స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రపంచానికి తెలియని నిజాలు చాలా ఉన్నాయంటూ ఆ మధ్య వార్తల్లోకి వచ్చారు మాజీ మంత్రి నాదెండ్ల భాస్కరరావు. ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నా అని బాలకృష్ణ ప్రకటించగానే ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆ చిత్రంలో తనని విలన్‌గా చూపిస్తే ఊరుకునేది లేదనీ, కోర్టుకు వెళతానంటూ హెచ్చరించారు. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి ప్రస్థావించారు. ఎన్టీఆర్‌తోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గురించి కూడా మాట్లాడారు. ఒక టీవీ ఛానెల్‌కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు నాదెండ్ల.
తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్టీఆర్ భయపడ్డారనీ, ఓడిపోతానని టెన్షన్ పడ్డారనీ అన్నారు. ఎన్టీఆర్ గురించి వాస్తవాలు తెలిస్తే ముఖాన ఉమ్మేస్తారు ప్రజలు అన్నారు. తనని కావాలనే వెన్నుపోటుదారుడిగా నాటి మీడియా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. తనని కావాలని ఒక విలన్‌గా చిత్రించి, ఎన్టీఆర్‌ను హీరోగా చూపించారని చెప్పారు. అప్పట్లో తన గోడును వినిపించుకునే నాథుడే కరువయ్యాడు అన్నారు. ఎన్టీఆర్‌కి లేనిపోని సలహాలు ఇచ్చి, ఆయన్ని పక్కతోవ పట్టించేలా చేసింది సొంత అల్లుడు చంద్రబాబు నాయుడే అని చెప్పారు. ఎన్టీఆర్ పేరును దెబ్బ తీసే విధంగా తాను ఏనాడూ ఎలాంటి సలహాలు ఇవ్వలేదని నాదెండ్ల చెప్పారు.
రోజూ తెల్లారగానే ఎన్టీఆర్‌ను చంద్రబాబు కలిసేవారనీ, ఏవో సలహాలు ఇచ్చి బాగా రెచ్చగొట్టేవారనీ, ఆ పూనకంతో ఎన్టీఆర్ నిర్ణయాలు తీసుకునే వారని నాదెండ్ల చెప్పారు. చంద్రబాబు ఇచ్చినవన్నీ తప్పుడు సలహాలే అన్నారు. బాలయ్య తీయబోతున్న చిత్రంలో ఒకవేళ తనని విలన్‌గా చిత్రించే ప్రయత్నం చేస్తే… కోర్టుకు వెళ్తానని చెబుతూనే, చంద్రబాబు అసలైన విలన్ అనీ, ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్నారో ప్రజలందరికీ తెలుసు అని నాదెండ్ల చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యే కాని నారా లోకేష్‌ను మంత్రిని చేయాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తన రాజకీయ చతురతకు ఎన్టీఆర్ సినీ గ్లామర్ తోడు కావడం వల్లనే తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయి దక్కిందని నాదెండ్ల చెప్పారు.
ఎన్టీఆర్ గురించి బయటకి రావాల్సిన వాస్తవాలు ఇంకా చాలా ఉన్నాయన్న ఉత్సుకతను క్రియేట్ చేశారు నాదెండ్ల. అయితే, ఆ విషయాలేవో తాను బయటపెట్టే వరకూ నిద్రపోయేది లేదన్నట్టుగా ఉన్నారు! బాలయ్య సినిమా ప్రకటించిన నేపథ్యంలో మొదలైన ఈ చర్చ, అక్కడితో ఆగిపోయిందని అనుకున్నాం. ఎందుకంటే, ఆ సినిమా విషయమై బాలయ్యకు చంద్రబాబు సూచనలూ సలహాలూ కూడా అందాయని ప్రచారం సాగింది. ఎలాగైతేనేం, ఆ టాపిక్ ఈజ్ ఓవర్ అనుకుంటే… నాదెండ్ల మళ్లీ తెరమీదికి తెస్తున్నారు.