ఏపీలో మంత్రి వర్గ విస్తరణ కోసం లైన్ క్లియర్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగానే శ్రమిస్తున్నట్టున్నారు! ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టడం ఇప్పుడు తప్పనిసరి. ఎందుకంటే, ఇప్పటికే కొంతమంది జంప్ జిలానీల్లో నిరుత్సాహం నిండిందనీ, ఏదో ఆశించి టీడీపీలోకి వస్తే ఏం జరగలేదన్న భావన పెరిగిందని కథనాలు వస్తున్నాయి. సో… వారిలో నమ్మకాన్ని పెంచాల్సిన తరుణం ఇది. అయితే, ఇదే తరుణంలో ఫిరాయింపుదారులకు పదవులు ఇస్తే… స్థానిక టీడీపీ నేతలు ఒప్పుకోని పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి.
ఫిరాయింపుల పుణ్యమా అని కర్నూలు టీడీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. పార్టీలోకి భూమా నాగిరెడ్డి రావడంతో అక్కడ వేరు కుంపట్లు రగిలాయి. భూమాకి పదవి ఇస్తే తాము ఊరుకునేది లేదని ఇప్పటికే శిల్పా వర్గం భీష్మించుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో పార్టీని నమ్ముకుని తాముంటే, నిన్నమొన్నటి వరకూ ప్రతిపక్షంలో ఉన్న భూమాకి పదవి ఎలా ఇస్తారంటూ వారు వాదిస్తున్నారు. భూమాకి పదవి అంటూ వస్తే తమ అసంతృప్తిని పూర్తిస్థాయిలో బయటపెట్టేందుకు శిల్పా సోదరుల వర్గం సిద్ధంగా ఉందంటూ ఈ మధ్య కథనాలు వస్తున్నాయి. ఈ అసంతృప్తులకు భయపడి క్యాబినెట్ విస్తరణను మరింత వాయిదా వేసే పరిస్థితి లేదు! సో.. దీంతో శిల్పా, భూమా వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చంద్రబాబు ఓ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైకాపా నుంచి పార్టీ ఫిరాయించిన భూమాకి మంత్రి పదవి ఇస్తూనే… ఇదే సమయంలో శిల్పా సోదరులు కూడా పార్టీ మంచి స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట. ఈ డీల్లో భాగంగా ముందుగా శిల్పా చక్రపాణి రెడ్డికి శాసన మండలి సభ్యత్వం కల్పిస్తామని మాటిచ్చినట్టు సమాచారం. సమీప భవిష్యత్తులో సరైన సమయం చూసుకుని మోహన్ రెడ్డికి కూడా మంచి స్థానం కల్పిస్తామని చంద్రబాబు భరోసా కల్పించినట్టు చెప్పుకుంటున్నారు.
నిజానికి, భూమాకి మంత్రి పదవి ఇవ్వడంపై శిల్పా వర్గం మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. చంద్రబాబు హామీ మేరకు వారు శాంతించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో రెండు వర్గాలూ తాత్కాలికంగా శాంతించే అవకాశం ఉంటుందనీ, అసంతృప్తులు బయట పడకుండా ఉంటాయని అనుకుంటున్నారు. అయితే… ఈ సర్దుబాటు కేవలం ‘తాత్కాలిక’ పరిష్కారంగా మాత్రమే కనిపిస్తోంది. రెండు కత్తులు ఒక ఒరలో ఎలాగైతే ఇమడలేవో.. కర్నూలు జిల్లాలో ఈ రెండు వర్గాలూ ఒకే పార్టీ ఇమడటం అనేది అంత సులువైన పని కాదని విశ్లేషకులు అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన వెంటనే అసంతృప్తులు బయటపడకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట వేద్దామని చంద్రబాబు ఈ వ్యూహం తెరపైకి తెచ్చి ఉంటారు. అంతేగానీ.. ఇది దీర్ఘకాలంలో పార్టీని లాభించే సంధి కాదనే అనిపిస్తోంది.