బి.గోపాల్ దర్శకత్వంలో, గోపీచంద్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల నుంచీ ఈ ప్రాజెక్టు సెట్స్‌పైనే ఉంది. అనేక సమస్యలతో.. ఓ అడుగు ముందుకీ, నాలుగు అడుగులు వెనక్కీ వేస్తూ షూటింగ్ పూర్తి చేసుకొంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం.. ఈ వేసవిలో విడుదల కావడానికి సమాయాత్తం అవుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అదే.. ‘ఆరడుగుల బుల్లెట్’. అత్తారింటికి దారేదిలో పవన్‌ని వర్ణిస్తూ సాగిన పాట.. ‘వీడు ఆరడుగుల బుల్లెట్టూ…’. దాన్నే ఇప్పుడు టైటిల్ గా మార్చుకొన్నాడన్నమాట.
ఓ పాట పూర్తయితే.. సినిమా పూర్తయినట్టే. కానీ ఆ పాట పూర్తయ్యేది ఎప్పుడా అంటూ చిత్రబృందం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. దానికి గల కారణం.. నయనతార. ఈ పాట కోసం నయన కాల్షీట్లు ఇవ్వకుండా సతాయిస్తూ వస్తోంది. నయన డేట్లు ఇస్తే తప్ప ఈ పాట పూర్తవ్వదు. ఈ పాట లేకుండానే సినిమా విడుదల చేద్దామనుకొన్నారు. కాకపోతే ఆల్రెడీ ఓ పాటని ఇలానే కత్తిరించుకొన్నారు. ఇప్పుడు రెండో పాట కూడా లేపేస్తే.. సినిమాలో గ్లామర్ తగ్గిపోతుందన్నది చిత్రబృందం భయం. అందుకే ఎదోలా నయనతారని వేడుకొని కాల్షీట్లు తీసుకొన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట కూడా పూర్తయిపోతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.