ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఆశించిన శశకళ, అన్యూహంగా జైల్లో జీవితం గడపాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే ఆమెకు జైలు జీవితం అలవాటైంది. అయితే, భౌతికంగా చిన్నమ్మ జైల్లోనే ఉన్నారుగానీ.. మనసంతా అధికారం మీదనే ఉంటుందనేది వాస్తవం. ఎందుకంటే, పళని స్వామి ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కించినంత మాత్రాన పనైపోయినట్టు కాదు కదా! శశికళ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. నిజానికి, మరో నాలుగేళ్లపాటు పళని స్వామికి తిరుగులేని పరిస్థితి రాజకీయంగా ఉందనీ చెప్పలేం! ఎందుకంటే, ఓపక్క స్టాలిన్ చాపకింద నీరులా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు వస్తే బాగుండనే వ్యూహంలో ఆయన ఉన్నారు. పన్నీర్ సెల్వమ్‌ను అడ్డం పెట్టుకుని ఏదో ఒకటి సాధించాలని గవర్నర్‌కు ఫిర్యాదులూ.. కోర్టులో కేసులూ అంటూ చక్కర్లు కొడుతున్నారు.
అయితే, ఈ నేపథ్యంలో చిన్నమ్మ ముందున్న పెద్ద సవాల్… జైల్లో తాను ఉన్నా, తమిళనాడు ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడం. అన్నాడీఎంకేపై ప్రజల నమ్మకాన్నీ, కార్యకర్తల విశ్వాసాన్ని పట్టి ఉంచడం! అందుకే, జయలలిత పుట్టిన రోజును కూడా తన వర్గానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 24న అమ్మ జయంతి వేడుకల్ని వైభవంగా జరపాలంటూ పార్టీ వర్గాలకు శశికళ పిలుపునిచ్చారు. ఈ ప్రకటనకి కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చారు. జయలలిత మరణాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాని శశికళ అభిప్రాయడ్డారు. అమ్మ లేకపోవడంతో జైల్లో తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నా అన్నారు.
దాదాపు 33 ఏళ్లుగా ఇద్దరూ కలసి ఉన్నామనీ, జయ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేసుకునేవారమని గుర్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం అమ్మ లేకపోవడం తనకు చాలా వెలితిగా ఉందనీ, తన జీవితంలో సుదీర్ఘ కాల స్నేహితురాలిగా ఉన్న జయలలిత లేకపోవడంతో చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నాను అని శశికళ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి, ఇక్కడ రెండు అర్ధాలు ధ్వనిస్తున్నాయి. ఒంటరిగా ఉన్నాను… అంటే, జైల్లో తనతోపాటు జయలలిత లేకపోవడం వల్ల శశికళ ఒంటరిగా ఫీలవుతున్నారా అనే మీనింగ్ కూడా వస్తోందని విమర్శించే ఆస్కారమూ ఉంది!
పొలిటికల్‌గా చూసుకుంటే… శశికళ జైల్లో ఉన్నా కూడా అమ్మ గురించి ఎంత బాధపడుతున్నారో అనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఇలాంటి ప్రకటన వెనక వ్యూహంగా చెప్పుకోవచ్చు. ఈ వేడుకల్ని పన్నీర్ వర్గం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చిన్నమ్మ భలే వ్యూహాత్మకంగా ప్రకటన చేశారనే చెప్పాలి. భవిష్యత్తులో కూడా అమ్మతో తనకున్న స్నేహాన్నే పొలిటికల్ మైలేజ్ తీసుకొచ్చే ఇంధనంగా మార్చుకోబోతున్నట్టు కనిపిస్తోంది!