? నిరుద్యోగం అనేది ఇప్పుడు ఒక రాజకీయఅంశం గా మారింది. ఎన్నికల్లో గెలవడం కోసం ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భ్రుతి అని ఒక చంద్రుడు హామీ ఇస్తే; ఇంకో చంద్రుడు, ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసి రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యోగాల హామీతో చంద్రబాబు కి ముఖ్యమంత్రి ఉద్యోగం, చంద్రశేఖరరావు ఫ్యామిలీ మొత్తానికి ఉద్యోగాలు వచ్చాయి కానీ, యువతకి మాత్రం పెద్దగా ఉద్యోగాలు రాలేదు. హైదరాబాద్ ఉండడం వల్ల తెలంగాణాలో కాసిని కొత్త ఉద్యోగాలు కనిపిస్తున్నాయి కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రమే లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నాయి.
నీళ్ళు నిధులు నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో మొదటి రెండు పెద్ద సమస్యలు కాదు, వాటిని తేలికగానే కెసిఆర్ పరిష్కరించ గలిగారు కానీ ఉద్యోగాల విషయం లో మాత్రం మాట నిలుపుకోవడం అంత తేలిక కాదు. ఇక చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభ్రుతి అనే హామీ నిలబెట్టుకోవడం అసాధ్యం. రైమింగ్ కుదిరింది కదా అని ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అని గోడలపై రాసిన తెదేపా శ్రేణులపై ఇప్పుడు జగన్ అదే అస్త్రాన్ని ఎక్కు పెడుతున్నారు. నిరుద్యోగభ్రుతి కింద మూడేళ్ళుగా చెల్లించాల్సిన లక్ష కోట్ల బకాయిలు చెల్లించమని చంద్రబాబు కి జగన్ లేఖ రాశారు. తెలంగాణలో ప్రొ. కోదండరామ్ కూడా నిరుద్యోగం అనే అస్త్రాన్ని తీసుకుని కేసిఆర్ పై యుద్ధం ప్రకటించారు. వచ్చే రెండేళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నిరుద్యోగం చుట్టూనే తిరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్య, పార్టీల డిమాండ్స్ పై నేను అందిస్తున్న లోతైన విశ్లేషణ ఇది..
? తెలంగాణ లో లక్షా ముప్పై ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోదండరామ్ డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సరైన లెక్కలు లేవు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి చూస్తే సొంత ఆదాయం కాస్తా ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతోంది. కొత్తగా ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అంటే, నెలకి సగటున 40 వేల జీతం అనుకుంటే 400 కోట్లు అవుతుంది. ఏడాదికి 4800 కోట్లు అదనపు బడ్జెట్ అవుతుంది. ఈ ఖర్చు ప్రతి ఏడూ పెరిగిపోతూనే ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టినందుకు ప్రజలకి ఒరిగేది ఏమీ ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. వీరిలో రెండు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే, మిగిలిన 28లక్షల మంది పరిస్థితి ఏంటి? ప్రభుత్వ శాఖల్లో చాలావరకు ప్రజలకి ఉపయోగపడని ఉద్యోగాలే ఉంటాయి. కంప్యూటరీకరణ, ప్రైవేటీకరణ జరిగాక ప్రభుత్వ ఉద్యోగుల అవసరం కొన్ని రంగాల్లో తగ్గింది. కొన్ని చోట్ల పెరిగింది. ఉపాధ్యాయులు, పోలీసులు, నర్సింగ్ సిబ్బంది లాంటి పోస్టుల అవసరం పెరిగింది. కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు, ప్రజలకి మెరుగైన సేవలు అందించే ఏర్పాట్లు, కొత్త ఉద్యోగులకి అయినా లంచాలు తీసుకుంటే వెంటనే ఉద్యోగం పోయేలా సర్వీస్ రూల్స్ ని కఠినతరం చేయడం లాంటి చర్యలు తీసుకోకపోతే కొత్త ఉద్యోగాల భర్తీ అనేది ప్రజలకి గుదిబండగా మారే ప్రమాదం ఉంది.
ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నది ప్రైవేటు రంగంలోనే. అయితే అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులలో బహుళజాతి కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెట్టె అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. మనదేశం లో ఉన్న సంపన్నుల్లో మూడొంతులమంది ప్రభుత్వ కాంట్రాక్టులలో నొక్కేయడం, సహజవనరుల దోపిడీ ద్వారా సంపద పోగేసుకున్నవారే. వీరు యువతకి ఉపాధి నిచ్చే పరిశ్రమలు స్థాపించడం కష్టం. కొద్దిమందికి పరిశ్రమలు స్థాపించాలనే ఆసక్తి ఉన్నా, ప్రభుత్వ నిబంధనలు, లంచాలు, భూమి కేటాయింపులలో అవినీతి, లేబర్ కాస్ట్ పెరిగిపోవడం, స్థానిక నాయకుల బెదిరింపులు లాంటి వాటివల్ల వెనక్కిపోతున్నారు. రెండు తెలుగు ప్రభుత్వాలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో మెరుగైన ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నాయి కానీ, క్షేత్రస్థాయిలో అంత సానుకూల వాతావరణం ఇంకా రాలేదు. ఈ పరిస్థితి మారకుండా తెలుగు రాష్ట్రాలలో పెద్దగా పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయని కారణంగా, సొంత భూమి ఉన్న యువకులు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి చూపడం లేదు. మూడెకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా 15వేల నెలజీతం కోసం నగరాలకి వలసపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి అంటే, వ్యవసాయంలో రిస్క్ తగ్గించడం, పంటపండిస్తే చాలు లాభాలు వస్తాయి అనే భరోసా కల్పించడం లాంటి చర్యలు తీసుకోవాలి. మన ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయాన్ని ఉద్ధరించడం అంటే సాగునీరు ఇవ్వడం ఒక్కటే అన్నట్లు వ్యవహిస్తున్నాయి. ఇది మారాలి.
మన దేశంలో గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా జరిగిన అవినీతి కారణంగా, అక్రమ సంపాదనతో రాత్రికిరాత్రే ధనవంతులు అయినవాళ్ళు ప్రతి ఊరిలో ఒకరిద్దరు ఉంటారు. నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదించిననవాళ్లు కూడా కొద్ది మంది ఉంటారు కానీ, నిద్రలేస్తే పత్రికల్లో, మీడియాలో, ప్రజల చర్చల్లో ఉండేది మాత్రం ఈ అక్రమార్జనపరులే. వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్న యువత, తమకి కూడా ఇలాగే ఏదో ఒక స్కీమో, స్కామో తగిలితే లైఫ్ లో సెటిల్ అవ్వొచ్చు అని ఆలోచిస్తోంది. అందుకే కష్టపడే పనుల మీద యువత ఆసక్తి చూపడం లేదు. చేసే పని కూడా శ్రద్ధగా చేయడం లేదు. సమాజంలో పెరిగిన ఈ ఈజీమనీ వెంపర్లాట కూడా కూడా నిరుద్యోగ సమస్యకి కారణం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన రియల్ ఎస్టేట్ బూమ్, రెండు రకాలుగా నష్టం చేసింది. ఒకటి భూముల విలువ విపరీతంగా పెంచేసుకోవడంతో పరిశ్రమలు స్థాపించే వాళ్ళు భూములు కొనాలి అంటే భయపడుతున్నారు. రెండు, భూముల అమ్మకాలు కొనుగోళ్లలో చాలా ఈజీ మనీ ఉంటుంది, భారీ మార్జిన్స్ ఉంటాయి. దీనికి అలవాటుపడిన వాళ్ళు, ఇతర ఉత్పాదక పనులు చేయడానికి ఆసక్తి చూపరు. దీనితో , రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పెరుగుతారు కానీ, రియల్ గా భూమి మీద వ్యాపారం చేసే వాళ్ళు పెరగరు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో విద్య విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత ముప్పై ఏళ్లలో చాలామంది ఇంజనీరింగ్, టెక్నాలజీ వైపుకి వెళ్ళారు. దీనితో అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం డిమాండ్ అంతగా లేదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేవరకు తెలంగాణలో ఆర్ట్స్ గ్రూపులు చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు. వీరికి ప్రైవేట్ రంగంలో పెద్దగా అవకాశాలు ఉండవు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎక్కువ ఆధారపడేవారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపెడితే తెలంగాణ యువత తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉండే ప్రైవేటు ఉద్యోగాల్లో అవకాశం పోతుందని, సీమాంధ్ర యువత సమైక్యాంధ్ర ఉద్యమం అన్నారు.
యువత ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడటం తగ్గించాలి అంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీలని డిగ్రీ కాలేజీలని నాలుగో వంతుకు తగ్గించాలి. చరిత్ర, రాజనీతి, సామాజిక శాస్త్రాలు చదవాలి, వాటిని అర్థం చేసుకోవాలి, దాన్ని సమాజానికి అన్వయించాలి అంటే వీటిని తెలివైన విద్యార్థులు చదవాలి. వీటిని కొద్ది మంది చదివితే చాలు, చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు గ్యారంటీ ఉండాలి. ఇక మూడొంతుల మంది యువత ఇక నుంచి ఉపాధికి ప్రత్యక్షంగా ఉపయోగపడే పాలిటెక్నిక్, ఐటిఐ లాంటి కోర్సులు మాత్రమే చదివేలా ప్రభుత్వం విద్యావిధానాన్ని మార్చుకోవాలి.
? ప్రభుత్వ ఉద్యోగాలని ప్రజలకి ఉపయోగపడేలా సంస్కరించడం;
? ప్రభుత్వ ఉద్యోగం అంటే పని తక్కువ జీతం ఎక్కువ, పైగా లంచాలు అనే పద్ధతి మార్చాలి;
? పరిశ్రమలు, వ్యాపారానికి తగిన వాతావరణం కల్పించడం;
? వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం;
? సమాజంలో కష్టపడేతత్వాన్ని పెంచడం;
? ఉన్నత విద్యలో సమూల సంస్కరణలు తీసుకురావడం;
ఆకాశానికి చేరిన భూముల ధరలు నేలమీదకి రావడం లాంటి చర్యలు చేపట్టాలి. ఇవేమీ చేయకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగాల చుట్టూ మాత్రమే ఈ రాజకీయం తిరిగితే, రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోవడం ఖాయం. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.