ఏపీ మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఉంటుందని ఈ మధ్య మళ్లీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికంటే ముందుగా జరగాల్సిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు! అదేంటంటే… పార్టీకి రిపేర్లు! తెలుగుదేశం పార్టీ అద్భుతాలు సాధించేస్తోందని చంద్రబాబు చెప్పుకుంటున్నా… పార్టీ నేతలు ఏమేం సాధిస్తున్నారో, తెర వెనక ఏమేం సాగిస్తున్నారో ఆయనకి తెలియంది కాదు. నాయకుల తీరు మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవడం అలవాటే. అయితే, తాజాగా లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేలో వాస్తవాలు వేరేలా ఉండటంతో చంద్రబాబుకు కదలిక వచ్చిందని చెప్పుకుంటున్నారు.
దీంతో జిల్లాల వారీగా పార్టీకి జరిగిన, జరుగుతున్న డామేజ్ గురించి వాస్తవ నివేదికలు తెప్పించుకున్నారట! ఇకపై జిల్లాల వారీగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీన్లో భాగంగానే ముందుగా అనంతపురం జిల్లాతో మొదలుపెట్టారు! ఆ జిల్లా నేతలకు పెద్ద క్లాస్ తీసుకున్నారు. పార్టీకి కంచుకోటగా ఉంటున్న జిల్లాలో ఈ మధ్య చాలా డామేజ్ జరిగిందనీ, 90 శాతం పైగా పార్టీకి నష్టం వాటిల్లిందని, అన్ని వివరాలతో నాయకుల్ని నిలదీశారు. పార్టీ వల్ల నాయకులు బాగుపడుతున్నారు తప్ప, పార్టీకి మీ వల్ల కగిలే ప్రయోజనం ఏమీ లేదని నిష్కర్షగా అనేశారట. పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతలకు భారీ క్లాస్ పడిందని సమాచారం! ఇదే వైఖరి కొనసాగిస్తే మంత్రి పదవుల నుంచి తప్పించాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు సమాచారం.
ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఇదే తరహాలో క్లాసులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు… ఇలా ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అనేది సమగ్ర నివేదికలు చంద్రబాబు దగ్గర ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ జరిగేలోపు ఈ క్లాస్ పీకుడు కార్యక్రమం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇలా అందరికీ క్లాసులు పీకేసి.. ఆ తరువాత, మంత్రి పదవుల నుంచి తప్పించినా కూడా పెద్దగా అసంతృప్తులు ఉండవు! ఎందుకంటే, ఎవరి స్వయంకృతాపరాధం వారికి తెలుస్తుంది కదా.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టు సడలుతోందన్న ఆందోళన చంద్రబాబులో పెరుగుతోందన్నది సుస్పష్టం. విచిత్రం ఏంటంటే.. లగడపాటి సర్వే బయటకి వస్తే తప్ప, వాస్తవ పరిస్థితులు చంద్రబాబుకు అర్థం కాలేదా..? ఇన్నాళ్లూ చంద్రబాబు తెప్పించుకుంటున్న రిపోర్టుల్లో వాస్తవాలు ఆయన వరకూ రాకుండా ఆపిందెవరు..? ముఖ్యమంత్రి ముఖస్తుతి కోసమే నివేదికలు రూపొందుతూ వచ్చాయా..? పార్టీ నాయకులూ వారి బంధుగణాలు ఏం చేస్తున్నారో అనేది చంద్రబాబుకు ఇన్నాళ్లూ తెలీదా..? పార్టీకి నష్టం చేకూర్చే స్థాయిలో నాయకులు ప్రవర్తించేంత స్వేచ్ఛ ఇచ్చిందెవరు..? ఏమో మరి, ఈ క్లాసుల్ని నాయకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.