సినిమా ప్రమోషన్ లో మెయిన్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్. ఈ వేడుకతోనే సినిమా ప్రమోషన్ కి ఓ ఊపు వస్తుంది. అయితే ఇప్పుడీ ట్రెండ్ మారుతోంది. ఆడియో వేడుక స్థానంలోకి ప్రీ రిలీజ్ వేడుక వచ్చింది. ఈ మార్పు మెగా ఫ్యామిలీ నుండే మొదలైయిందని చెప్పాలి. గత కొద్ది కాలంగా ఆడియో వేడుకలకు మంగళం పాడేసినట్లు కనిపిస్తున్నారు మెగా హీరోలు. అల్లు అర్జున్ సరైనోడు తో దీనికి శ్రీకారం చుట్టారు. ఆడియో ను నేరుగా యుట్యూబ్ లో అప్లోడ్ చేసి తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి సినిమాని రిలీజ్ చేశాడు బన్నీ. తర్వాత రామ్ చరణ్ ధ్రువ వంతు వచ్చింది. ఈ సినిమా కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే పబ్లిసిటీ సూపర్ గా డిజైన్ చేశారు.
ఇక మెగా స్టార్ చిరంజీవి వంతు వచ్చింది. ఆయన రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150కూడా ఇదే మాదిరిగా విడుదల చేశారు. విడుదలకు రెండు రోజుల ముందు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అదరగొట్టారు. ఇదే ట్రెండ్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఫాలోయ్యాడు. విన్నర్ ని ఇదే విధంగా రిలీజ్ చేశాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టర్న్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు కూడా ఇలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.
ఆడియో వేడుక కాకుండా ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఓ లాభం వుంది. గతంలో ఆడియో వేడుకలు , సినిమా రిలీజ్ కి ఒక పదిరోజుల ముందే జరిగిపోయేవి. ఇలా జరిగితే రిలీజ్ సమయానికి ఆ జోరు చల్లబడిపోయేది. అలా కాకుండా విడుదల తేది పక్కా చేసుకొని రెండు రోజుల గ్యాప్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో వేడి పెంచి అదే వేడిలో సినిమాని థియేటర్ లోకి తీసుకొని రావడమే ఉత్తమమైన మార్గమని నిర్ణయానికి వచ్చేశారు మెగా హీరోలు. మొత్తానికి ఈ ట్రెండ్ చూస్తుంటే.. ఇక ఆడియో వేడుకలకు మంగళం పాడేసినట్లు కనిపిస్తోంది మెగా ఫ్యామిలీ.