నందమూరి బాలకృష్ణ సినిమా కోసం పూరి జగన్నాథ్ వెలువరించిన కాస్టింగ్ కాల్ ప్రకటన ప్రస్తుతం ఇండ్రస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఓ అగ్ర కథానాయకుడి సినిమాకి అందులోనూ ఓ స్టార్ డైరెక్టర్ కాంబోలో వస్తున్న సినిమాకి ఇలా స్టార్ కాస్టింగ్‌కి సంబంధించిన ప్రకటన రావడం సరికొత్త సంగతే. సాధారణంగా చిన్న సినిమాలకు ఇలాంటి స్టార్ కాస్టింగ్ ప్రకటన చూస్తుంటాం. అలాంటిది స్టార్ హీరో – దర్శకుడి సినిమాకి కాస్టింగ్ కాలేంటి?? ఈ ఎత్తుగడ వెనుక చాలా చాలా కారణాలే ఉన్నాయని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ముఖ్యంగా బాలయ్య సినిమా అనగానే హీరోయిన్ల సమస్య ఎక్కువైపోతోంది. సీనియర్ హీరోలకు తగిన కథానాయికలే దొరకడం లేదు. ఎన్టీఆర్ సినిమా కేవలం కథానాయికలు లేకపోవడం వల్ల ఆలస్యం అయ్యింది. వెంకీ, రవితేజ, నరేష్… వీళ్లెవ్వరికీ సరైన హీరోయిన్లు దొరకడం లేదు. హీరోయిన్ల లేమితో బాలయ్య సినిమా ఆలస్యం కాకూడదన్నది పూరి అభిప్రాయం. అందుకే కాస్టింగ్ కాల్కి వెళ్లాల్సివచ్చింది.
అయితే ఇలాంటి ప్రకటనలు సినిమా హైప్‌ని తగ్గించేస్తాయని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య పక్కన అనుష్కనో, నయనతారో కనిపిస్తే ఆ లుక్ వేరేలా ఉంటుంది. పారితోషికాలకు భయపడో, కథానాయికలు దొరకడం లేదనో… కొత్త మొహాలకు చోటిస్తే ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై పడే ప్రమాదరం ఉంది. బాలయ్య గత సినిమాలు శ్రీమన్నారాయణ, అధినాయకుడు. లయన్… ఈ చిత్రాలకు అంతగా పబ్లిసిటీ దక్కలేదు. వాటిపై ఎలాంటి క్రేజూ ఏర్పడలేదు. దానికి కారణం.. సరైన కథానాయికలు లేకపోవడమే. సరిగ్గా అదే తప్పు పూరీ కూడా చేస్తున్నాడేమో అనిపిస్తోంది. కొత్త వాళ్లతో సినిమా తీస్తున్నారంటే.. దాన్ని చుట్టేస్తున్నారేమో అనుకొనే ప్రమాదం ఉంది. బాలయ్య – పూరి కాంబినేషన్లో సినిమా అనగానే ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో, కొత్త వాళ్లకు ఛాన్స్ అనే ప్రకటన రాగానే.. పెరిగిన హైప్ అమాంతంగా తగ్గే ఛాన్సులున్నాయి. నిజంగానే కథకు, సినిమా బడ్జెట్‌కు కొత్త వాళ్లే అనుకూలం అన్నప్పుడు ఆ ప్రక్రియ కూడా కూల్‌గా, ఎవ్వరికీ తెలియకుండా జరిగిపోవాలి. కొత్తవాళ్లని పట్టుకోవడం పూరికి తెలియని విద్య కాదు. దానికి తోడు పూరికి అత్యంత సన్నిహితంగా ఉండే ఛార్మి.. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ కాస్టింగ్ కంపెనీ కూడా నిర్వహిస్తోంది. ఛార్మి తలచుకొంటే ఈ సినిమాకి కావల్సిన నటీనటుల్ని ఎంపిక చేయడం చిటికెలో పని. ఇన్ని సౌలభ్యాలుండగా, పూరి ఈ పని ఎందుకు చేస్తున్నాడన్నది అర్థం కాని ప్రశ్నే.