కొత్త కథలు రావు. రావాలి అనుకోవడం కూడా పొరపాటే. కొత్త కథతోనే సినిమాలు తీయాలంటే… యేడాదికి పదికి మించి సినిమాలు తీయకూడదు. అందుకే పాత కథల్ని మళ్లీ మళ్లీ రుద్దేయడం పాపం కాదు. అయితే ఆడియన్స్ ని కూల్ చేసే మార్గాల్ని వెదుక్కోవాలి. ఇది పాత కథే.. అనే విషయం తెలీయకుండా మాయ చేయాలి. స్క్రీన్ ప్లే టెక్నిక్స్ తోనో, వినోదంతోనో రెండు గంటల పాటు ఆడియన్స్ కళ్లని సిల్వర్ స్క్రీన్ కి అంకితం చేయించేయాలి. ఆ టెక్నిక్ తెలిసినవాళ్లే తెలుగులో కమర్షియల్ దర్శకులుగా రాణించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పటి వరకూ కొత్త కథలేం చెప్పలేదు. పాత కథలనే పైన చెప్పుకొన్న టెక్నిక్ తో నడిపించేశాడు. మరి విన్నర్ లోనూ అదే చేశాడా?? లేదంటే ఆడియన్స్ కి అడ్డంగా దొరికిపోయాడా?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
సిద్దార్థ్ (సాయిధరమ్ తేజ్) ఓ న్యూస్ పేపర్ లో క్రియేటీవ్ హెడ్ గా పనిచేస్తుంటాడు. సితార (రకుల్ ప్రీత్ ) అనే అమ్మాయిని చూసి… వెంటనే లవ్ లో పడిపోతాడు. సితార ఓ అథ్లెట్ . తనకు తన గోల్ తప్ప లవ్ గోల పడదు. అయితే సిద్దార్థ్ కారణంగా తాను చిక్కుల్లో పడుతుంది. ఇష్టం లేకపోయినా ఆది (అనూప్ సింగ్)ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆది ఓ రేసర్. గుర్రపు పందాల్లో గెలవడం.. అతని హాబీ. అతన్ని రేసు పోటీల్లో ఓడించి, సితారని దక్కించుకొంటానని పందెం కాస్తాడు సిద్దార్థ్. నిజానికి సిద్దార్థ్ కి గుర్రాలన్నా, గుర్రపు పందాలన్నా ఏమాత్రం ఇష్టం ఉండదు. రేసుల కారణంగానే తన తండ్రి కి (జగపతి బాబు) దూరమవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అదే గుర్రపు పందాలతో తన ప్రేయసికి ఎలా దగ్గరయ్యాడు? అనేదే విన్నర్ కథ.
* విశ్లేషణ
తెలుగు సినిమాలో అనేకనేక సార్లు ఉతికి ఆరేసి, హీరోలందరూ మార్చి మార్చి తొడిగిన ఫార్ములా చొక్కాని ఈసారి సాయిధరమ్ తేజ్ కాస్త ఇస్త్రీ చేసి తొడిగాడంతే. ఈ కథ గోపీచంద్ మలినేనిది కాదు. వెలిగొండ శ్రీనివాస్ అనే రచయితది. అతను ఏ మాయ చేసి గోపీచంద్ ని ఒప్పించాడో.. గోపీచంద్ ఏం చెప్పి, నిర్మాతల దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకొన్నాడో, ఏం నచ్చి సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పేశాడో అర్థం కాదు. కథ కొత్తగా లేకపోయినా ఫర్వాలేదు… ట్రీట్ మెంట్ తో సర్దేయొచ్చు అనే ఒక్క నమ్మకంతో ఈ సినిమాకి శ్రీకారం చుట్టుంటారని బలంగా అనిపించకమానదు. సరే.. ట్రీట్ మెంట్ అయినా కొత్తగా వుందా అంటే.. అక్కడా నిరాశే. ఓ పాట, ఓ ఫైటు, హీరోయిజం ఎలివేట్ చేసే సీన్, ఓ లవ్ ట్రాక్, విలన్ తో ఛాలెంజ్.. వెంటనే ఇంట్రవెల్.. ఇలా ఎక్కడా కమర్షియల్ సూత్రాలు తప్పలేదు. అదే పాత సీసా.. అదే పాత సారా. వడ్డించేవాడు మారాడంతే..
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథని నడపాలనుకోవడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. దానికి తోడు మనకు ఏమాత్రం టచ్ లేని గుర్రపు సారీ. దాంతో పాత పాయింట్ అయినా.. కాస్త కొత్తగా కనిపిస్తుందే అనే నమ్మకం రావొచ్చు. గుర్రపు స్వారీకు సంబంధించిన సీన్లు… దాని చుట్టూ పండే ఎమోషన్ లతో.. కథని కొత్త పూత పోసే అవకాశం వచ్చింది. దాన్నీ దర్శకుడు పాడు చేసేశాడనే చెప్పాలి. క్రికెట్, హాకీ, కబడ్డీ… ఇవన్నీ మనకు తెలిసిన గేమ్స్. తెలిసిన ఆటే కాబట్టి.. లోతుల్లోకి వెళ్లకపోయినా, డిటైలింగ్ ఇవ్వకపోయినా అర్థం అయిపోతుంది. కానీ మనకు సంబంధం లేని ఓ ఆటని చూపించాలనుకొన్నప్పుడు కాస్త కసరత్తు చేయాల్సింది. స్పోర్ట్స్ డ్రామాలంటే మన వాళ్లకు అదీ.. కమర్షియల్ పాయింట్ లానే అనిపించింది. దంగల్ చూడండి. అది స్పోర్ట్స్ డ్రామానే. దాని కోసం.. దర్శకుడు ఎంత కసరత్తు చేశాడో, టీమ్ ఎంత ప్రొఫెషనల్ గా ఆలోచించిందో. కానీ ఈ సినిమాలో అవేం కనిపించవు. విలన్ ఓ ప్రొఫెషనల్ జాకీ. అతన్ని అసలు గుర్రపందాలంటేనే అవగాహన లేని హీరో గెలిచాడంటే… అందుకోసం చేసిన సాధనలో ఎంత సీరియెస్ నెస్, ఇంకెంత సిన్సియారిటీ వుండాలి? అదేదో తూ తూమంత్రం విద్య అన్నట్టు చూపిస్తే ఎలా? అక్కడక్కడ ఎంటర్ టైన్ మెంట్ లేకపోతే.. విన్నర్ మరింత బోరింగ్ గా తయారయ్యేది. ఆ క్రిడిట్ కూడా హీరోకి ఇవ్వకుండా వెన్నెల కిషోర్, థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ లాగేసుకొన్నారు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మరింత బోరింగ్ గా సాగింది.
* నటీనటుల ప్రతిభ
సాయిధరమ్ వాళ్ల మేనమామల్ని ఇమిటేట్ చేయడం ఎప్పుడు మానేస్తాడో అనిపించేలా సాగింది.. నటన. సాయి డాన్సులు చూసి తరిద్దాం అనుకొన్నవాళ్లకీ నిరాశే ఎదురవుతుంది. తమన్ అందించిన సోసో పాటలకు ఈమాత్రం స్పెప్పులు ఎక్కువ అనుకొన్నాడేమో.. డాన్సుల్లో స్పీడు చూపించలేదు. రకుల్ చాలా చాలా గ్లామర్ గా కనిపించింది. ఎక్స్ పోజింగ్ తో హీట్ పెంచింది. అంతకు మించి ఆ పాత్ర కథకు ఉపయోగపడిందేం లేదు. సరిగ్గా ఇలాంటి పాత్రలు ఇంకో రెండు పడితే.. జగపతిబాబు స్పెషల్ క్యారెక్టర్స్ రేంజు నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు స్థాయికి పడిపోతాడు. అనూప్ సింగ్ కి బిల్డప్ షాట్స్ ఎక్కువ పడ్డాయి గానీ.. ఆ పాత్రకే అంత బిల్బప్ లేదు. కామెడీ గ్యాంగ్ ఫర్వాలేదనిపించింది.
– సాంకేతికంగా
తమన్ వీర బాదుడు ఈ సినిమాలో నూ కంటిన్యూ అయ్యింది. పాటలు క్యాచీగా లేవు. సితార ఒక్కటే బెటర్. కెమెరా వర్క్ ఒకే అనిపించినా, ఛోటా స్టాండర్డ్ కి అది తక్కువే. గోపీచంద్ చాలా సాదా సీదా కథని ఎంచుకొని అంతే సాదాసీదాగా ఈ సినిమాని మలిచాడు. ఇలాంటి సోసో కథని డబ్బులు విచ్చల విడిగా వెదజల్లారు నిర్మాతలు. రొటీన్ కథల జాబితాలో ఆలస్యం చేయకుండా చేరిపోయే సినిమా ఇది.
– ఫైనల్ టచ్… విన్నర్ కాదు.. లూజర్
తెలుగు 360 రేటింగ్: 2.5/5