తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరిపోతున్నాయి. ఆలూ లేదూ చూలూ లేదూ అన్నట్టుగా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఎలాగో ఆలోచించడం మానేసి, వచ్చే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి నేనంటే నేనే అంటూ నేతలు ప్రకటించేసుకుంటున్నారు..! ఎప్పటికైనా కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయ్యేది నేనే అంటూ ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించుకున్నారు. అయితే, ఇదే తరుణంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఓ సర్వే చేయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు మొదలయ్యాయి అంటూ ఆశలు రేకెత్తించారు. అయితే, ఈ సర్వే ద్వారా తన అవకాశాలను దెబ్బతిసేందుకు ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారంటూ కోమటిరెడ్డి ఫీలైపోతున్నారు!
నల్గొండ జిల్లాలోని భువనగిరి, నక్రీకల్ లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఉత్తమ్ సర్వే రిపోర్ట్. ఇది తన ప్రాంతం కాబట్టి, ఉద్దేశపూర్వకంగానే అలాంటి నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చారన్నది కోమటిరెడ్డి వర్గం ఆవేదన! ఈ పంచాయితీ నేరుగా పార్టీ పెద్దల దగ్గరకే వెళ్లింది. దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకున్న కోమటిరెడ్డి ఈ విషయాలను వివరించారట! ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ ఓటమి పాలౌతూ వస్తోందనీ, పరిస్థితి ఇప్పటికీ మారేలా లేదని అన్నారు. ఉత్తమ్‌ను పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తొలగిస్తే తప్ప, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కష్టమని తన మనసులో మాటను చెప్పేశారు!
పీసీసీ పీఠాన్ని తనకు ఇవ్వాలంటూ గతంలో ఓపెన్ గానే కోమటిరెడ్డి అడిగిన సందర్భమూ ఉంది. తనకు పీసీసీ ఇస్తే… రాష్ట్రమంతా పర్యటించి పార్టీ అధికారంలోకి తెచ్చి, సోనియా రుణం తీర్చుకుంటామని గతంలో ఆయన అన్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి పీఠంతోపాటు పీసీసీ కుర్చీ కూడా తనకే కావాలన్నట్టుగా కోమటిరెడ్డి వైఖరికి ఉంది. మరి, హైకమాండ్ ఈ వ్యవహారాన్ని ఎలా సరిదిద్దుతుందో చూడాలి.
ఒక విషయమైతే స్పష్టంగా అర్థమౌతోంది.. పార్టీలో తమ స్థానం ఏంటో తెలిస్తే తప్ప, పార్టీ గురించి పనిచేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేరన్నట్టు చెప్పుకోవాలి! లేదంటే… కుదేలైన పార్టీకి జవసత్వాలు ఇచ్చే ఆలోచనలు చేయాల్సిన ఈ తరుణంలో, నాయకత్వ మార్పు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం… ఇలాంటి ప్రస్థావనలు ఎందుకండీ..? వస్తాయో రావో తెలియని పదవుల గురించి ఇప్పట్నుంచీ ఈ పాకులాట ఏంటండీ..?