ఈమధ్య వాయిస్ ఓవర్ల ట్రెండ్ మరింత ఊపందుకొంది. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ స్టార్ గొంతు వినిపిస్తూనే ఉంది. గుంటూరోడు మంచు మనోజ్ కూడా ఈ ట్రెండ్‌ని కొనసాగిస్తున్నాడు. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించాడు. ఈ విషయాన్ని చిత్రబృందం ధృవీకరించింది కూడా. ఇటీవలే ఘాజీ చిత్రంలోనూ తన గొంతు వినిపించాడు చిరు. ఘాజీ.. చిరు మాటలతోనే ప్రారంభం అయ్యింది. ఇప్పుడూ అంతే. గుంటూరోడు సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ని చిరు గొంతు ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తారు.
మనోజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. సత్య దర్శకుడు. సినిమా ఎప్పుడో పూర్తయినా, మంచి రిలీజ్ డేట్ కోసం చిత్రబృందం ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 17న ఘాజీతో పాటు గుంటూరోడూ రావాల్సిందే. అనివార్య కారణాల వల్ల, ఈ సినిమా వాయిదా పడింది. రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా కన్ఫామ్ చేయలేదు. ఇప్పటి వరకూ గుంటూరోడు పబ్లిసిటీ చాలా వీక్‌గా సాగుతోంది.అసలు ఈ సినిమాకి క్రేజే లేకుండా పోయింది. చిరు వాయిస్ ఓవర్‌తో గుంటూరోడుకి కాస్త ఊపొచ్చినట్టైంది. మెగా ఫ్యామిలీకీ మోహన్ బాబు కుటుంబానికీ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తూనే ఉంటుందని మీడియాలో వార్తలు ఎప్పటికప్పుడు గుప్పుమంటూనే ఉంటాయి. అయితే చిరు, మోహన్ బాబు మాత్రం వీలైనప్పుడల్లా తమ అనుబంధాన్ని చూపిస్తూనే ఉంటారు. అందుకు గుంటూరోడు కి చిరు వాయిస్ అందించడం తాజా నిదర్శనం. ఇప్పుడైనా చిరు – మోహన్ బాబు మధ్య గాసిప్పులకు అడ్డుగోడ పడుతుందేమో చూడాలి.