తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చాణక్యుడు అని కొంతమంది అంటుంటారు! అధికారంలో ఉన్నప్పుడే తన పార్టీ పునాదుల్ని మరింత పటిష్టం చేసుకోవడం ఎలాగో బాగా తెలిసిన నాయకుడు! ప్రతిపక్షాలను పాలనతో కాకుండా… ఫిరాయింపులతో బలహీనపరచడం అనే కొత్త ఓరవడి తీసుకొచ్చారు! రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతల్ని తన దారిలోకి తెచ్చుకున్నారు. ఇక, తెరాసకు, భాజపా ఒక్కటే ధీటుగా నిలుస్తోందన్న తరుణంలో… ఆ పార్టీ నేతల నోళ్లు మూతబడేలా ఢిల్లీ నుంచి డైరెక్ట్ కనెక్షన్ తెచ్చుకున్నారు. ప్రధాని మోడీతో దోస్తీ పక్కా చేసుకుని, రాష్ట్రంలో భాజపా నేతల నోళ్లు లేవకుండా కట్టేశారు. ఓవరాల్‌గా టి.ఆర్.ఎస్. అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చేందుకు బాగానే బాటలు వేశారు. కానీ… ఒక్క కోదండరామ్ విషయంలో మాత్రం కేసీఆర్ పప్పులు ఉడకలేదనే చెప్పాలి.
తెలంగాణ ఉద్యమంలో ఇద్దరూ కలిసి ప్రయాణించారు. మాస్టారి మాట తెరాసకు శిరోధార్యం అన్న రేంజిలో మిలాకత్లు ఉండేవి! కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయాల్లోకి వచ్చేందుకు కోదండరామ్ నిరాకరించారు. ప్రజల పక్షానే ఉంటానంటూ పక్కకు తప్పుకున్నారు. నిజానికి, అప్పటి నుంచే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. రైతుల ఆత్మహత్యలు, ప్రాజెక్టు ప్రాంతాల్లో నిర్వాసితుల కష్టాలు.. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బాగానే కృషి చేశారు. అయితే, ఎప్పుడైతే కోదండరామ్ వాయిస్‌కు ప్రజల నుంచి స్పందన వస్తోందని గ్రహించారో… అప్పట్నుంచీ తెరాస నేతలు కూడా కోదండరామ్‌పై మాటల దాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ కోవర్టు అన్నారు, విద్యార్థులను వాడుకుంటున్నారన్నారు, చివరికి జేయేసీది నేర చరిత్ర అనే స్థాయికి వచ్చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… కోదండరామ్ చేస్తున్న విమర్శలపై తెరాస విశ్లేషణ చేసుకోలేదు! కేవలం ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని, నోర్మూయించాలని చూసినట్టే కనిపిస్తోంది.
ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే… కోదండరామ్‌ను కేసీఆర్ ఎందుకు ఆకర్షించలేకపోయారనేది? తెలంగాణ ఉద్యమాన్ని ఎడాపెడా విమర్శించినవారు కూడా ఇప్పుడు తెరాసలోనే ఉన్నారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసిన తుమ్మల, తలసాని వంటి వారిని పిలిచి మరీ మంత్రి పదవులు కట్టబెట్టి కంట్రోల్లో ఉంచుకున్నారు. ఎర్రబెల్లి లాంటి నాయకులకు కూడా గులాబీ కండువా కప్పేసి మాట్లాడనివ్వకుండా చేశారు. సీనియర్ నేతలైన గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటివారిని కూడా ఫిరాయింపు మార్గంలో అక్కున చేర్చుకున్నారు.
ఇంతమందిని ఎట్రాక్ట్ చేసి, తనను విమర్శించే నాయకులే తెలంగాణ లేకుండా చేసుకున్నారు కదా! మరి, కోదండరామ్‌ను ఎందుకు ఆకర్షించలేకపోయారు..? తనవైపు ఎందుకు తిప్పుకోలేకపోయారు..? ఆయన విషయంలో కేసీఆర్ రాజకీయ చతురత వర్కౌట్ కాలేదా..? లేదంటే, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.