాయింపుదారులకు పదవులు ఇస్తే ప్రతిపక్షాలకు ఒక బలమైన విమర్శనాస్త్రం అందించినట్టే అవుతుంది. ఎందుకంటే, తెలంగాణలో ఫిరాయింపుదారులకు కేసీఆర్ మంత్రి పదవులు ఇస్తే… అది రాజ్యాంగ విరుద్ధమనీ, దుష్ట రాజకీయ సంస్కృతి అంటూ రకరకాల విశేషణాలతో విమర్శలు చేశారు. మరి, అదే పని ఆంధ్రాలో చేస్తే కరెక్ట్ అవుతుందా..? సరే… రెండు నాల్కల ధోరణి మొదట్నుంచీ వారికి అలవాటైన పనికాబట్టి ఏదో ఒక వాదన వినిపించెయ్యొచ్చు.
కానీ, ఫిరాయింపుదారులకు పదవులు ఇస్తే సొంత పార్టీ నేతల నుంచీ తలనొప్పులు ఖాయం అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి విషయంలో ఇదే జరిగేట్టు కనిపిస్తోంది. ఆయనకు పదవి ఇస్తే ఒక తలనొప్పి, ఇవ్వకుంటే ఇంకో సమస్య అన్నట్టుగా పరిస్థితి ముడిపడిపోయింది! భూమాకి పదవి ఇస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని శిల్పా వర్గం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది! భూమా మంత్రి కాగానే పరిస్థితులు ఎలా మారుతాయో టీడీపీ ఊహకే అందటం లేదని చెప్పుకుంటున్నారు.
పోనీ… శిల్పా వర్గాన్ని బుజ్జగిస్తూ, భూమాని కాదని వేరే వారికి పదవి ఇస్తే అది ఇంకో సమస్య అవుతుంది! పదవుల ఆశతో వచ్చిన ఫిరాయింపుదారులు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే, చంద్రబాబు తీరుతో ఫిరాయింపు వైకాపా నేతలు చాలా అసంతృప్తిగా ఉంటున్నారు అనే కథనాలు వినిపిస్తున్నాయి. పార్టీలో సరైన గుర్తింపు ఉండటం లేదనీ, ఆశించిన తాయిలాలు అందడం లేదన్న అసంతృప్తితో రగులుతున్నవారు ఉన్నారు.
సో… ఫిరాయింపుదారుల్లో అందరికీ మంత్రి పదవులు దక్కకపోయినా, భూమా లాంటి వారికి ఇవ్వకపోతే వారందరి మోరల్ దెబ్బతినే అవకాశమైతే ఉందనే చెప్పాలి. మరి, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఉగాది గండం ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి. అలాగని, మంత్రి వర్గ విస్తరణను మరోసారి వాయిదా వేసుకునే పరిస్థితి ఇప్పుడైతేనే లేదు! ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఏపీ మంత్రివర్గ విస్తరణ పర్వం మారబోతుందని చెప్పుకోవచ్చు!