ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకే, ఆయన విదేశాలకు వెళ్లినా ఏపీ ఇమేజ్ గురించీ, అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి, ఆంధ్రాలో ప్రపంచస్థాయి నిర్మాణాల ప్రణాళికల గురించి చెబుతూ వచ్చారు. ఆ మధ్య దావోస్ వెళ్లొచ్చా… ప్రపంచం అంతా ఆంధ్రావైపు చూస్తోందన్న రేంజిలో మాట్లాడారు. రాష్ట్రానికి సానుకూల ప్రచారం చేయడం మంచిదే. కానీ, కేవలం ‘ప్రచారం’ మీద మాత్రమే శ్రద్ధ బాగా ఎక్కువ పెట్టేస్తూ ఉండటం సరికాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది.
తాజాగా ఏపీకి స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించింది సి.ఎన్.బి.సి. టీవీ18. ఈ అవార్డును అందుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం పంపింది. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం అద్భతంగా ఉందనీ, సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రంలో ఉందనీ, వృద్ధి రేటు కూడా బాగుందనీ.. ఇలాంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీకి ఈ అవార్డు ఇచ్చారంటూ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు.
సరే… నిన్నమొన్నటివరకూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందీ అంటూ చెప్పుకొచ్చారు. అందువల్లనే ఏపీకి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడుల వరద వచ్చేసిందంటూ.. భాగస్వామ్య సదస్సును చూపించి కొన్నాళ్లు ఊదరగొట్టారు. ఏకంగా రూ. 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ఘనంగా చెప్పుకున్నారు. కానీ, వాటిలో వాస్తవరూపం దాల్చే ఎమ్.ఒ.యు.లు ఎన్ని అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. కొత్త పరిశ్రమల ఏర్పాటు ఎప్నట్నుంచీ ఉంటుందీ.. ఉద్యోగాల కల్పన ఏనాటికి జరుగుతుందీ అనేవి కూడా ఇంకా కాలమే నిర్ణయించాలి. అమరావతి మాస్టర్ ప్లాన్ అంటూ కూడా ఇదే స్థాయి ప్రచారం కల్పించుకుంటున్నారు. ఓ అంతర్జాతీయ వాణిజ్య సదస్సుకు చంద్రబాబును ఆహ్వానిస్తే… అక్కడ కూడా అమరాతి మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడేస్తామని ప్లాన్ పంపారు. ఆ టాపిక్ వద్దని వారు అనడం, ఆ సదస్సుకు చంద్రబాబు వెళ్లకపోవడం.. అది వేరే కథ. తాజాగా, ఈ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది.
ప్రపంచానికి చంద్రబాబు చూపుతున్న ఆంధ్రా అభివృద్ధి అంతా కేవలం ప్రెజెంటేషన్లకే పరిమితం అవుతోందన్న విమర్శ వినిపిస్తూనే ఉంది. రాజధాని నిర్మాణం మొదలు కాలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. ప్రత్యేక హోదా అటకెక్కిపోయింది. ప్యాకేజీకి చట్టబద్ధత ఏమైందో.. ఎవ్వరికీ తెలీదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మారిపోయిన పరిస్థితేం లేదు! వీటన్నింటికీ కప్పిపుచ్చుతూ… ఆంధ్రా అద్భుతః అని బయట ప్రపంచానికి చూపించడం అనేది ఎంతవరకూ కరెక్ట్..? ఆ ప్రాతిపదిక అవార్డులు, గుర్తింపు అందుకోవడం ఎంతవరకూ సరైంది..? ఈ ప్రచార నీటి బుడగ ఏదో ఒక రోజు బద్దలు అవుతుంది కదా!
ఆంధ్రాకు అవార్డు రావడాన్ని లేదా గుర్తింపు లభించడాన్ని ఎవ్వరూ తప్పుబట్టడం లేదు. కానీ, అలాంటి గుర్తింపుల కోసం మాత్రమే చంద్రబాబు సర్కారు పాకులాడుతున్నట్టుగా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఏపీ అభివృద్ధి మేడిపండు చందం అవుతుందేమో అనేది సామాన్యుడి ఆవేదన.