అనువుగాని చోట అధికులమనరాదు అని పెద్దలు ఊరికే చెబుతారాండీ..! మనకు తెలిస్తే.. తెలిసినంతే మాట్లాడాలి. తెలియకపోతే.. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అబ్బే… మనకు తెలిసిందే తెలివండీ, వాగిందే వాస్తవమండీ అంటూ పిడివాదానికి దిగితే ఏమౌతోంది..? ఫిరాయింపు నాయకుడు జలీల్ ఖాన్‌కు అదే జరిగింది. టీడీపీ మంత్రి పదవి ఆశ చూపగానే టిక్కెట్టిచ్చి గెలిపించిన వైకాపాని వదిలేశారు. ప్రజాతీర్పును వెక్కిరిస్తూ పచ్చ కండువా కప్పేసుకున్నారు. మంత్రి వర్గ విస్తరణలో మైనారిటీ సంక్షేమానికి మనం తప్ప వేరే పోటీ లేరు అనుకున్నారు! తెలుగుదేశానికి మనకు మించిన క్వాలిఫైడ్ నాయకుడు దొరకలేడు అనే అతి విశ్వాసానికి పోయారు. కండువా కప్పుకుని కామ్‌గా తనపనేదో తాను చేసుకోకుండా.. బీకామ్‌లో ఫిజిక్స్ తెచ్చిపెట్టారు! ఇప్పుడు టీడీపీతో జెలీల్ కెమిస్ట్రీని దెబ్బతీస్తున్నది ఇదే.
ఓ ఇంటర్వ్యూలో జలీల్ మాట్లాడుతూ… ‘ఉంటది.. ఉంటది.. బీకామ్‌లో ఫిజిక్స్ ఎందుకు ఉండదూ..’ అంటూ జర్నలిస్టును దబాయించి మరీ బీకామ్‌లో ఫిజిక్స్ తెచ్చి పెట్టారు. అక్కడితో ఆగినా సగం మిగిలేది! పోతే మొత్తం పోవాలని కంకణం కట్టుకున్నట్టు.. ‘కామర్స్ ఈజ్ నథింగ్ బట్స్ మ్యాథ్స్ కదా. చైల్డ్ హుడ్ నుంచి మ్యాథ్స్‌లో నాకు 100కి వంద వచ్చేవి’ అంటూ ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ మాత్రం చాలదూ ఆయనలోని జ్ఞానతృష్ణను బయటపెట్టడానికీ..! ఈ ఒక్క ఇంటర్వ్యూ 24 గంటలు గడిచేలోగా వైరల్ అయిపోయింది. బీకామ్‌లో ఫిజిక్స్‌ను కలపగల ఏకైక సమర్థ నాయకుడిగా జలీల్ ఖాన్ పేరు మార్మోగిపోయింది. ఇంత తెలివైన నాయకుడు తెలుగుదేశంలో ఉన్నందుకు తెలుగుజాతి యావత్తూ ‘నభూతో’ అంటూ సోషల్ మీడియాలో స్పందించి, గర్వించి, గర్హించి, ఆగ్రహించి, ఆ మేధస్సును గ్రహించి, చివరికి సహించి, విచారించింది..!
ఇంత జరిగిన తరువాత కూడా మంత్రి పదవి వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారేమోగానీ, తెలుగుదేశం పార్టీకి ఆ ధైర్యం లేకుండా పోయింది. బీకామ్‌లో ఫిజిక్స్ చదివినాసరే మంత్రి పదవి ఇవ్వడం లేదు..! ఏపీలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగబోతున్న సంగతి తెలిసిందే. గతంలో జలీల్ ఖాన్‌కు కూడా పదవి ఇద్దామనుకున్నారు. అదే ఎరగా ఆయన్ని గోడ దూకించారు. కానీ, ఎప్పుడైతే బీకామ్‌లో ఫిజిక్స్ క్వాలిఫికేషన్.. సోషల్ మీడియాలో రచ్చ అయిపోవడం… ఈ నేపథ్యంలో జలీల్‌కు పదవి ఇస్తే పార్టీ కూడా నవ్వులపాలు కావాల్సి వస్తుందన్న భయం పట్టుకుందని తెలుస్తోంది.
అందుకే, ఇప్పుడు జలీల్ ఖాన్ స్థానంలో మరో మైనారిటీ నాయకుడు మహ్మద్ జానీకి అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినవారే. సో… ఆ విధంగా జలీల్ మంత్రి పదవి కలలు అలానే మిగిలిపోతున్నాయన్నమాట. చిత్రం ఏంటంటే.. ఆయన్ని తెలుగుదేశం నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా పార్టీ వర్గాలకు ధైర్యం చాలడం లేదట! పాపం… జలీల్ భవిష్యత్తు ఏంటో మరి! (ఛీ.. పాడు సమాజం… డిఫరెంట్‌గా ఆలోచిస్తే అర్థం చేసుకోదేం!)