‘మా’ పగ్గాలు మారబోతున్నాయి. అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ పదవీ కాలం పూర్తవ్వడంతో… ఆయన స్థానంలో ఆ సీటులోకి మరో కొత్త వ్యక్తి రాకకు మార్గం సుగమం అవుతోంది. రెండేళ్ల క్రితం మా అధ్యక్షుడి పీఠం కోసం పోటాపోటీ ఎన్నికలు జరిగాయి. అటు రాజేంద్ర ప్రసాద్ వర్గం, ఇటు నరేష్ వర్గం నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోటీలో రాజేంద్రప్రసాద్ గెలవడం, ఆ తరవాత రెండు గ్రూపులూ ఒక్కటిగా పనిచేయడం తెలిసిన విషయాలే. ఇప్పుడు మాత్రం అలాంటి పోటీ ఏమీ లేకుండా, ఎన్నికలు జరపకుండా అధ్యక్షుడిని ఏక గ్రీవంగా ఎంచుకోవాలని, అందరూ ఒకే తాటిపై కలసి పనిచేయాలని ‘మా’ సభ్యులు భావిస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా ముందు వరుసలో ఉన్నాడు. శివాజీ రాజాని అధ్యక్షుడి స్థానంలో కూర్చోబెట్టాలని ప్రస్తుతం ఉన్న ‘మా’ కార్య వర్గ సభ్యమంతా భావిస్తుండడంతో.. శివాజీరాజాపై ఎంత గురి ఉన్నదన్నది అర్థమవుతోంది.
నిజాంగానే ఆ స్థానంలో కూర్చోవడానికి శివాజీ రాజా నూటిని నూరు పాళ్లూ అర్హుడు. ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా చేసిన శ్రమ, పడిన కష్టం.. అందరినీ ఆకట్టుకొన్నాయి. అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఏం చేశారో తెలీదు గానీ, ఆయన వెనుక వుండి, నడిపించింది, అన్ని వేళళా ‘మా’కి అండదండగా నిలిచింది మాత్రం శివాజీ రాజానే. నటకిరీటి తన సినిమాలతో, తన వేషాలతో బిజీగా ఉన్నప్పుడు… ఆ స్థానంలో.. ‘మా’ని ముందుకు నడిపించాడు శివాజీ రాజా. నిజానికి రాజేంద్ర ప్రసాద్ ధైర్యం కూడా శివాజీ రాజానే. ‘మా’లో అర్హులైన సభ్యులకు పించన్లు రావడానికి, లైఫ్ ఇన్సురెన్సులు, ఆరోగ్య భీమా పధకాలలో ‘మా’ సభ్యులకు స్థానం కల్పించడానికి శివాజీ రాజా చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా ఎవ్వరూ చేయలేని పనులు ఈరోజున ‘మా’ టీమ్ చేయగలిగిందంటే అదంతా శివాజీ రాజా కష్టమే. అలాంటి శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉంటే.. మరింత బాగుంటుందన్నది ‘మా’ నమ్మకం. మరోవైపు పోయిన సారి జరిగిన అంతర్గత కుమ్ములాటలకు ఈసారి చోటివ్వకూడదని సినీ పెద్దలు భావిస్తున్నారు. అందరూ కూర్చుని మాట్లాడుకొని, సామరస్యపూర్వకంగా తమందరి తరుపునుంచి ఒకర్ని ఎంచుకొని, కలసి పనిచేయాలని దాసరి, కృష్ణ లాంటి సినీ పెద్దలూ చెబుతున్నమాట. మొత్తానికి `మా`కి మంచి ఆలోచననే వచ్చింది. పనిచేయగలిగేవాడ్ని, పనులు దగ్గరుండి చేయించేవాడ్నీ ఆ పీఠంలో కూర్చోబెడుతున్నారు. మరో రెండేళ్లు ‘మా’ అభ్యున్నతికి ఢోకా లేనట్టే.