పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ అత్తారింటికి దారేది. ఆ సినిమాను చూసిన వాళ్ళలో ఎక్కువ మందికి ఇండస్ట్రీ హిట్‌గా నిలబడేంత సీన్ ఆ సినిమాకు ఉందా అన్న అనుమానం వస్తుంది. ఆన్ స్క్రీన్‌లో ఉన్న కంటెంట్ కంటే కూడా ఆఫ్ ది స్క్రీన్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే కలెక్షన్స్ సునామీకి చాలా వరకూ కారణమయ్యాయని ట్రేడ్ పండిట్స్ చెప్తూ ఉంటారు. అత్తారింటికి దారేది సినిమా లీకేజీ వ్యవహారాన్ని చాలా పెద్ద కుట్రగా అభివర్ణించేశారు పవన్. చాలా చాలా పెద్ద తలకాయలే ఆ కుట్ర వెనకాల ఉన్నాయని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ తన స్టైల్లో చెప్పారు. ‘ఎవరో చెప్పన్నా…వాళ్ళ అంతు తేలుస్తాం…..’ అని స్టేజ్ ముందు ఉన్న అభిమానులందరూ ఆవేశపడిపోయేలా పవన్ మాటలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు అయితే పవన్ కళ్యాణ్ చెప్పలేదు కానీ ఆ రివేంజ్ నేనే తీర్చుకుంటానని మాత్రం చెప్పాడు. ఆ రోజు అంత ఆవేశంగా మాట్లాడిన పవన్….ఆ తర్వాత మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయినట్టే ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు ఆ కుట్ర గురించి మాట్లాడలేదు. పోలీసు కేసుల గురించి ఆలోచించింది కూడా లేదు. ఆ కుట్రదారులపైన పవన్ ప్రతీకారం తీర్చుకున్నది కూడా లేదు. ‘కాన్స్పిరసీ’ అంటూ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్….అభిమానుల మనసుల్లో మాత్రం బోలెడంత సెంటిమెంట్‌ని పండించుకున్నాడు. తనపైన వాళ్ళకు ఉన్న అభిమానాన్ని ఎన్నో రెట్లు పెంచేసుకున్నాడు. సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా ఆ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించింది.
ఇప్పుడు పొలిటికల్ లైఫ్‌లో కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు పవన్. మొన్నటికి మొన్న తనను చంపేస్తారని ఎవరో చెప్పినట్టుగా డ్రమెటిక్‌గా మాట్లాడాడు. అది కూడా జనసేన పార్టీని స్థాపించినందుకో, రాజకీయల్లోకి వచ్చిన సందర్భంలోనో కాదు. కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంధ సంస్థను స్థాపించినందుకు అట. అసలు ఆ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థను స్థాపిస్తున్నట్టుగా పవన్ పెట్టిన ప్రెస్ మీట్‌ని పక్కనపెడితే…..ఆ తర్వాత మళ్ళీ ఏ ఒక్క యాక్టివిటీ కూడా ఆ సంస్థ తరపున జరిగినట్టుగా ఎక్కడా కనిపించదు. మరి కామన్ మేన్‌కి ఏ సహాయం చేయకముందే…..కామన్ మేన్‌కి హెల్ప్ చేస్తా అని ఒక ప్రెస్ మీట్ పెట్టినందుకు చంపేస్తారు అనే రేంజ్లో పవన్‌ని బెదిరించిన మహానుభావులు ఎవరో పవనే చెప్పాలి. కానీ అలా పేర్లు చెప్పడం, విషయం మొత్తం చెప్పడం పవన్ అత్తారింటికి దారేది లీకేజీ వ్యవహారం పబ్లిసిటీ ఫార్ములా కాదు కాబట్టి వాళ్ళ పేర్లను మాత్రం పవన్ చెప్పడు. అలాగే నిన్న చేనేత సభకు వెళ్ళినప్పుడు కూడా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా అన్నందుకు పవన్‌ని ఎవరో హేళన చేశారట. చేనేతకు సమంతా కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అందులో తప్పు కూడా ఏమీ లేదు. తెలుగు ప్రజలందరికీ కూడా చేనేతను నమ్ముకున్నవాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసు కాబట్టి ఎవ్వరైనా కూడా పవన్‌ని అభినందిస్తారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు పవన్, సమంతాలను అభినందిస్తున్నవాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. మరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు పవన్‌ని హేళన చేశాడంటే వాడసలు మనిషేనా? అలాంటి మనుషులు పవన్‌ని ఎప్పుడు కలిశారు? వాళ్ళు ఎవరో పవన్ చెప్పగలడా?
అత్తారింటికి దారేది సినిమా లీకేజీ వ్యవహారం కుట్రే అయితే ఆ కుట్రదారులు ఎవరు? కామన్ మేన్‌కి హెల్ప్ చేస్తే చంపేస్తారు అని పవన్ హెచ్చరించింది ఎవరు? చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానంటే పవన్‌ని అవహేళన చేసినవాళ్ళు ఎవరు? వీళ్ళలో ఏ ఒక్కరికి సంబంధించిన వివరాలు అయినా పవన్ చెప్పగలడా? నిజంగా ధైర్యం ఉంటే పేర్లు చెప్పే విమర్శలు చెయ్యొచ్చు కదా? అలా పేర్లు చెప్పకుండా మాట్లాడేస్తూ ఉంటే…. తనను తాను ధైర్యవంతుడిగా, సూపర్ హీరోగా ప్రమోట్ చేసుకోవడం కోసం, అభిమానుల్లో ఆరాధనాభావాన్ని పెంపొందించుకోవడం కోసం పవన్ రాసుకుంటున్న, మాట్లాడుతున్న సొంత స్క్రిప్ట్‌లు అన్న అనుమానాలు రావా? ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావా? ప్రశ్నిస్తా…ప్రశ్నిస్తా అంటూ కేవలం ప్రశ్నలు మాత్రమే అడుగుతూ వెళితే ఎలా పవన్? సమాధానాలు కూడా చెప్పాలి కదా?