ఈ నెల 7వ తేదీ నుండి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీపర్యటనకు బయలుదేరుతున్నందున, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఆయన పర్యటనకు బయలుదేరేలోగా అంటే ఈ నెల మొదటి వారంలోనే నిర్వహించాలని మొదట భావించినప్పటికీ హడావుడిగా సమావేశాలు నిర్వహించి ‘మమ’ అనిపించేయడం కంటే ఆయన తిరిగి వచ్చిన తరువాతనే నిర్వహించాలని నిశ్చయించుకొన్నారు. అదే విషయం ఆయన నిన్న మీడియాకి తెలియజేస్తూ “నేను విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత సెప్టెంబర్ 23నుండి ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరుకొంటే అన్ని రోజులు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాము,” అని అన్నారు.
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కనీసం 15రోజుల పాటు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా కోరినప్పటికీ కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహిస్తుంటే, కేసీఆర్ ప్రతిపక్షాలు అడగక ముందే వాళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని చెప్పడం విశేషం. కానీ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న తీరు చూస్తుంటే ఆ ఐదు రోజులు కూడా ఎక్కువేనెమోననే భావన కలుగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రజా సమస్యలపై చర్చ మొదలుపెట్టి, ఆ తరువాత వాటిపై చర్చను పక్కనపెట్టి ఒకరినొకరు దూషించుకోవడానికి, విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడానికే పరిమితమవుతున్నారు. ఆ మాత్రం దానికి విలువయిన ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం దేనికని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణా అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇదే విధంగా సాగినప్పటికీ, సమావేశాలు మొదలవగానే ఏదో కారణంతో తెదేపా సభ్యులు గొడవ చేయడం ఆ సాకుతో వారందరినీ సభ నుండి సమావేశాలు జరిగినంత కాలం సస్పెండ్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. సభలో మిగిలిన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తెరాస ప్రభుత్వానికి సహకరిస్తూ చర్చల్లో పాల్గొంటున్నారు కనుక సమావేశాలు సజావుగా సాగిపోతున్నాయి. పైగా సభలో కాంగ్రెస్ ఫ్లోర్-లీడర్ కె.జానారెడ్డి తెరాస పట్ల చాలా మెతక వైఖరి అవలంభిస్తుండటంతో సభలో ప్రతిపక్షం అసలు ఉందా లేదా? అన్నట్లు చాలా సజావుగా సాగిపోతుంటుంది. కానీ ప్రజలు కోరుకొనేది కూడా అదే. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏవిధమయిన రాజకీయ విభేదాలున్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలలో వాటన్నిటినీ పక్కనబెట్టి ప్రజా సమస్యలపై లోతుగా చర్చించి, వాటికి పరిష్కారాలు కనుగొనాలని ఆశిస్తారు. ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు సమ ఉజ్జీలుగా ఉండటంతో అది సాధ్యం పడటం లేదు.