టాలీవుడ్లో చాలా వేగంగా సినిమాల్ని పూర్తి చేసే అగ్ర దర్శకుల్లో పూరి జగన్నాథ్ ప్రధముడు. తక్కువ రోజుల్లో, క్వాలిటీ మేకింగ్ తో సినిమా రావాలనుకొంటే.. పూరిని సంప్రదించడం మినహా మరో మార్గం లేదు. ఆ వేగంతోనే అతి తక్కువ సమయంలోనే 25 సినిమాల్ని పూర్తి చేసుకోగలిగాడు పూరి. సినిమాకి కొబ్బరికాయ కొట్టే రోజే రిలీజ్డేట్ చెప్పడం, చెప్పిన టైమ్ కి సినిమాని విడుదల చేయడం పూరి స్టైల్. ఈసారి ఇంకాస్త తొందర పడ్డాడు. సినిమా ఎనౌన్స్చేసిన రోజే రిలీజ్ డేట్ చెప్పేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా భవ్య ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలయ్య 101వ చిత్రం ఇదే. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్… మహాశివరాత్రి సందర్భంగా బయటకు వచ్చేసింది. మార్చి 9న ఈ చిత్రానికి కొబ్బరికాయ్ కొడతామని, సెప్టెంబరు 29న విడుదల చేస్తామని పూరి చెప్పేశాడు.
మార్చి 9న బాలయ్య సినిమా లాంఛనంగా మొదలవుతుందంతే. ఏప్రిల్లో గానీ పట్టాలెక్కదు. ఈలోగా పూరి స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ చేసుకోవాలి. అంటే సినిమా మొదలవ్వడానికి, విడుదలకూ 5 నెలలకు మించి సమయం ఉండదు. 5 నెలల్లో ఓ పెద్ద సినిమా పూర్తిచేయడం పూరికి కొత్తేం కాదు. అయితే.. పూరి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. అగ్ర హీరోలు క్రమంగా పూరికి దూరం అవుతున్నారు. ఫామ్ లో ఉన్న బాలయ్యతో సినిమా అంటే.. పూరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్క్రిప్టు పక్కాగా సిద్ధమైతే గానీ.. పట్టాలెక్కించడం దుస్సాహసమే అవుతుంది. పూరి దగ్గర కేవలం కథ మాత్రమే ఉంది. స్క్రిప్టు రూపంలో సిద్దం అవ్వడానికి టైమ్ పడుతుంది. బాలయ్య అవకాశం ఇచ్చాడు కదా, అని తొందర్లో సినిమాని మొదలెట్టేసి, ఓ డెడ్ లైన్ పెట్టుకొని పూర్తి చేసేయడం భావ్యం కాదు. ఈ తొందర్లోనే ఫ్లాపులు కొని తెచ్చుకొన్నాడు పూరి. ఇప్పటికీ ఆ పాఠాలు నేర్చుకోకపోతే ఎలా?? రిలీజ్ డేట్ చెప్పి సినిమా తీయడం మంచి విషయమే. కానీ… ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రిలీజ్ డేట్ పై కంటే… కథపై, టేకింగ్పై దృష్టి పెడితే మంచిది.