కలిసున్నంత కాలం ఎవరైనా బాగానే ఉంటారు. కానీ ఒకసారి విడిపోయే పరిస్థితులు వస్తే మాత్రం తిట్లు, శాపనార్థాలతో అవతలివాళ్ళను మానసికంగా చంపేస్తారు. విడిపోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత లవర్స్ అయినా, భార్యాభర్తలయినా, అన్నాదమ్ములయినా, ఇరుగు పొరుగు వారయినా ఎక్కువమంది ఇలానే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉంటారు. వ్యక్తుల వరకూ అయితే పర్సనల్ విషయాలుగా పరిగణించొచ్చు. కానీ ఒక ప్రాంతంలో ఉన్న కోట్లాది మంది ప్రజలను అవమానిస్తే, అవహేళన చేస్తే, వాళ్ళ ఆత్మాభిమానంపైన దెబ్బకొడితే….తెలంగాణా ఉద్యమ సమయంలో జరిగింది అదే. సీమాంధ్ర నుంచి వచ్చిన బడా బడా వ్యాపారస్తులు, పొలిటీషియన్స్‌ని పక్కనపెడితే మన రాష్ట్రం, మన రాజధాని అనే అభిమానంతో, వాళ్ళకు ఉన్న హక్కుతో హైదరాబాద్‌కి వచ్చిన వాళ్ళతో పాటు, సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అవమానించారు. కోట్లాదిమంది ప్రజలను దొంగలను చేశారు. దారుణమైన మాటలతో వాళ్ళను మానసికంగా హింసించారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చేసింది.
సీమాంధ్ర నుంచి వచ్చిన ఒక్క వ్యాపారస్తుడిని కూడా తెలంగాణా ప్రభుత్వం వెనక్కి పంపించలేదు. పైగా తెలంగాణా ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళ సమర్థత గురించి వేనోళ్ళ పొగుడుతున్నారు. అలాగే సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకులతో తెలంగాణా నాయకుల స్నేహ సంబంధాలు అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా బలపడ్డాయి. సీమాంధ్ర ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పి సినిమావాళ్ళందరినీ కెసీఆర్, కెటీఆర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ఇక్కడే ఉండండి అని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు. ఉద్యమ సమయంలో దోపిడీదారులు అని ముద్రవేసిన వాళ్ళను తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సర్వాధికారాలను అనుభవిస్తున్న కెసీఆర్ ఎందుకు వెళ్ళగొట్టడం లేదు? నిజంగా దోచుకుతినేవాళ్ళే అయితే సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళను తెలంగాణా రాష్ట్రంలో ఉండనిచ్చేవాళ్ళా? రామోజీఫిల్మ్ సిటీతో సహా సీమాంధ్రుల వ్యాపారాలన్నీ అమరావతికి వెళ్ళిపోతే తెలంగాణా రాష్ట్రం ఏ స్థాయిలో నష్టపోతుందో కెసీఆర్ ప్రభుత్వానికి తెలియదా? సీమాంధ్రులు వెళ్ళిపోతే నష్టపోతాం అని అనుకుంటున్నారంటే వాళ్ళ వళ్ళ లాభం ఉందని ఒప్పుకుంటున్నట్టేగా?
తెలంగాణా ఉద్యమ సమయంలో ర్యాలీలు, ధర్నాలు ఇష్టారీతిన చేశారు. ట్యాంక్ బండ్ పైన అయితే విధ్వంసాన్నే సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినవాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకున్నా, అరెస్టులు చేసినా ఉద్యమకారులందరూ రెచ్చిపోయేవాళ్ళు. ఆంధ్ర ప్రభుత్వం అని చెప్పి చిత్తం వచ్చినట్టుగా విమర్శలు చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వంపైన కూడా అవే విమర్శలు చేయగలరా? తెలంగాణా ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసిన తెలంగాణా జెఎసిలో ‘అరాచక, అసాంఘీక శక్తులు’ అని చెప్పి తెలంగాణా ప్రభుత్వ పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇలాంటి కారణాలే ఏవో చెప్పి ఉద్యమకారులను అడ్డుకున్నారు. అప్పుడు సీమాంధ్ర ప్రభుత్వం, సీమాంధ్ర పోలీసులు అంటూ విరుచుకుపడిపోయారు ఉద్యమ నాయకులు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడతారు? తెలంగాణా దోపిడీదారుల ప్రభుత్వం, తెలంగాణా పోలీసులు అంటూ విమర్శలు చేయగలరా?
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేయడం తప్పు కాదు. కానీ ఫలితంతో పాటు మార్గం కూడా చాలా ముఖ్యం. రాజకీయ నాయకులను పక్కన పెడితే తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, మేథావులు కూడా సీమాంధ్రులను దారుణమైన మాటలతో అవమానించారు. తెలంగాణా మేధావులకు, రాజకీయ నాయకులందరికీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న అసలు విషయం ఏంటంటే……….భారతదేశ ప్రభుత్వంతో పాటు, భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇలానే వ్యవహరిస్తున్నాయి. ప్రశ్నించేవాడిని భయపెట్టేలా వ్యవహరిస్తున్నాయి. దేశంలోనే అత్యంత ధనవంతులైన వ్యాపారస్తుల నుంచి బడా బడా వ్యాపారస్తుల వరకూ అందరికీ రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. వాళ్ళకు అన్ని సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఇండియాలో వ్యాపారం చేయడానికి వచ్చేలా చేయడం కోసం కార్మిక హక్కులకు సంబంధించిన చట్టాలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. ప్రభుత్వాలే భూములను లాక్కుంటున్నాయి. రైతులకు ప్రశ్నించే అవకాశం లేకుండా చట్టాలు చేస్తున్నాయి. ధర్నాలు, ఆందోళనలు చేస్తామంటే పోలీసు చర్యలకు దిగుతున్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిందీ అదే. ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే. ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనలు అస్సలు ఉండకూడదు, ప్రశ్నించేవాళ్ళందరి నోళ్ళూ మూసెయ్యాలి అని ఆలోచించే విషయంలో చంద్రబాబుకి, కెసీఆర్‌కి, వైఎస్‌కి, కిరణ్ కుమార్ రెడ్డికీ ఏమైనా తేడాలున్నాయా? ఈ ముఖ్యమంత్రుల ప్రాంతాలు ఏవైనా ఆలోచనలన్నీ ఒక్కటేగా? కనీసం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల వరకూ మాత్రమే విమర్శలను పరిమితం చేసి ఉంటే తెలంగాణా ఉద్యమకారులను తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో కానీ సీమాంధ్ర ప్రజలందరినీ ఒకేగాటన కట్టేసి కోట్లాది మంది సాటి తెలుగు ప్రజలపైన దొంగలు అన్న ముద్ర వేయడం మాత్రం ఎప్పటికీ మాయని మచ్చే.