ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది… కోదండరామ్ చేపట్టిన నిరుద్యోగ నిరసన కార్యక్రమం! తెలంగాణ ఏర్పడితే యువతకి ఉద్యోగాలొస్తాయని కేసీఆర్ సర్కారు మాటిచ్చినా, ఆ మాట నిలబెట్టుకోవడంలో సర్కారు వైఫల్యం కావడంతో నిలదీసేందుకు కోదండరామ్ ఉద్యమించారు. అయితే, అనూహ్యంగా ఆయన్ని అరెస్ట్ చేయడంతో… నిరుద్యోగుల స్వరం ఎంత తీవ్రంగా ఉందో అర్థమౌతోంది. ఈ సమస్య తెలంగాణలో మాత్రమే కాదు… ఆంధ్రాలో కూడా ఇదే స్థాయిలో ఉంది. ఈ తీవ్రతను వైకాపా అధినేత జగన్ గుర్తించినట్టున్నారు. అందుకే, తన తదుపరి పోరాటాస్త్రంగా నిరుద్యోగ సమస్యల్ని ఎంచుకున్నారు.
నిజానికి, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు యువతకు చాలా హామీలు ఇచ్చారు. బాబు వస్తేనే జాబు వస్తుందని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 2 వేల చొప్పున భృతి ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. ఓరకంగా ఆ నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీకి యువత ఓటేశారని చెప్పాలి. కానీ, ముఖ్యమంత్రి అయ్యాక ఆ హామీల విషయంలో ఎప్పటికప్పుడు మీన మేషాలు లెక్కించడమే తప్ప… వాటి అమలు దిశగా ఒక్కటంటే ఒక్క అడుగూ ముందుకు పడింది లేదు. సరిగ్గా ఇదే అంశమై ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారు ప్రతిపక్ష నేత జగన్. గడచిన 33 నెలల్లో ఏ ఒక్క కుటుంబానికీ నిరుద్యోగ భృతి అందలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లెక్కన ప్రతీ నిరుద్యోగ కుటుంబానికీ చంద్రబాబు సర్కారు రూ. 66 వేలు చొప్పున బాకీ పడిందన్నారు. ఈ బకాయిలు తీర్చేందుకు వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.
అయితే, ఈ బహిరంగ లేఖకి మాత్రమే పరిమితం కాకుండా.. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హమీలపై పోరాటం సాగించేందుకు జగన్ సంసిద్ధమౌతున్నట్టు సమాచారం. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి, యువతలో కూడా ఈ అంశమై అసంతృప్తి ఉంది. దీంతో జగన్ ఈ దిశగా చేపట్టబోయే కార్యక్రమానికి మంచి మద్దతు లభించే అవకాశం కచ్చితంగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా వైకాపా ఇంతవరకూ చేపట్టిన… లేదా, చేపడుతున్న ఉద్యమాల కంటే ఈ ఇష్యూకి అధిక ప్రాధ్యాతన దక్కే ఛాన్స్ ఉంది. మరి, తెలంగాణలో కోదండరామ్ చేపట్టినట్టే… ఆయన స్ఫూర్తితోనే భారీ ఎత్తున చలో అమరావతి లాంటి కార్యక్రమాలు చేపడతారో… కొన్ని బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ హామీలపై పోరాటం చేస్తారో వేచి చూడాలి.